అమ్మానాన్నకు చదువు
తల్లిదండ్రులకు అక్షరజ్ఞానం నేర్పేది వారే..
వయోజన విద్యలో వినూత్న కార్యక్రమం
వచ్చే నెల 1 నుంచి మార్చి 31 వరకు నిర్వహణ
8, 9 తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేకం
గీసుకొండ : నిరక్షరాస్యులైన వారికి అక్షర జ్ఞానం నేర్పే బాధ్యత వారి పిల్లలకు అప్పగించడం ద్వారా ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వయోజన విద్యలో భాగంగా ‘అమ్మానాన్నకు చదువు’ పేరిట వచ్చే నెల 1వ తేదీ నుంచి నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో చదివే 8, 9వ తరగతుల విద్యార్థులు నిరక్షరాస్యులైన వారి తల్లిదండ్రుకు ఇక సాయంత్రం వేళల్లో అక్షరాలు నేర్పించాల్సి ఉంటుంది.
విద్యార్థులే ఎందుకు..?
పొలం పనులకు వెళ్లిన కూలీలు సాయంత్రం వేళ అలసిపోయి ఇంటికి తిరిగొస్తారు. అలా వచ్చిన వారు గ్రామాల్లో వయోజన విద్యా కేంద్రాలు అందుబాటులో ఉన్నా అక్కడకు వెళ్లి అక్షరాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక మరికొందరు వయస్సు మీద పడుతుండగా ఇప్పుడు చదువు ఎందుకంటూ ఊరుకుంటున్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజాగా ‘అమ్మానాన్నకు చదువు’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. గ్రామీణులకు బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపించని విషయాన్ని గుర్తించి.. పిల్లలతోనే తల్లిదండ్రులకు చదువు చెప్పించాలన్న భావనతో కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సాధారణంగా ఎవరు చెప్పినా వినిపించుకోని వారు తమ పిల్లలు చెబితే వింటారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులకు అక్షర జ్ఞానం నేర్పే తెలివితేటలు ఉన్న విద్యార్థులను, నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న తల్లిదండ్రులను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేస్తున్నారు.
ముందుగా విద్యార్థులకు శిక్షణ..
జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో 8,9వ తర గతి చదువుతున్న విద్యార్థులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు పాఠశాలల హెచ్‌ఎంలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఎందరు నిరక్షరాస్యులో తెలుసుకుంటున్నారు. ప్రతీ పాఠశాల నుంచి నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ఉపాధ్యాయులు రెండు మూడు గంటల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈక్రమంలో వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున పదో తరగతి విద్యార్థులకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఇదే క్రమంలో 8, 9వ తరగతుల విద్యార్థులైతే రెండేళ్ల పాటు తల్లిదండ్రులకు చదువు నేర్పించే వెసలుబాటు ఉంటుందనే విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతీ పాఠశాలలో 8, 9వ తరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రుల్లో సుమారు 15 నుంచి 20 మంది వరకు నిరక్షరాస్యులు ఉంటారని.. వీరిని అక్షరాస్యులను చేయడానికే ఈ కార్యక్రమాన్ని రూపొందించారని అధికారులు చెబుతున్నారు.
పుస్తకాలు రెడీ..
‘అమ్మానాన్నకు చదువు’ కార్యక్రమానికి అవసరమైన పుస్తకాలను వయోజన విద్య శాఖ అధికారులు ఇప్పటికే రూపొందించి జిల్లాలోని అన్ని మండలాలకు పంపిణీ చేశారు. తెలంగాణ యాసలో సులువుగా బోధించడం, అక్షరాలను నేర్చుకునేలా పాఠ్యాంశాలు రూపొందిస్తూ రెండు భాగాలుగా పుస్తకాలు తీసుకొచ్చారు. అయితే, ఈ కార్యక్రమం విజయవంతం కోసం సాక్షర భారత్ మండల, గ్రామ కోఆర్డినేటర్లు కృషి చేయాల్సి ఉంటుంది.