ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ బిడ్డకు జన్మనివ్వడమంటే మహిళకు మరో జన్మ. గర్భంలో పాపాయి రూపు దిద్దుకోవడం మొదలు, ప్రసవం దాకా నిరంతరం పర్యవేక్షణ అవసరం. స్వయంగా గర్భిణీతోపాటు, కుటుంబ సభ్యులు, చికిత్స అందించే వైద్యులు అప్రమత్తంగా ఉండాల్సిందే. కానీ వైద్యుల నిర్లక్ష్యం ఇద్దరు చిన్నారులకు కన్నతల్లిని దూరం చేసింది. మలేసియాలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈకేసులో ఆ దేశ కోర్టు ఇచ్చిన తీర్పు నెట్టింట చర్చకు దారి తీసింది.
2019లో జరిగిన సంఘటన ఇది. 36 ఏళ్ల పునీత మోహన్(Punita Mohan) రెండో కాన్పుకోసం ఆస్పత్రి లో చేరింది. అయితే ప్రసవం తరువాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. పోస్ట్‌పార్టమ్ హెమరేజ్ (Postpartum Hemorrhage) కారణంగా విపరీత రక్తస్రావం అయింది. నొప్పితో ఆమె విలవిల్లాడి పోయింది. బ్లీడింగ్ అవుతోందని ఆమె తల్లి ఆమెకు వైద్యం చేసిన వైద్యడు డాక్టర్లు రవి, క్లినిక్ యజమాని షణ్ముగానికి చెప్పినప్పటికీ పట్టించుకోలేదు. ప్రాణాంతకమని తెలిసినా నిర్ల్యక్ష్యంగా వ్యవహరించారు. పైగా మావిని చేతితో తీయడం వల్ల రక్తస్రావం అవుతోందని, అంతా సర్దుకుంటుందని కుటుంబ సభ్యులకు చెప్పి ఎటో వెళ్లి పోయారు. రెండు గంటలు గడిచిన తరువాత కూడా ఆమె గురించి వాకబు చేయలేదు. పరిస్థితి విషమించడంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. తన కళ్ల ముందే తన బిడ్డ ఊపిరి తీసుకోవడానికి కష్టపడి నానాయతన పడిందని, ఇద్దరు చిన్నారులకు తల్లిని దూరం చేశారంటూ పునీత తల్లి కన్నీటి పర్యంతమైంది.
ఈ కేసును విచారించిన హైకోర్టు బాధిత కుటుంబానికి రూ.11.42 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఈ మరణం సంభవించి ఉండేది కాదని కోర్టు పేర్కొంది. వైద్యులు రోగికి భద్రత కల్పించకుండా, గంటల తరబడి వదిలివెళ్లడం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించింది. అంతులేని నిర్లక్ష్యం కారణంగానే పునీత మరణించిందని ఆగ్రహించిన కోర్టు ఇద్దరు వైద్యులకు భారీ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment