డాక్టర్ కామేశ్వరి
అంతరంగం
చలంగారి ఉత్తరాలను ఎందరో ప్రచురించారు. దాదాపు 60 సంవత్సరాల తర్వాత నా ఉత్తరాలు ఇప్పుడు ప్రచురిద్దా మనుకుంటున్నాను.
చలంగారు ఉన్న రోజుల్లోనే - 1960 ప్రాంతంలో, ఎవరో చలంగారి ఉత్తరాలు ప్రచురించాలనే కోరికతో, వారిని అడిగారట. ‘‘ఈమధ్య రాసిన ఉత్తరాల్లో కామేశ్వరికి మంచి ఉత్తరాలు రాశాను. అడగండి. ఆమె ఒప్పుకుంటే ప్రచురణకు వెళ్లండ’’న్నారట. ‘‘నాన్నా ఈ ఉత్తరాలు మీరు ప్రేమతో నాకు రాసినవి, దీనివల్ల ప్రపంచానికి ఏమి ఉపయోగం. వద్దులెండి. ఇవి నా కోసమే ఉంచుకుంటాను’’ అని అన్నాను. అది తప్పేమోనని నాకు ఈ మధ్యవరకు అనిపించనేలేదు.
నేను 13-14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే చలంగారి పుస్తకాలు నాకు దొరికినవి చదివాను. పురూరవలోని ఊర్వశి, శశాంకలోని తార, జీవితాదర్శంలోని లాలస, అరుణలోని అరుణ, చలంగారి ఇతర స్త్రీ పాత్రలన్నీ నన్నాశ్చర్యపరిచేవి.
తర్వాత కాలంలో అడిగాను గూడా చలంగారిని. ‘‘నాన్నా నిజంగా మీరు ఇలాంటి స్త్రీలని చూశారా? అంతటి సౌందర్యవంతులు, అటువంటి స్థైర్యం ఉన్నవారు, అంతటి శృంగారమూర్తులు, జీవితం యెడల అంత చక్కటి అవగాహన ఉన్నవారు ఉన్నారంటారా? అసలు కాస్తై అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లని చూడకపోతే, ఎలా సృష్టించారు అలాంటి పాత్రలని’’ అని. నాన్న అనేవారు ఎంతో ఆలోచించి, ‘‘దాదాపు లేరు. కాస్త లీలగారు, కాస్త పద్మావతి పిన్ని’’ అని.
నేను పెద్దయ్యాక తప్పక చూడాలనుకున్న వ్యక్తులలో చలం గారు ఒకరు. నేను 3, 4వ సంవత్సరం ఎంబీబీఎస్‌లో ఉండగా ‘‘కవిగా చలం’’ వజీర్ రెహమాన్ రాసిన పుస్తకం చదివాను. మళ్లీ చలంగారిని చూడాలనే వెర్రి కోరిక వచ్చింది. కనీసం వారంటే, వారి రచనలంటే నాకెంత అభిమానమో తెలియజేస్తూ ఒక ఉత్తరమైనా రాయాలనిపించింది. కాని వారెంతో గొప్ప కవి. వారికెంతమంది ఫ్యాన్స్ ఉంటారో! ఆఫ్ట్రాల్ ఒక చిన్న కాలేజీ స్టూడెంట్‌ని, వారికేం గొప్ప? జవాబయినా ఇస్తారో, ఇవ్వరో? ఆయన జవాబయినా ఇవ్వకపోతే నా అహం దెబ్బతింటుంది. ఇప్పటివరకూ వున్న గౌరవాభిమానాలు కూడా తగ్గిపోతాయేమో అని భయం. అందుకే ఉత్తరం రాయలేదు. నేను సెలవుల్లో మద్రాసులో ఉన్నాను.
ఆ రోజుల్లోనే నండూరి సుబ్బారావుగారు పోయారు. ఒంటరిగా ఉన్న జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి గారు మా ఇంటికి వచ్చి నండూరి వారినీ, వారి స్మృతులనూ తలచుకుంటూ కంటతడి పెట్టుకుని మా ఇంట్లోనే ఉండిపోయారు. ఆ మర్నాడు చెప్పాను. కవిగా చలం చదివాక నా భావాలు, చిన్నప్పటి నుండి చలం గారిని చూడాలనే వెర్రి కోరికను. ఆయనకు కనీసం ఉత్తరం రాయాలన్న ఆకాంక్షను, రాయలేకపోవడానికి కారణాలను అన్నీ చెప్పాను. ఆ తరువాత ఆ సంగతి కూడా మర్చేపోయాను.
కొన్నాళ్లకి ఒక మంచి ఉత్తరం వచ్చింది చలంగారి నుండి! నమ్మలేకపోయాను. ఆశ్చర్యంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఉత్తరంలో-
3/6/57
Dear unknown friend,
మీరు నన్ను చూడాలనుకోవడం, నాకు సన్మానం. అలాంటి వాంఛ మన మనసుని మించి నరాల్లోకి ఇంకి హృదయాన్ని చేరుకుంటే, ఇక దేహాలు చూసుకోవడమనేది స్వల్ప విషయమౌతుంది.
జీవితం- తప్పవు ఆశలు, నిరాశలు, ambitions.
కాని ఏ స్థితిలోనూ హృదయంలోని అందమైన విలువల్ని అడుగున పడనీకండి- ఎన్ని కష్టాలు అడ్డం వచ్చినా సరే.
ఈశ్వరాశీర్వాదాలతో,
చలం.
ఎంతో మంచి ఉత్తరం. అదీ వారంతట వారే రాయడం. వారే మొదటిసారిగా ఉత్తరం రాసింది నాకేనట! ఎంత అదృష్టవంతురాలిని!
ఆ తరువాత ఎన్నో ఉత్తర ప్రత్యుత్తరాలు మా మధ్య. ఎన్నెన్ని పేజీలు నింపి రాసేవారో!
డాక్టర్ కామేశ్వరి