తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అబద్దాలు ఆడతారని అనుకుంటారు కానీ, మరీ ఇంతలా అసత్యాలు చెప్పవచ్చన్న సంగతి మాత్రం ఆయన రాసిన ఒక లేఖ చూస్తే అర్ధం అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్డగోలుగా మాట్లాడతారని చెప్పుకుంటాం.. కానీ, అందులో ఇంతలా రికార్డు సృష్టించవచ్చని ఆయన రుజువు చేస్తున్న తీరు గమనించదగిందే. ఇక నారా లోకేష్ సంగతి వేరే చెప్పనవసరం లేదు.
ఆంధ్ర ప్రదేశ్‌పై పడిపోయి ఒక రకమైన శబ్ద కాలుష్యం సృష్టిస్తూ అరాచకాలకు తెగపడుతున్న వీరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు హద్దులు దాటిపోయాయి. వారు ప్రజలకు ఏం చేస్తామో చెప్పే ధైర్యం చేయలేక, అనవసరపు ఆరోపణలన్నిటిని కలిపి అబద్దాల వంటకంతో ప్రజలను మభ్య పెట్టాలని విపరీతంగా కృషి చేస్తున్నారు. వాటిని పేజీలకొద్ది రాసేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు ప్రజలను మోసం చేయడానికి తమ డప్పు కొడుతున్నాయి.
ప్రజలపై యుద్ధమే..
అంగళ్లు, పుంగనూరుల వద్ద జరిగిన గొడవలు ఏంటి?. దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు చంద్రబాబు రాసిన లేఖలేమిటి?. అలాగే విశాఖపట్నం గాజువాకలో పవన్ కళ్యాణ్ చేసిన ఉపన్యాసం చూస్తే ఆయనకు కూడా ఏదో అయిందన్న భావన కలుగుతుంది. వీరు నిస్పృహతో సాగిస్తున్న ఈ యుద్దం సీఎం జగన్‌పై కాదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలపై చేస్తున్న వికృత యుద్దం. చంద్రబాబు అయితే ముఖ్యమంత్రి జగన్‌పై చేసిన ఒక విమర్శ చూడండి. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదట. అందరూ చంద్రబాబు మానసిక స్థితిని సందేహిస్తున్నారని భావించి ఆయన రచయితలు ఎవరో ఎదురు దాడి చేసినట్లుగా ఉంది.
లేఖల డ్రామా..
పోలీసులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తానని చెప్పిన చంద్రబాబుకు మతి స్థిమితం లేనట్లా?. లేక తన స్కీముల గురించి సవివరంగా వివరించి ప్రజల నుంచి స్పందన పొందుతున్న సీఎం జగన్‌కు మతి లేనట్లా?. చంద్రబాబు పేరుతో రాసిన ఆ లేఖను జాగ్రత్తగా పరిశీలిస్తే అనేక విషయాలు తెలుస్తాయి. అంగళ్లు కూడలి వద్ద తనపైనే హత్యాయత్నం జరిగిందని.. కానీ, తానే హత్యాయత్నం చేశానని కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుపై హత్యాయత్నం జరిగితే పోలీసులకు ఎందుకు దెబ్బలు తగిలాయి?. చంద్రబాబుకు ఇలాంటి ట్రిక్కులు కొత్తకాదు. ఢిల్లీ స్థాయిలో తన పరపతి బాగా దెబ్బతిందన్న సంగతి ఆయనకు తెలుసు. అందుకే మళ్లీ ఢిల్లీ పెద్దల సానుభూతి పొందడానికి ఈ లేఖ డ్రామా ఆడారు. అందులో పచ్చి అబద్దాలు రాసి మొత్తం నెపం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్‌పైన, పోలీసులపైన నెట్టే యత్నం చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఏదో రకంగా చెడగొట్టాలన్నది వారి యత్నం.
డ్రోన్లపై అసత్య ప్రచారం..
చంద్రబాబు తన లేఖలో ఎక్కడా ప్రజలకు ఇబ్బంది వచ్చినట్లు చెప్పలేదు. తనపై దాడులు జరుగుతున్నాయని అసత్య ఆరోపణలు మాత్రమే ఆ లేఖలో కనిపిస్తాయి. కుప్పం స్థానిక ఎన్నికలలో టీడీపీని దారుణంగా ఓటమి పాలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా ఆరోపణలు చేశారు. 2019 నుంచే ఆయనపై దాడులు చేశారట. దీనిని ఎవరైనా నమ్ముతారా?. ఆ ఏడాది ఆగస్టులో తన ఇంటిపై డ్రోన్ ఎగరవేశారని, వారిని తన భద్రతాధికారులు పట్టుకున్నా చర్యలు తీసుకోలేదట. నిజానికి అప్పుడు వచ్చిన వరదల గురించి మాత్రం చంద్రబాబు దాచిపెట్టేశారు. డ్రోన్లు ఎగరవేసింది కరకట్టపై ఉన్న ఎన్ని ఇళ్లు మునిగిపోయే అవకాశం ఉందో తెలుసుకోవడానికి అని అధికారులు ప్రకటించినా, చంద్రబాబు మాత్రం తన అబద్దాన్ని పదే పదే వల్లె వేస్తుంటారు.
2021 సెప్టెంబర్‌లో జోగి రమేష్ తన నివాసంపై దాడికి వచ్చారట. ఆ రోజున చంద్రబాబుకు వినతిపత్రం ఇస్తామని రమేష్ ఆ ప్రాంతానికి వెళ్లిన మాట వాస్తవం. కానీ, పోలీసులు ఆయనను వెళ్లనివ్వలేదు. ఇందులో దాడి చేసింది ఏముంది?. అనపర్తి, నందిగామ, ఎర్రగొండపాలెంలలో జరిగిన కొన్ని చిన్న ఘటనలను ఆసరాగా తీసుకుని వాటిని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. వాటిలో ఎక్కడా చంద్రబాబుపై దాడి జరగలేదు. అలా అని ఆయన కానీ, ఆయన వద్ద ఉండే భద్రత అధికారులు కానీ పోలీసులకు ఫిర్యాదే చేయలేదు. ప్రతిపక్షాలు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించకుండా జీఓ తెచ్చారని ఆయన అన్నారు.
మరణాల గురించి చెప్పాలి కదా..
కందుకూరులో తన రోడ్ షోలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది, గుంటూరులో ప్రజలకు కానుకలు ఇస్తామని తీసుకు వచ్చి తొక్కిసలాటకు గురిచేసి ముగ్గురు మరణించిన విషయాన్ని దాచిపెట్టేశారు. అంగళ్లు వద్ద నిర్దిష్ట రూట్ మ్యాప్‌ను వీడి అనుమతి లేకుండా రోడ్ షోని నిర్వహించి తప్పు చేసిన విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అంగళ్లు వద్ద, పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు గాయపడిన సంగతి, ఒక కానిస్టేబుల్ కన్ను పోగొట్టుకున్న వైనం కూడా ప్రధానికి, రాష్ట్రపతికి తెలియచేస్తే బాగుండేది కదా!. పోలీసు వాహనాలను దగ్ధం చేసింది టీడీపీ కార్యకర్తలు కాదా?. వివేక హత్య కేసు, అమరావతి మొదలైనవాటిని కూడా ప్రస్తావించి సీఎం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ఆయన శైలిని మరోసారి బయటపెట్టుకున్నారు.
పవన్‌ది మరో కథ..
సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు రాయిస్తూ, వారిని పోలీసులు పట్టుకుంటే ప్రజాస్వామ్యం అని గగ్గోలు పెడుతూ, మళ్లీ ఎదురు ప్రభుత్వంపైనే దాడి చేశారు. ఏపీ మాదక ద్రవ్యాలు అంటూ పలు పిచ్చి ఆరోపణలు చేస్తూ రాష్ట్రం పరువు తీయడానికి చంద్రబాబు వెనుకాడటం లేదు. ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగం చూస్తే, ఒక్కదానికి కూడా అర్ధం, పర్ధం ఉండదని తేలిపోతుంది. ఆస్తులు అమ్ముతున్నారని ఒకసారి, తాకట్టు పెడుతున్నారని మరోసారి అంటారు. దేవుడు, దెయ్యం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయనకు ప్రధాని మోదీ చాలా క్లోజ్ అట. అయినా ఆయన కాళ్లు పట్టుకుంటారట. సీఎం జగన్ పాలన లేని రాష్ట్రాన్ని చూడాలట. ఆయన కోరిక కోసం ప్రజలు ఓడిస్తారని భ్రమ పడుతున్నారు. ఏ మాత్రం పద్దతి ఉన్నా జగన్ తీసుకువచ్చిన విధానాలలో ఏది తప్పు, ఏది రైటు చెప్పగలగాలి. ఒకసారి ముఖ్యమంత్రిగా పనికిరానని, మరోసారి సీఎం పదవి తీసుకోవడానికి సిద్దమని చెబుతారు. తాజాగా విశాఖలో సీఎం పదవి ఇవ్వాలని అంటున్నారు. అందుకోసం ఆయన ఏం చేస్తారో చెప్పే ధైర్యం ఉందా?. ఏదో రకంగా సినిమాలలో మాదిరి ప్రజలను మోసం చేయడానికి పవన్ కళ్యాణ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు.
--కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
ఇది కూడా చదవండి: ఇద్దరిలో అసహనం, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది, ఎందుకో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment