జనరిక్ మందులను పెద్ద అక్షరాలతో రాయాలి
మంత్రి కామినేని ఆదేశం
కాకినాడ వైద్యం(కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై వైద్యులందరూ విధిగా రోగులకు జనరిక్ మందులను పెద్ద అక్షరాలతో రాయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖమంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ధీరూబాయి లేబొరేటరీ పక్కన రూ.1.50 కోట్లతో కొనుగోలు చేసిన అత్యాధునిక జీఈ కంపెనీకి చెందిన 16 స్లైస్ సిటీ స్కాన్ మెషీన్‌ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లోటుబడ్జెట్‌లో ఉన్నా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యపరికరాలు, వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. జీజీహెచ్‌లో రోగులకు వైద్యులు సమష్టిగా నాణ్యమైన వైద్య సేవలందించడంతో ఓపీ సంఖ్య పెరుగుతుందన్నారు. ఆసుపత్రిలో 1,065 పడకలుండగా, 1,800 మంది ఇన్‌పేషెంట్లకు చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. సిటీస్కాన్ ప్రస్తుతం విశాఖపట్టణం, కాకినాడలో ప్రారంభించామని, అనంతపురం, తిరుపతి, గుంటూరు ప్రభుత్వాసుపత్రుల్లో సిటీస్కాన్‌ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వైద్య సిబ్బందికి బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టామన్నారు. రూ.20 కోట్లతో ఎంసీహెచ్ బిల్డింగ్ నిర్మాణంలో ఉందని, ఇది పూర్తయితే మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆసుపత్రిలో శానిటేషన్ మెరుగుదలకు చర్యలు తీసుకున్నామన్నారు. నెలకు 1,000 ప్రసవాలు జరుగుతుండగా బేబీకిట్‌లను అందిస్తున్నామని, త్వరలో తల్లికి కూడా కిట్ అందిస్తామన్నారు. ఆసుపత్రికి 80 శాతం మందులు ప్రభుత్వం సరఫరా చేస్తుందని, మిగతా 20 శాతం మందుల కొనుగోలుకు నిధులు మంజూరు చేశామన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, డీఎంఈ డాక్టర్ బాబ్జి, జెడ్పీ అధ్యక్షుడు నామన రాంబాబు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ చంద్రయ్య, సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్ మహాలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య పాల్గొన్నారు.
స్టైఫండ్ కోసం ప్రశ్నించిన పీజీ వైద్యులపై మంత్రి ఆగ్రహం
నాలుగు నెలలుగా స్టైఫండ్ విడుదల కావడం లేదని, మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరిన పీజీ వైద్యులపై మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీస్కాన్ ప్రారంభోత్సవానికి ప్రభుత్వాసుపత్రికి విచ్చేసిన మంత్రిని పలువురు పిజీ విద్యార్థులు కలుసుకుని స్టైఫండ్ కోసం అడిగారు. అభివృద్ధి కార్యక్రమం కోసం వస్తే. ఇప్పుడా స్లైఫండ్ కోసం అడిగేది..మీ సమస్యలు లేవనెత్తడానికి ఇదా సమయమంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వైద్యులై ఉండి కూడా ఇలా అడగడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. అక్కడే ఉన్న డీఎంఈ డాక్టర్ బాబ్జి కలుగజేసుకుని తర్వాత మాట్లాడదాం అంటూ సర్ది చెప్పడంతో మంత్రి శాంతించారు.