నిరూపించు లేదా తప్పుకో.. కేజ్రీవాల్‌కు సిబల్ సవాల్
కేజ్రీది చౌకబారుతనం: వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: పలు పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు అవినీతిపరులని, వారిపై ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన జాబితాపై విమర్శలు వెల్లువెత్తాయి. తనపై చేసిన ఆరోపణలను రెండు రోజుల్లో నిరూపించాలని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ సవాల్ చేశారు. నిరూపించలేకపోతే రాజీనామా చేయాలని శనివారం డిమాండ్ చేశారు. తాను దోషినని రుజువు చేస్తే రాజీనామా చేయడమే గాక రాజకీయాల నుంచే తప్పుకుంటానన్నారు. కేజ్రీవాల్ జాబితాను చౌకబారు ప్రచారంగా బీజేపీ నేత వెంకయ్యనాయుడు అభివర్ణించారు. అవినీతి కాంగ్రెస్ మద్దతుతో సర్కారు నడుపుతున్న ఆయనకు తమ పార్టీ నేతలైన రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కారీలను అవినీతిపరుల జాబితాలో చేర్చే నైతిక హక్కు లేదన్నారు. ఇక కేజ్రీవాల్ వీధి నేతలా దిగజారి మాట్లాడారని సమాజ్‌వాదీ నేత రాజేంద్ర చౌదరి విమర్శించారు.మరోవైపు తమను అవినీతిపరులన్నందుకు బీజేపీ నేత అనంత్‌కుమార్, కాంగ్రెస్ ఎంపీ అవతార్‌సింగ్ భదానా శనివారం కేజ్రీవాల్‌కు లీగల్ నోటీసులు పంపారు. ఆరోపణలను వెనక్కు తీసుకోవాలని, మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆప్‌లో చేరిన ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) వి.బాలకృష్ణన్ శనివారం బెంగళూరులో ఆప్‌లో చేరారు. అంతకుముందు ఆయన పార్టీకి రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు. ఆ వెంటనే బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం టికెట్‌ను ఆయనకు ఖరారు చేసినట్టు తెలిసింది.
ఒంటరి పోరే: ఆప్
చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు, తెలంగాణ డిమాండ్‌కు ఆప్ అనుకూలమని ఆ పార్టీ అధికార ప్రతినిధి యోగేంద్ర యాదవ్ చెప్పారు. అయితే తెలంగాణపై నిర్ణయం తీసుకునేటప్పుడు సీమాంధ్ర హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని, హైదరాబాద్ ప్రత్యేకతను గౌరవించాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలతో పొత్తుల యోచన లేదని యాదవ్ తేల్చిచెప్పారు. ఒంటరిగానే పోటీ చేస్తామని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సత్తాతో పొత్తుపై ప్రశ్నించ,గా జయప్రకాశ్‌నారాయణ అంటే తమకు గౌరవముందని, అయినా లోక్‌సత్తాతో పాటు ఏ పార్టీతోనూ పొత్తులుండబోవని చెప్పారు.