
'ఇక ఉంటాను.. త్వరలో నాకు ఉరి'
లండన్: వారు చేసింది తప్పే అయినా.. ఉరికంబం ఎక్కడానికి ముందు వారి స్పందనలు మాత్రం కళ్లు చెమ్మగిల్లేలా చేస్తున్నాయి. మత్తుపదార్థాల రవాణాకు పాల్పడిన ఏడుగురు నిందితులను నిర్దాక్షిణ్యంగా ఇండోనేషియా ఉరితీసిన వరుసలోనే తాజాగా బ్రిటన్కు చెందిన 'లిండ్ సే సాండీఫోర్డ్(58)' అనే పెద్దావిడ చేరబోతుంది. ఇలాంటి కేసులోనే త్వరలో ఇండోనేషియా ఆమెను ఉరితీయబోతుంది. ఈ సందర్భంగా ఆమె కడసారిగా తన కుటుంబీకులకు, బంధువులకు లేఖలు రాసింది. ఉరి సమీపిస్తున్న తరుణంలో ఆమె తీవ్ర దుఃఖసాగరంలో మునిగినట్లుగా వాటిద్వారా స్పష్టమైంది.
ఆ లేఖలో 'ఇక అందరికీ సెలవు.. నన్ను ఏక్షణమైనా ఉరితీయొచ్చు. బహుషా నన్ను రేపే ఈ సెల్లోంచి ఉరి తీసే ప్రాంతానికి తరలించవచ్చు' అని లేఖలో రాసింది. 58 ఏళ్ల సాండీ ఫోర్డ్ ఇంగ్లాండ్లోని రెడ్ కార్ ప్రాంతానికి చెందిన మహిళ. ఆమె 2013లో బాలీలో మత్తుపదార్థాల రవాణ కేసులోనే పట్టుబడింది. ఈ కేసులో ఆమెకు ఉరిశిక్ష పడింది. ఈ సందర్భంగా ఆమెను ఇంగ్లాండ్కు చెందిన ఓ మీడియా సంప్రదించగా.. తనను ఉరి తీసే సందర్భంలో మ్యాజిక్ మూమెంట్స్ అనే ప్రముఖ గీతాన్ని పాడాలనుకుంటున్నాననే విషయం చెప్పింది. ఉరి తీస్తుండటంవల్ల తనకు పెద్దగా బాధ లేదని, ధైర్య వంతురాలినని పేర్కొంది.
అయితే, తాను అరెస్టు అయిన తర్వాత జన్మించిన తన మనుమరాలికి ఇప్పుడు రెండేళ్లని.. తాను ఆ పాపను ఇంతవరకు చూడలేదని, ఇక చూడలేనేమోనని దుఃఖించింది. డ్రగ్ సిండికేట్ దారులు తన కొడుకును హతమారుస్తామని బెదిరించడంవల్లే తప్పనిసరి పరిస్థితిలో ఆ పని చేయాల్సి వచ్చిందని చెప్పింది. తన జీవితంలో ఉన్న నిజమైన హీరోల్లో అంతకుముందు ఉరితీయబడిన ఆండ్రూ చాన్ ఒకరని ఆమె తెలిపింది.