'నేను ఒకడిని కావడం గర్వంగా ఉంది'
మంబై: ప్రధాని నరేంద్ర మోడీ 'స్వచ్ఛ భారత్' కోసం తొమ్మిది మందిని ఆహ్వానించి వారిలో నేను ఒకరిని కావడం గర్వంగా ఉందని ప్రముఖ నటుడు, పద్మశ్రీ కమల్ హాసన్ తెలిపారు. తొమ్మిది మంది జాబితాలో తన పేరు ఉన్నందుకు ప్రధాని మోడీకి కమల్ ధన్యవాదాలు తెలిపారు. 'స్వచ్ఛ భారత్' కోసం మోడీ విసిరిన సవాల్ ప్రతిష్టాత్మక ఆహ్వానమని ఆయన అభివర్ణించారు. తనను పేరు ఆ జాబితాలో చేర్చడం మోడీ ఔదార్యానికి నిదర్శనమన్నారు. గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీన న్యూఢిల్లీలో 'స్వచ్ఛ భారత్'ను ప్రధాని మోడీ ప్రారంభించారు. వచ్చే ఐదేళ్ల కాలంలో భారతదేశాన్నీ క్లీన్ ఇండియాగా మార్చాలని ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ప్రధాని మోడీ పరిశుభ్ర భారతావని ఆవశ్యకతపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలంటూ పలు రంగాల్లోని తొమ్మిది మంది ప్రముఖులకు ఆహ్వానం పలికారు. అలాగే ఆ ప్రముఖుల్లో ఒక్కొక్కరూ మరో తొమ్మిది మందిని ఈ ప్రచారంలో పాల్గొనాల్సిందిగా కోరాలని సూచించారు. మోడీ ఎంపిక చేసిన తొమ్మిది మంది ప్రముఖుల్లో క్రికెట్ దిగ్గజం భారతరత్న సచిన్ టెండూల్కర్, పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్, నటులు కమల్‌హాసన్, సల్మాన్‌ఖాన్, ప్రియాంకా చోప్రా, గోవా గవర్నర్ మృదుల సిన్హా, తారక్ మెహతాతోపాటు ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఉన్నారు.