
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదో..ఇక అంతే
పన్ను ఎగవేతదారులపై కొరడా ఝుళిపించిన ఆదాయపు పన్ను శాఖ, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయనివారిపై కూడా సీరియస్ గా స్పందించింది. దీనిపై సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నాన్-ఫైలర్స్ పై అధికమొత్తంలో జరిమానా, విచారణలకైనా వెనుకాడవద్దని ఆఫీసర్లకు ఆదాయపు పన్ను విభాగం ఆదేశించింది.
సెక్షన్ 271ఎఫ్ కింద పెనాల్టీ, 276సీసీ కింద ప్రాసిక్యూషన్ ను అమలు చేయబోతున్నట్టు వెల్లడించింది. ఆస్తిపాస్తులను నమోదుచేయని నాన్-ఫైలర్స్ ఎక్కువగా పెరిగిపోతుండటంతో ఆదాయపు పన్ను విభాగం ఈ చర్యలకు ఉపక్రమించింది. 2014లో 22.09లక్షలుగా ఉన్న నాన్-ఫైలర్స్, 2015లో 58.95లక్షలకు పెరిగారని గణాంకాల్లో తెలిసింది.
తాజా పన్ను అధికారుల కాన్ఫరెన్స్ లో ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆస్తిపాస్తుల వివరాలు తెలపని వారి కోసం నాన్-ఫైలర్స్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎమ్ఎస్)ను అమలు చేయబోతున్నట్టు పేర్కొంది. ఈ ప్రాజెక్టు ద్వారా నాన్ ఫైలర్స్ గుర్తించవచ్చని తెలిపింది. 271సీసీ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్షతో పాటు ఫైన్ విధించే అవకాశముంది. అలాగే 271ఎఫ్ కింద పెనాల్టీగా రూ.1000 నుంచి రూ.5000గా విధించనుంది. దీనికి సంబంధించి మరిన్ని మార్గదర్శకాలను ఐటీ శాఖ విడుదల చేసింది.