మాజీ మంత్రి జలగం ప్రసాదరావు
సాక్షి, సత్తుపల్లి: 1999లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి జలగం ప్రసాదరావు 19 ఏళ్ల పాటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినా ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రదక్షిణలు చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందారని విశ్లేషకులు చెబుతుంటారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ‘అధిష్టానం వైపు నుంచి సానుకూలమైన సంకేతాలు వచ్చినా..’ కాంగ్రెస్ పార్టీలోని జలగం వ్యతిరేకులంతా ఒకేతాటిపై వచ్చి జలగం ప్రసాదరావు చేరికను అడ్డుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల పక్షాన విస్తృత ప్రచారం నిర్వహించారు.
20 ఏళ్ల క్రితం ఆశించి.. భంగపడి
1999 సాధారణ ఎన్నికల్లో మాజీ మంత్రి జలగం ప్రసాదరావు ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆయన వర్గీయులు హైదరాబాద్ గాంధీభవన్‌లో పదిహేను రోజులకు పైగా నిరాహారదీక్షలు చేశారు. అయినా అధిష్టానం దిగిరాకపోగా.. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గారపాటి రేణుకాచౌదరి, సత్తుపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పొంగులేటి సుధాకర్‌రెడ్డిలను ప్రకటించింది.
అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా గారపాటి రేణుకాచౌదరి విజయం సాధించగా.. పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. జలగం ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పని చేయటం వల్లే ఓడిపోయానని పొంగులేటి సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయటంతో ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు విధించింది. జలగం ప్రసాదరావుకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయిందని జలగం అభిమానులు మనోవేదనకు లోనవుతున్నారు.
జలగం కుటుంబానికి ప్రత్యేక స్థానం
జలగం కుటుంబానికి జిల్లాలో ప్రత్యేక స్థానం ఉంది. జలగం వెంగళరావు జిల్లా పరిషత్ చైర్మన్, ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిగా పనిచేశారు. జలగం కుటుంబం నుంచి జలగం వెంగళరావు, జలగం కొండలరావులు చెరో రెండు దఫాలు ఎంపీలుగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయాలను తమ కనుసన్నల్లో నడిపించారు. జలగం కుటుంబం సిఫార్సు చేసిన వారికే పదవులు దక్కేవి. జలగం వెంగళరావు, జలగం కొండలరావు తర్వాత 1987లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పి.వి.రంగయ్యనాయుడిని అప్పటి పంచాయతీరాజ్ శాఖా మంత్రి జలగం ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్ ఇప్పించి గెలిపించుకున్నారు.
పీవీ నర్సింహారావు మంత్రివర్గంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖామంత్రిగా రంగయ్యనాయుడు పనిచేశారు. కొంతకాలానికి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. 1992లో జరిగిన ఎన్నికల్లో పి.వి.రంగయ్యనాయుడిపై సీపీఎం పార్టీ అభ్యర్థిగా తమ్మినేని వీరభద్రం ఎంపీగా గెలుపొందారు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం రెండేళ్లకే కుప్పకూలిపోవటంతో 1994లో జరిగిన ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయటం.. జలగం ప్రసాదరావు మద్దతు తెలపటంతో గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment