పోలీసులు స్వాధీనం చేసుకున్న ఉత్తరాలు, ఆధార్ కార్డులు
కీసర: ఇళ్లలోకి చేరాల్సిన ఉత్తరాలు, బ్యాంకు చెక్ బుక్కులు, ఆధార్ కార్డులు, నోటీసులు.. ఇలా ఒక్కటేమిటి అన్నీ చెత్త బుట్టలోకి చేరుతున్నాయి. ఆ తర్వాత ఓ ప్రదేశంలో కాలి బూడిదవుతున్నాయి. గుట్టలు గుట్టలుగా సంచుల్లో వాటిని తగలబెడుతుండగా పోలీసులు సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని అహ్మద్‌గూడలో ఉన్న ప్లాట్లకు సంబంధించి రాంపల్లిదాయరకు చెందిన రామిడి రాజిరెడ్డి, చింతల్‌కు చెందిన భిక్షపతి మధ్య వివాదం కొనసాగుతోంది.
ఈ వివాదాస్పద స్థలంలో శుక్రవారం భిక్షపతి పది సంచుల్లో తెచ్చిన ఉత్తరాలు కాల్చివేయడాన్ని గమనించిన రాజిరెడ్డి పోలీసులకు సమాచారం అందించాడు. కీసర ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్ సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే కొన్ని సంచులను కాల్చివేయగా మిగిలిన వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కూకట్‌పల్లి, బాలానగర్, చింతల్, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన ఉత్తరాలు, చెక్‌బుక్కులు, ఆధార్ కార్డులు, వివిధ బ్యాంకుల నోటీసు పత్రాలతో పాటు ఇతర పత్రాలు ఉండటంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోస్టల్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో సంబంధిత అధికారులు శనివారం కీసర పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకొని తీసుకెళ్లారు.
విచారణ చేపడతాం.. చిరునామా ప్రకారం సంబంధిత వ్యక్తులకు చేరాల్సిన ఉత్తరాలు, ఆధార్ కార్డులు, ఇతర కవర్లు ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడటం ఇదే మొదటిసారని సికింద్రాబాద్ తూర్పు డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ (ఏఎస్‌పీ) పవన్‌కుమార్ తెలిపారు. వాటిని తెచ్చి కాల్చివేయాల్సిన అవసరం భిక్షపతికి ఏంటి? అతడికి ఆ ఉత్తరాలు ఎవరు ఇచ్చారనే విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment