ఇటీవల చర్ల–శబరి ఏరియా కమిటీ పేరుతో వచ్చిన లేఖ
సాక్షి, కొత్తగూడెం: గోదావరి పరీవాహక ప్రాంతం ఆవరించి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో మావోయిస్టులు తమ కార్యకలాపాలను తిరిగి ముమ్మరం చేయాలనే లక్ష్యంతో.. ఛత్తీస్‌గఢ్ సరిహద్దు దాటి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. కాగా, హరిభూషణ్ ఆధ్వర్యంలో మావోయిస్టుల యాక్షన్ టీమ్‌లు భద్రాద్రి, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల్లో రిక్రూట్‌మెంట్లకు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు మావోయిస్టులు గత కొన్ని నెలలుగా వరుసగా లేఖలు విడుదల చేస్తుండడంతో ఏజెన్సీ ప్రాంతంలో అలజడి నెలకొంటోంది. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో చర్ల, సత్యనారాయణపురం సొసైటీల్లో కొన్ని వర్గాల వారిని ఓడించాలంటూ చర్ల–శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో ఓ లేఖ వెలువడింది. అయితే ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వచ్చాయి. దీనిపై అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
లేఖలు అసలువేనా..?
ఇటీవల చందాల కోసం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లోని పలువురు వ్యాపారులు, కాంట్రాక్టర్లకు మావోయిస్టు నాయకులు లేఖలు పంపినట్లు వార్తలు వచ్చాయి. 15 రోజుల క్రితం పినపాక నియోజకవర్గం మణుగూరు పట్టణంలోని పలువురు కాంట్రాక్టర్లు, వ్యాపారులకు సైతం చందాల కోసం అదే మండలం విజయనగరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లేఖలు పంపినట్లు సమాచారం.
మావోయిస్టు నేత రాసిన లేఖ..
అయితే వసూళ్ల కోసం పంపిన ఆ లేఖలు అసలువా.. నకిలీవా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోల పేరిట నకిలీలు లేఖలు పంపిస్తున్నారా లేక మావోయిస్టు నాయకులే వ్యక్తిగతంగా వసూళ్లకు పాల్పడుతున్నారా అనే సందేహాలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో గందరగోళ వాతావరణం నెలకొంది.
ఇటీవల ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్‌ను హెచ్చరిస్తూ మావోయిస్టులు ఓ లేఖను విడుదల చేశారు. దీనికి ప్రతిగా జగదీష్ సైతం మరో లేఖ విడుదల చేయడం గమనార్హం. ‘ఏటూరునాగారం ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం రండ’ని జగదీష్ పేర్కొనడం విశేషం.
తరువాత వెంకటాపురం–వాజేడు ఏరియా కార్యదర్శి సుధాకర్ పేరుతో పలువురు నాయకులను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖలు రాశారు. ఆ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్, వెంకటాపూర్ కమిటీ సుధాకర్, ఏటూరునాగారం కమిటీ సబిత పేరుతో వరుసగా లేఖలు వచ్చాయి. ఇక ఇటీవల జయశంకర్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి పేరిట విడుదలైన లేఖపై సైతం పలువురు వివిధ రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరుస లేఖలతో గోదావరి పరీవాహక ప్రాంతంలో కలకలం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment