
ఏకపక్షంగా కృష్ణా బోర్డు తీరు
కేంద్రమంత్రి ఉమకు కేసీఆర్, హరీశ్ వేర్వేరుగా లేఖలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల్లో స్పష్టత వచ్చే వరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి చేర్చే విషయంలో తొందర అవసరం లేదని సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతికి వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రాజెక్టుల వారీ కేటాయింపులపై స్పష్టత వచ్చాకే బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సంప్రదించకుండా, చర్చలు జరపకుండా బోర్డు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వాటా తేలే వరకు బోర్డు పంపిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ఆమోదించవద్దని కోరారు.
ఎందుకంత ఆత్రుత: ‘‘రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం ప్రాజెక్టులను కేంద్రం నోటిఫై చేసిన తర్వాత, ప్రాజెక్టుల వారీగా నీటి లెక్కలు తేలాక బోర్డు వీటి నిర్వహణను మాత్రమే చూడాలి. అదీగాక బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ గడువును పొడిగిస్తూ.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు నిర్ధారించాలని సూచించారు. ఎవరి వాటా ఎంత, వినియోగం ఎలా ఉండాలో ట్రిబ్యునల్ చెప్పాకే బోర్డు అర్థవంతంగా వ్యవహరించాలి. కానీ దురదృష్టవశాత్తూ బోర్డు ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఆత్రుత చూపుతోంది’’ అని సీఎం, హరీశ్ తమ లేఖల్లో వివరించారు.
‘‘రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89(ఏ), (బీ) ప్రకారం ట్రిబ్యునల్ కాల పరిమితిని రెండేళ్లు పెంచారు. కృష్ణా జలాల వివాదం రెండు రాష్ట్రాల మధ్యా లేదా నాలుగు రాష్ట్రాల మధ్యా అన్న అంశం ఇంకా తేలలేదు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేవు. నీటి కేటాయింపులకు సంబంధించిన అంశాలు ఇంకా బ్రజేష్ ట్రిబ్యునల్ పరిశీలనలో ఉన్నాయి. అలాంటప్పుడు బోర్డు నియంత్రణ ఎక్కడిది’’ అని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో గత అరవై ఏళ్లుగా తెలంగాణకు నీటి కేటాయింపుల్లో తీరని అన్యాయం జరిగిందని, ఇప్పుడు తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుంటే అదే అన్యాయం మళ్లీ కొనసాగినట్లు అవుతుందని వివరించారు. ఈ దృష్ట్యా కృష్ణా ప్రాజెక్టులను తన పరిధిలోకి తేవాలంటూ బోర్డు పంపిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ఆమోదించరాదని కోరారు.
ఏపీ ఒత్తిళ్లకు తలొగ్గుతోంది
ఏపీ ఒత్తిళ్లకు తలొగ్గి కృష్ణా బోర్డు ప్రాజెక్టులను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తోందని మంత్రి హరీశ్ తన లేఖలో పేర్కొన్నారు. బ్రజేష్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించే వరకు బోర్డు నియంత్రణ అవసరం లేదని అన్నారు. రాష్ట్రాల పునర్విభజన చట్టంలోని 87(1), 85(8) సెక్షన్‌ల ప్రకారం కృష్ణా బోర్డు డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను తయారు చేయలేదని తెలిపారు.