న్యూఢిల్లీ: ఆదాయ పన్ను బకాయిలు చెల్లించాలని, ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని ఆదేశిస్తూ మరో 35,000 మందికి ఆదాయ పన్ను విభాగం ఈ వారం లేఖలు రాసింది. దీంతో మొత్తం 2.45 లక్షల మందికి లేఖలు పంపినట్లయింది. దాదాపు 12 లక్షల మంది రిటర్నులు దాఖలు చేయడం లేదని గుర్తించిన ఆదాయ పన్ను శాఖ వారిపై చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఈ విభాగంలో ఇప్పటిదాకా 3,44,365 రిటర్నులు దాఖలయ్యాయి. అసెస్సీలు రూ. 577 కోట్ల మేర సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్, రూ. 408 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కూడా చెల్లించినట్లు ఐటీ విభాగం తెలిపింది. ఈ ప్రయత్నం విజయవంతం అయిన నేపథ్యంలో 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరంలో భారీ లావాదేవీలు నిర్వహించిన వారిపైనా దృష్టి సారించాలని భావిస్తున్నట్లు వివరించింది.
ఈ-రిటర్న్ కాపీలు తక్షణమే పంపాలి: ఐటీ విభాగం
గడిచిన 2 అసెస్‌మెంట్ సంవత్సరాలకు ఐటీ రిటర్నుల కాపీలను పంపించని పక్షంలో, వాటిని సాధ్యమైనంత త్వరగా బెంగళూరు కేంద్రానికి పంపాలని ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫైలింగ్ చేసిన వారికి ఐటీ విభాగం సూచించింది. ఒకవేళ పంపించినప్పటికీ.. అక్నాలెడ్జ్‌మెంట్ అందని వారు సైతం మరోసారి పంపాలని పేర్కొంది. తద్వారా పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్నులను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఐటీ విభాగం తెలిపింది.
రిటర్నులపై మరో 35వేల మందికి ఐటీ లేఖలు
Published Sat, Sep 14 2013 2:44 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
Advertisement
Advertisement