సాక్షి, హైదరాబాద్: బి.నర్సింగ్‌రావు... తెలంగాణ చిత్రానికి ప్రపంచస్థాయి గౌరవాన్ని తెచ్చిన ప్రముఖ దర్శకుడు. తెలుగు సమాజానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చిరపరిచితుడు. ఆయన ఇటీవల సామాజిక మాధ్యమ వేదికగా మంత్రి కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
40 రోజులుగా తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ‘ఎక్కడ పుట్టిన కమలాలు మీరు’అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. తన పట్ల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న తీరును గర్హిస్తూ ఆయన రాసిన లేఖలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి.
లేఖలో ఏముందంటే..
‘‘తెలంగాణ ప్రభుత్వం ఆధునిక హంగులతో నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‘ నుంచే ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ తన పర్యవేక్షణలన్నీ కొనసాగిస్తోంది. వారికెందుకో నేను కూడా టార్గెట్ అయ్యాను. నేను ఎవరితో ఫోన్లో మాట్లాడినా దాన్ని అడ్డుకుంటున్నారు. అవతలివాళ్లు మాట్లాడేది నాకు వినబడకుండా చేస్తున్నారు. 2014 నుంచి ఫోన్ టాపింగ్‌కు గురవుతోంది. 2018 జనవరి నుంచి నా ఫోన్ కాల్స్‌ను అడ్డుకుంటున్నారు. ఐదున్నరేళ్లుగా నాకు నరకం చూపిస్తున్నారన్నారు. రెండుసార్లు కేటీఆర్‌ను కలిసి ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదు.’’అని పేర్కొన్నారు.
అకారణంగా వేధిస్తున్నారు..
ప్రభుత్వం 8 ఏళ్లుగా తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తోందని నర్సింగ్‌రావు చెప్పారు. ఎవరితోనూ మాట్లాడనీయకుండా బంధువులు, స్నేహితులు, సామాజిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన సంస్థలు, వ్యక్తులకు తనను దూరం చేస్తోందని, మానసికంగా వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం ఫోన్‌పైనే ఆధారపడి కొనసాగుతోంది. అలాంటిది మొబైల్ ఫోన్‌ను తననుంచి దూరం చేసి ప్రభుత్వం తన జీవన గమనాన్నే అడ్డుకుంటోందని ఆయన ‘సాక్షి’తో వాపోయారు.
ప్రపంచంతో తన సంబంధాలన్నీ నిలిచిపోయాయని, చివరకు బంధువుల్లో ఎవరైనా చనిపోయినా సమాచారం అందుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను డాక్టర్‌తో మాట్లాడాలనుకున్నా మాట్లాడలేని పరిస్థితి. నన్ను కలిసేందుకు ఎవరైనా రావాలనుకున్నా ఫోన్‌లో ఆ విషయం చెప్పలేని స్థితి నెలకొంది’’అని వెల్లడించారు. ప్రభుత్వం తనను అకారణంగా వేధిస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ ఇలాంటి దుస్థితిని ఎదుర్కోలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment