
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన మరో ఇద్దరు ప్రత్యర్థులకు తాజాగా క్షమాపణలు చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశాననీ, తనను క్షమించాలని కోరుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కొడుకు అమిత్ సిబల్‌లకు ఆయన లేఖలు రాశారు. దేశంలోనే తొలి 20 మంది అత్యంత అవినీతిపరుల్లో గడ్కారీ ఒకరంటూ గతంలో కేజ్రీవాల్ ఓ జాబితాను ప్రచురించారు. అమిత్ సిబల్‌పై కూడా అవినీతి ఆరోపణలు చేశారు.
దీంతో వారు కేజ్రీవాల్‌పై వేర్వేరుగా పరువునష్టం కేసులు వేయగా ప్రస్తుతం విచారణ నడుస్తోంది. కేజ్రీవాల్ క్షమాపణ లేఖలను ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. అమిత్ సిబల్‌కు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా క్షమాపణలు చెప్పారు. అనంతరం పరువునష్టం కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు గడ్కారీ, కేజ్రీవాల్ సంయుక్తంగా ఒక దరఖాస్తును, కేజ్రీవాల్, అమిత్ సిబల్‌లు మరో దరఖాస్తును కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ రెండు కేసుల నుంచి కేజ్రీవాల్‌కు కోర్టు విముక్తి కల్పించింది. కాగా, కోర్టు కేసుల నుంచి బయటపడటానికి కేజ్రీవాల్ న్యాయవాదులు అమలు చేస్తున్న వ్యూహం ఇదని విశ్లేషకులు అంటున్నారు.
సిసోడియా మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేయాల్సిన సమయాన్ని అహంభావంతో కోర్టుల చుట్టూ తిరిగి వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే క్షమాపణలు చెప్పామన్నారు. ‘మా వ్యాఖ్యలతో ఎవరైనా బాధకు గురైతే మేం క్షమాపణలు చెప్తాం. అహంకారంతో దాన్ని వైరంగా మార్చం. ప్రజల కోసం పనిచేయడానికి మేం ఇక్కడున్నాం. కోర్టుల చుట్టూ తిరగడానికి కాదు’ అని ఆయన అన్నారు. మరోవైపు తనపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వేసిన రెండో పరువునష్టం కేసును కేజ్రీవాల్ కోర్టులో వ్యతిరేకించారు. కేజ్రీవాల్ సూచనల మేరకే ఆయన న్యాయవాది రాం జెఠ్మలానీ తనను అభ్యంతరకర పదాలతో దూషించాడంటూ జైట్లీ ఈ కేసు వేశారు.
మూడు పోయి.. మరో 30 ఉన్నాయి
కేజ్రీవాల్‌పై ఇంకా 30 పరువునష్టం కేసులున్నాయి. శిరోమణి అకాలీదళ్ నేత విక్రమ్ సింగ్ మజీథియాకు మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధాలు ఉన్నాయని కేజ్రీవాల్ ఆరోపించడంతో ఆయన పరువునష్టం కేసు వేయడం, ఇటీవలే ఆయనకూ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పి కేసును ఉపసంహరించుకునేలా చేయడం తెలిసిందే. కేజ్రీవాల్ వైఖరిని ఆప్ నేతలే కొందరు వ్యతిరేకిస్తున్నారు. కేజ్రీవాల్ క్షమాపణ కోరడంతో ఆప్ పంజాబ్ చీఫ్ పదవికి ఎంపీ భగవంత్ మన్ రాజీనామా కూడా చేశారు. గడ్కారీ, సిబల్‌లకు కేజ్రీ క్షమాపణ చెప్పడంతో మరో రెండు కేసుల నుంచి ఆయన బయటపడనున్నారు.అయినా మరో 30 పరువునష్టం కేసులు ఆయనపై ఉన్నాయి.
ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?
20 మంది అత్యంత అవినీతిపరుల జాబితాను ప్రచురించిన కేజ్రీవాల్ ఇప్పుడు ఎందుకు వెనక్కు జారుకుంటున్నారని ఆప్ మాజీ నాయకురాలు అంజలీ దమానియా ప్రశ్నించారు. గడ్కారీ అవినీతిపరుడే అనేందుకు తన వద్ద ఉన్న ఆధారాలను అప్పుడే కేజ్రీవాల్‌కు ఇచ్చాననీ, అవినీతిపరులకు శిక్ష పడేలా చేయకుండా ఆయన ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారన్నారు. అంజలీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరఫున గడ్కారీపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2015లో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తిన సమయంలో ఆమె ఆప్‌ను వీడారు.
Comments
Please login to add a commentAdd a comment