కొనసాగుతున్న అనిశ్చితి! | aam aadmi party can't take final decision on government formation | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న అనిశ్చితి!

Published Tue, Dec 17 2013 11:42 PM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM

కొనసాగుతున్న అనిశ్చితి! - Sakshi

కొనసాగుతున్న అనిశ్చితి!

న్యూఢిల్లీ:  ప్రభుత్వ ఏర్పాటుపై ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అంతిమ నిర్ణయానికి రాలేకపోయింది. ఆప్ విధించిన అన్ని షరతుకు కాంగ్రెస్ అంగీకరించినప్పటికీ ఆ పార్టీని విశ్వసించడానికి సంశయిస్తోంది. కేజ్రీవాల్ లేఖకు కాంగ్రెస్ నుంచి బదులు రావడంతో దానిపై చర్చించడానికి ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం ఉదయం ఘజియాబాద్‌లోని కేజ్రీవాల్ నివాసంలో సమావేశమైంది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్, కుమార్ బిశ్వాస్‌తోపాటు 9 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ  రెండు గంటలు చర్చోపచర్చలు జరిపింది. అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుపై నిర్ణయానికి రాలేకపోయింది. పార్టీ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని ఈ సున్నితమైన అంశంపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావించారు. దీంతో మధ్యాహ్నం ఆప్ ఎమ్మెల్యేలు అందరినీ సమావేశపరిచి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయాన్ని చర్చించారు.

ఇందులోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ప్రజాభిప్రాయం కోరాలని నిర్ణయించారు. సమావేశం తరువాత కే జ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలా వద్దా అన్న ధర్మసంకటంలో పడ్డామని చెప్పారు. కొందరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, మరికొందరు వద్దంటున్నారని తెలిపారు. అందుకే ప్రజాభిప్రాయం కోరాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 18 అంశాలపై  మద్దతు కోరుతూ కాంగ్రెస్, బీజేపీకి లేఖ రాశాం. కాంగ్రెస్ ఈ లేఖకు సమాధానమివ్వగా, బీజేపీ కనీస మర్యాదనైనా పాటించకుండా జవాబు రాయలేదు. మా 18 షరతుల్లో 16 షరతులు పాలనాపరమైనవని, వాటికి మా మద్దతు అవసరం లేదని, రెండింటికి మాత్రం సహకరిస్తామని కాంగ్రెస్ తెలిపింది. ఆప్ మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినందువల్ల ఆ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయాన్ని మేం పరిశీలించాం.

కాంగ్రెస్‌ను విశ్వసించలేమని, గతంలో చరణ్‌సింగ్, చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కూల్చినట్లుగానే మన ప్రభుత్వాన్ని
 కూడా కూల్చవచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు’ అని ఆయన తెలిపారు. ప్రభుత్వాలను కూల్చడమనేది కాంగ్రెస్ రక్తంలోనే ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే లోక్‌సభ ఎన్నికలు ఇప్పట్లో లేవు కాబట్టి, ఆరునెలల వరకు కాంగ్రెస్ తమ ప్రభుత్వాన్ని కూల్చకపోవచ్చన్న నమ్మకమూ కనిపిస్తోందని ఆయన చెప్పారు. ఆరు నెలలైనా సుపరిపాలన అందించాలని కొందరు సూచించారని కేజ్రీవాల్ వివరించారు. ప్రజలు కోరితే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి తాము వెనుకాడబోమని ఆయన చెప్పారు.
 ప్రభుత్వం ఏర్పాటుచేసే బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆప్ ప్రయత్నిస్తోందన్న విమర్శలకు స్పందిస్తూ ఎన్నికల్లో పోటీచేసి సత్తా నిరూపించుకున్న ఆప్‌కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా కఠినమైన విషయం కాదన్నారు. ఈ విషయంలో ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ఢిల్లీవాసులకు 25 లక్షల లేఖలు రాస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలా వద్దా అనేదానిపై ఢిల్లీవాసులు తమ అభిప్రాయాన్ని 08806110335 నంబరుకు ‘యస్’ లేదా ‘నో’ అని ఎస్‌ఎంఎస్ చేయవచ్చు. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఆప్ వెబ్‌సైట్  లేదా ఫేస్‌బుక్ పేజీ ద్వారా తెలియజేయవచ్చు.  272 మున్సిపల్ వార్డుల్లో జనసభల ద్వారా కూడా ప్రజాభిప్రాయం సేకరిస్తారు. ఆదివారం సాయంత్రం వరకు ప్రజాభిప్రాయాన్ని సేకరించి సోమవారం తుదినిర్ణయానికి రానున్నట్లు ఆయన చెప్పారు. సగం మంది వ్యతిరేక అభిప్రాయాలు వెలువరించినా ప్రభుత్వం ఏర్పాటు చేయబోమని కేజ్రీవాల్ ఈ సందర్భంగా స్పష్టీకరించారు. నగరంలో రాష్ట్రపతి పాలన విధించిన తరువాత కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 యుద్ధానికి మళ్లీ సిద్ధం: బీజేపీ
 న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై సంది గ్ధం నెలకొనడంపై బీజేపీ స్పందించింది. మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంగళవారం ప్రకటించింది. ఢిల్లీ బీజేపీ ఎన్నికల వ్యూహబృందం సమావేశం లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఢిల్లీ ఎన్నికల ఇన్‌చార్జ్ నితిన్ గడ్కారీ భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీవాసుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ కార్యకర్తలు మరింత శ్రమించాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చి నా ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్‌ఆద్మీ పార్టీ ముం దుకు రాకపోవడంపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు విజ య్ గోయల్ మండిపడ్డారు. మరోసారి ఎన్నికలకు వెళ్లడానికి తాము సిద్ధపడుతున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం మూడంచెల ప్రచార వ్యూ హాన్ని సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ ఎన్నికలకు ఆపే కారణమన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తమకు ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞత లు చెప్పడానికి నియోజకవర్గాల వారీగా ‘విజ యోత్సవాలు’ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement