సీఎం గారూ.. మీరు భలే సుందరాంగులు!!
ఒకళ్లు కారు.. ఇద్దరు కారు.. ఏకంగా ఐదు లక్షల మంది గత రెండు సంవత్సరాలలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు లేఖల మీద లేఖలు రాశారు. ఆయన జనతా దర్బార్, ముఖ్యమంత్రికి లేఖలు అనే కార్యక్రమాలు మొదలుపెట్టినప్పటి నుంచి ఈ లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. ''ముఖ్యమంత్రి గారూ, మీరు చాలా అందంగా ఉంటారు. నన్ను పెళ్లి చేసుకుంటారా'' అని వాటిలో చాలా లేఖలున్నాయి. అలాగే ఇంకా.. ''ముఖ్యమంత్రి గారూ, నా దగ్గర బొలెరో వాహనం లేదు. మీరు ఇస్తారా?'' అని, ''నేను మిమ్మల్ని సోదరుడిగా భావిస్తున్నాను. మీకు రాఖీ కట్టచ్చా'' అని.. ఇలా లెక్కలేనన్ని ఉత్తరాలు అఖిలేష్ యాదవ్కు వచ్చాయి.
ఈ ఉత్తరాలన్నింటికీ సమాధానాలు ఇవ్వడం కోసం ఈ దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించేందుకు ఓ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వాళ్లు ఓ డజను మంది కంప్యూటర్ నిపుణులను రంగంలోకి దించి, ప్రతిదానికీ బార్ కోడింగ్ చేసి, డిజిటైజేషన్ చేస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో ఓ ఆఫీసు ఏర్పాటు చేసింది. అందులో రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు. దాదాపు 4.75 లక్షల దరఖాస్తులు రాగా, వాటిలో 65 వేలకు తప్పనిసరిగా సమాధానాలివ్వాలని గుర్తించి, వాటిని సీఎం వద్దకు పంపుతున్నారు.