Non-filers
-
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదో..ఇక అంతే
పన్ను ఎగవేతదారులపై కొరడా ఝుళిపించిన ఆదాయపు పన్ను శాఖ, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనివారిపై కూడా సీరియస్ గా స్పందించింది. దీనిపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నాన్-ఫైలర్స్ పై అధికమొత్తంలో జరిమానా, విచారణలకైనా వెనుకాడవద్దని ఆఫీసర్లకు ఆదాయపు పన్ను విభాగం ఆదేశించింది. సెక్షన్ 271ఎఫ్ కింద పెనాల్టీ, 276సీసీ కింద ప్రాసిక్యూషన్ ను అమలు చేయబోతున్నట్టు వెల్లడించింది. ఆస్తిపాస్తులను నమోదుచేయని నాన్-ఫైలర్స్ ఎక్కువగా పెరిగిపోతుండటంతో ఆదాయపు పన్ను విభాగం ఈ చర్యలకు ఉపక్రమించింది. 2014లో 22.09లక్షలుగా ఉన్న నాన్-ఫైలర్స్, 2015లో 58.95లక్షలకు పెరిగారని గణాంకాల్లో తెలిసింది. తాజా పన్ను అధికారుల కాన్ఫరెన్స్ లో ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆస్తిపాస్తుల వివరాలు తెలపని వారి కోసం నాన్-ఫైలర్స్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎమ్ఎస్)ను అమలు చేయబోతున్నట్టు పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా నాన్ ఫైలర్స్ గుర్తించవచ్చని తెలిపింది. 271సీసీ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు ఫైన్ విధించే అవకాశముంది. అలాగే 271ఎఫ్ కింద పెనాల్టీగా రూ.1000 నుంచి రూ.5000గా విధించనుంది. దీనికి సంబంధించి మరిన్ని మార్గదర్శకాలను ఐటీ శాఖ విడుదల చేసింది. -
రిటర్నులపై మరో 35వేల మందికి ఐటీ లేఖలు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను బకాయిలు చెల్లించాలని, ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని ఆదేశిస్తూ మరో 35,000 మందికి ఆదాయ పన్ను విభాగం ఈ వారం లేఖలు రాసింది. దీంతో మొత్తం 2.45 లక్షల మందికి లేఖలు పంపినట్లయింది. దాదాపు 12 లక్షల మంది రిటర్నులు దాఖలు చేయడం లేదని గుర్తించిన ఆదాయ పన్ను శాఖ వారిపై చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఈ విభాగంలో ఇప్పటిదాకా 3,44,365 రిటర్నులు దాఖలయ్యాయి. అసెస్సీలు రూ. 577 కోట్ల మేర సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్, రూ. 408 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కూడా చెల్లించినట్లు ఐటీ విభాగం తెలిపింది. ఈ ప్రయత్నం విజయవంతం అయిన నేపథ్యంలో 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరంలో భారీ లావాదేవీలు నిర్వహించిన వారిపైనా దృష్టి సారించాలని భావిస్తున్నట్లు వివరించింది. ఈ-రిటర్న్ కాపీలు తక్షణమే పంపాలి: ఐటీ విభాగం గడిచిన 2 అసెస్మెంట్ సంవత్సరాలకు ఐటీ రిటర్నుల కాపీలను పంపించని పక్షంలో, వాటిని సాధ్యమైనంత త్వరగా బెంగళూరు కేంద్రానికి పంపాలని ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫైలింగ్ చేసిన వారికి ఐటీ విభాగం సూచించింది. ఒకవేళ పంపించినప్పటికీ.. అక్నాలెడ్జ్మెంట్ అందని వారు సైతం మరోసారి పంపాలని పేర్కొంది. తద్వారా పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్నులను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఐటీ విభాగం తెలిపింది.