
స్మార్ట్‌ఫోన్‌లో సమాచారాన్ని టైప్(మెసేజ్) చేస్తున్న దృశ్యం
నెల్లూరు(బారకాసు):ఉత్తరం ఒక మధురమైన అనుభూతి.. గుండె గదిలో నిక్షిప్తమైన జ్ఞాపకాల తడి.. ఉత్తరాలు మన ఆత్మీయుల యోగక్షేమాలకు ఆనవాళ్లు.. ప్రేయసీ ప్రియుల్లో విరబూసిన పారిజాతాలు.. స్వాప్నికుల మనసులను రాగరంజితం చేసే ఊహా చిత్రాలు.. సరిహద్దుల్లో.. మంచుకురిసే రాత్రుల్లో పహారా కాస్తూ శత్రువుల గుండెలకు తుపాకీ ఎక్కుపెట్టిన సైనికుడు తన భార్యకు చేసుకునే హృదయ నివేదన.. ఉత్తరం కోసం ఎన్నెన్ని ఎదురుచూపులో.. ఎన్నెన్ని పడిగాపులో.. ఇలా మానవ సంబంధాలకు నిలయంగా వెలుగొందిన ఉత్తరాలు నేడు కనుమరుగయ్యాయి. సెల్‌ఫోన్లు, ఎస్‌ఎంఎస్, వాట్సాప్‌లు, ఈ–మెయిల్ లాంటి ఆధునిక సమాచార వ్యవస్థలు రావడంతో ఉత్తరం అస్థిత్వాన్ని కోల్పోయింది. రంగురంగుల లేఖలతో సీతాకోకచిలుక గుంపు వాలినట్లు కనిపించే ఇంట్లోని చిలక్కొయ్య(హ్యాంగర్) తోక లేని పిట్టలు(ఉత్తరాలు) లేక వెలవెలబోయింది.
మనసాగ‘లేఖ’
బంధువులు, మిత్రులు, ఆప్తులు తమ వారితో వారి కష్టసుఖాలను పంచుకునేందుకు మనసారా లేఖల ద్వారా సమాచారం చేరవేసుకునే వారు. కాగా ఆ ఉత్తరాల మధురానుభూతులు, తీపి జ్ఞాపకాలు నేడు కనుమరుగయ్యాయి. స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా రూపంలో లేఖలు కనిపించకుండాపోయాయి.
కలం స్నేహం
ఎవరెక్కడుంటారో తెలియదు. వారపత్రికలు, మాసపత్రికల ద్వారా పరిచయం అయ్యేవారు. ఆ తర్వాత కలం స్నేహంపై ఆసక్తి ఉన్న వారి చిరునామాలను పత్రికల్లో ప్రచురించేవారు. అలాంటి అభిరుచి ఉన్న వారి నుంచి ప్రత్యుత్తరాలు అందుకునేవారు. కలం స్నేహం అంటే ఒకప్పుడు గొప్ప క్రేజ్ ఉండేది. పేజీలకు పేజీలు ఉత్తరాలు రాసుకునే వారు. ఇదంతా గతం.
పూజ్యులైన అమ్మానాన్నలకు..
ఇప్పుడంటే సెల్‌ఫోన్లు వచ్చాయి. వాట్సప్ సందేశాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు ఇలా కాదు. పైచదువుల కోసం, ఉద్యోగం కోసం దూరప్రాంతాలకు వెళ్లే పిల్లలు ఉత్తరాలు రాస్తే తప్ప వారి తల్లిదండ్రులకు యోగక్షేమాలు తెలిసే అవకాశం ఉండేది కాదు. అలాగే తల్లిదండ్రులు తమ సమాచారాన్ని పిల్లలకు తెలియజేయాలంటే ఉత్తరమే వారధి. ‘పూజ్యులైన అమ్మానాన్నల పాదపద్మాలకు నమస్కరించి’ అంటూ దూరప్రాంతాల నుంచి కొడుకు, అత్తారింటి నుంచి కూతురు రాసే ఉత్తరాలను చూసుకుని తల్లిదండ్రులు పులకించిపోయేవారు. ఇలా మానవ సంబంధాలకు వారధిగా నిలిచిన ఉత్తరాలు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. వాటిస్థానంలో ఆధునిక సమాచార మాధ్యమాలు అల్లుకున్నాయి. ఒకప్పుటి ఉత్తరం ఇప్పుడు సరికొత్త హంగులు సంతరించుకుంది. బంధుమిత్రుల మధ్య ఆప్యాయతతో నిండిన పలకరింపులను పంచిన లేఖలు కార్పొరేట్ సంస్థలకు, వినియోగదారులకు మధ్య వారధులుగా సరికొత్త అవతారం ఎత్తాయి. సెల్‌ఫోన్లు, ఈ–మెయిల్స్, ఎస్‌ఎంఎస్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇంటర్నెట్, టెలిఫోన్లు, ఎంఎంఎస్, చాటింగ్‌లకు దీటుగా సేవలు విస్తరించాయి. పోస్టుకార్డులు, ఇంగ్లాండ్ లెటర్ స్థానంలో ఈ–పోస్టు, స్పీడ్‌పోస్టు, బిజినెస్ పోస్టు వచ్చి చేరాయి. ఎక్స్‌ప్రెస్ పార్శిల్‌పోస్టు, ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిషన్ ఉత్తరాలు, బిజినెస్ పోస్ట్ రిటైల్ పోస్టు, బంగారు నాణేల విక్రయాలు, పేమెంట్ బ్యాంకులుగా పోస్టాఫీసులు పలు సేవలు అందిస్తున్నాయి.
ప్రధాన సమాచార వారధి
నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ సమీపంలో సుమారు 50 ఏళ్ల నుంచి పెద్దపోస్టాఫీసు ఉంది. ఇప్పటికీ ఆ ప్రధాన కార్యాలయం అక్కడే కొనసాగుతోంది. ప్రతిరోజూ వేలాది ఉత్తరాలు ఇక్కడి నుంచి ప్రజలకు చేరేవి. టెక్నాలజీలో ఉత్తరం బందీ అయ్యింది. ఆత్మీయులకు రాసే ఉత్తరాల స్థానంలో సమస్థ ప్రపంచాన్ని గుప్పెట్లో బంధించే స్మార్ట్‌ఫోన్ రాజ్యమేలుతోంది. ఇది మానవ సంబంధాలను తెంచుతుందో.. ఉంచుతుందో... అర్థం కాని పరిస్థితిని చూస్తున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment