Gajendra sing
-
5న అపెక్స్ భేటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. నాలుగేళ్ల అనంతరం కేంద్ర జలశక్తి శాఖ ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించేందుకు నిర్ణయించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ ఈ భేటీని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనుండగా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిలతో పాటు కేంద్ర జల సంఘం, కృష్ణా, గోదావరి బోర్డుల ౖచైర్మన్లు ఈ భేటీలో పాల్గొననున్నారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులు, వాటి డీపీఆర్‌లు, బోర్డుల పరిధి వంటి నాలుగు అంశాల ఎజెండాతో పాటే ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల అభ్యంతరాలు, నీటి వాటాలు, మళ్లింపు జలాల అంశాలన్నింటిపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు..వాటి డీపీఆర్‌లు.. రెండు నదీ బేసిన్ల పరిధిలో తెలుగు రాష్ట్రాలు చేపడుతున్న ప్రాజెక్టులపై ఎప్పటినుంచో వివాదాలున్నాయి. ఈ నదీ వివాదాలను పరిష్కరించేందుకు 2016 సెప్టెంబర్ 21న తొలిసారి అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించగా, తదనంతరం ఎలాంటి భేటీలు జరుగలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంపు అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. రెండ్రోజుల కిందట సైతం రాయలసీమ ఎత్తిపోతల టెండర్ల విషయంలో ముందుకెళ్లకుండా నిలవరించాలని మరోమారు లేఖ ద్వారా కోరింది. గతంలో జరిగిన బోర్డు భేటీలోనూ ఇదే అంశాన్ని గట్టిగా ప్రశ్నించింది. దీంతో బోర్డు సైతం అపెక్స్ కౌన్సిల్ మాత్రమే వీటికి పరిష్కారం చూపుతుందని గత నెలలో కేంద్ర జల శక్తి శాఖకు నివేదించింది. అన్ని అంశాలపై కేంద్రమే తేల్చాల్సి ఉన్నందున అపెక్స్ భేటీ నిర్వహించాలని బోర్డు కోరగా కేంద్రం ఓకే చెప్పింది. బోర్డే వివాదాస్పద అంశాలన్నింటితో ఎజెండానే ఖరారు చేసి పంపడంతో కేంద్ర జలశక్తి శాఖ అపెక్స్ భేటీ తేదీని ఖరారు చేస్తూ ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపింది. -
అపెక్స్ కౌన్సిల్ భేటీకి కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల వివాదంపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సిద్ధమయ్యారు. ఇదే అంశంపై సోమవారం ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఆర్కే జైన్ తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 4న కృష్ణా బోర్డు, 5న గోదావరి బోర్డు సమావేశాలు నిర్వహించినట్లు మంత్రి షెకావత్‌కు సీడబ్ల్యూసీ అధికారులు వివరించారు. కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లు సమావేశంలో చర్చించిన అంశాలపై నివేదిక పంపినట్లు తెలిపారు. సీడబ్ల్యూసీ సాంకేతిక అనుమతి లేని ప్రాజెక్టులను కొత్తగా ప్రాజెక్టులుగా పరిగణించాలని సీడబ్ల్యూసీ అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఈనెల 10లోగా ఇవ్వాలని ఆదేశించినట్లు బోర్డుల చైర్మన్లు నివేదికలో పేర్కొన్నారని మంత్రికి సీడబ్ల్యూసీ అధికారులు వివరించారు. ఇరు రాష్ట్రాలు డీపీఆర్‌లు ఇచ్చాక.. వాటిని పరిశీలించి నివేదిక ఇస్తామని చెప్పారు. కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లతో చర్చించి.. అపెక్స్ కౌన్సిల్‌కు ఎజెండాను సిద్ధం చేయాలని సీడబ్ల్యూసీ అధికారులను కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ ఆదేశించినట్లు సమాచారం. ఎజెండా సిద్ధమయ్యాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించి.. వారి వీలును బట్టి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని మంత్రి షెకావత్ నిర్ణయించినట్లు సీడబ్ల్యూసీ అధికారవర్గాలు తెలిపాయి. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై ముందుకెళ్లకుండా తాను జారీ చేసిన ఉత్తర్వులను ఇరు రాష్ట్రాలు అమలు చేసేలా చూడాలని కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లను మంత్రి షెకావత్ మరోసారి ఆదేశించినట్లు వెల్లడించాయి. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, వర్కింగ్ మాన్యువల్ ఆమోదం తదితర అంశాలపై మంగళవారం వాటి చైర్మన్లు ఎ.పరమేశం, చంద్రశేఖర్ అయ్యర్ తదితరులతో మంత్రి షెకావత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. -
తదుపరి చర్యలు చేపట్టకుండా ఏపీని ఆగమనండి
సాక్షి, హైదరాబాద్: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపున కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు ఇతర ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనిని కేంద్రం అడ్డుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఇటీవల రాసిన లేఖపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పం దించారు. సదరు లేఖ అందిందని, దాన్ని తమ శాఖ పరిశీలిస్తోందని పే ర్కొంటూ శనివారం బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి లేఖ రాశారు. వెంటనే సమావేశం ఏర్పాటుచేయాలని, ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సాంకేతికంగా పరిశీలించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)ను ఆదేశించినట్టు ఆ లేఖలో షెకావత్ పేర్కొన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లో పేర్కొన్న కృష్ణా నదీ జలాల నిర్వహణ నియమాలకు అనుగుణంగా ఉన్నాయా అనేది తేలే వరకు ఈ ప్రాజెక్టుల విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌కు చెప్పాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. అలాగే, కృష్ణానది నీటి వినియోగానికి సంబంధించి రెండు రాష్ట్రాల చర్యలపై చర్చించేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని తమ శాఖ అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. ఇది తెలంగాణ విజయం: బండి సంజయ్ కేంద్రమంత్రి ఆదేశాలపై సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. తన లేఖకు స్పందించినందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఇది శుభపరిణామమని, తెలంగాణ ప్రజల విజయమని పేర్కొన్నారు. -
ముగిసిన గజేందర్ సింగ్ అంత్యక్రియలు
జైపూర్ : ఆప్ ర్యాలీలో రైతు గజేందర్ సింగ్ ఆత్మహత్యపై ఒక వైపు పార్లమెంటర్ లో వివాదం నడుస్తోంటే...మరోవైపు రాజస్థాన్‌లోని స్వగ్రామం దౌసాలో అతని అంత్యక్రియలు గురువారం ముగిసాయి. వేలాదిగా తరలివచ్చిన రాజకీయ నాయకులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య గజేందర్ సింగ్ అంతిమయాత్ర సాగింది. ఈ సందర్భంగా అతని స్వగ్రామం నంగాల్ జమార్వర్లో నల్లజెండాలు ఎగురవేశారు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ , పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ తదితరులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఇది చాలా విషాదకర ఘటన అంటూ వారు నివాళులర్పించారు. గజేంద్రసింగ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేయడానికి తాము వచ్చామని పలువురు నేతలు తెలిపారు. నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇప్పటికైనా పంటనష్టపోయిన రైతులను నష్టపరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. 41 సంత్సరాల గజేంద్ర సింగ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గ్రామంలో గజేంద్ర సింగ్ బంధువు వివాహ కార్యక్రమం ఉండటంతో ఆ పెళ్లి ప్రదర్శన (బారాత్) గ్రామం నుంచి వెళ్లిన ఆ తరువాత మాత్రమే సమీపంలోని రాజ్‌ఘర్ గ్రామంలో ఉంచిన అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఇదిలా ఉంటే పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న గజేంద్ర సింగ్ అంతిమయాత్రకు ఆప్ నేతలు ఎవ్వరూ హాజరు కాకపోవటం గమనార్హం. కాగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బుధవారం ఆప్ ర్యాలీ సందర్భంగా , అందరూ చూస్తుండగానే బహిరంగంగా గజేంద్ర సింగ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే.