సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. నాలుగేళ్ల అనంతరం కేంద్ర జలశక్తి శాఖ ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించేందుకు నిర్ణయించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ ఈ భేటీని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనుండగా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిలతో పాటు కేంద్ర జల సంఘం, కృష్ణా, గోదావరి బోర్డుల ౖచైర్మన్‌లు ఈ భేటీలో పాల్గొననున్నారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులు, వాటి డీపీఆర్‌లు, బోర్డుల పరిధి వంటి నాలుగు అంశాల ఎజెండాతో పాటే ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు, నీటి వాటాలు, మళ్లింపు జలాల అంశాలన్నింటిపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
కొత్త ప్రాజెక్టులు..వాటి డీపీఆర్‌లు..
రెండు నదీ బేసిన్‌ల పరిధిలో తెలుగు రాష్ట్రాలు చేపడుతున్న ప్రాజెక్టులపై ఎప్పటినుంచో వివాదాలున్నాయి. ఈ నదీ వివాదాలను పరిష్కరించేందుకు 2016 సెప్టెంబర్ 21న తొలిసారి అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించగా, తదనంతరం ఎలాంటి భేటీలు జరుగలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంపు అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. రెండ్రోజుల కిందట సైతం రాయలసీమ ఎత్తిపోతల టెండర్ల విషయంలో ముందుకెళ్లకుండా నిలవరించాలని మరోమారు లేఖ ద్వారా కోరింది. గతంలో జరిగిన బోర్డు భేటీలోనూ ఇదే అంశాన్ని గట్టిగా ప్రశ్నించింది. దీంతో బోర్డు సైతం అపెక్స్ కౌన్సిల్ మాత్రమే వీటికి పరిష్కారం చూపుతుందని గత నెలలో కేంద్ర జల శక్తి శాఖకు నివేదించింది. అన్ని అంశాలపై కేంద్రమే తేల్చాల్సి ఉన్నందున అపెక్స్ భేటీ నిర్వహించాలని బోర్డు కోరగా కేంద్రం ఓకే చెప్పింది. బోర్డే వివాదాస్పద అంశాలన్నింటితో ఎజెండానే ఖరారు చేసి పంపడంతో కేంద్ర జలశక్తి శాఖ అపెక్స్ భేటీ తేదీని ఖరారు చేస్తూ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపింది.
5న అపెక్స్ భేటీ
Published Thu, Jul 30 2020 4:50 AM | Last Updated on Thu, Jul 30 2020 4:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment