జైపూర్ : ఆప్ ర్యాలీలో రైతు గజేందర్ సింగ్ ఆత్మహత్యపై ఒక వైపు పార్లమెంటర్ లో వివాదం నడుస్తోంటే...మరోవైపు రాజస్థాన్లోని స్వగ్రామం దౌసాలో అతని అంత్యక్రియలు గురువారం ముగిసాయి. వేలాదిగా తరలివచ్చిన రాజకీయ నాయకులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య గజేందర్ సింగ్ అంతిమయాత్ర సాగింది. ఈ సందర్భంగా అతని స్వగ్రామం నంగాల్ జమార్వర్లో నల్లజెండాలు ఎగురవేశారు.
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ , పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ తదితరులు ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఇది చాలా విషాదకర ఘటన అంటూ వారు నివాళులర్పించారు. గజేంద్రసింగ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేయడానికి తాము వచ్చామని పలువురు నేతలు తెలిపారు. నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఇప్పటికైనా పంటనష్టపోయిన రైతులను నష్టపరిహారం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
41 సంత్సరాల గజేంద్ర సింగ్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గ్రామంలో గజేంద్ర సింగ్ బంధువు వివాహ కార్యక్రమం ఉండటంతో ఆ పెళ్లి ప్రదర్శన (బారాత్) గ్రామం నుంచి వెళ్లిన ఆ తరువాత మాత్రమే సమీపంలోని రాజ్ఘర్ గ్రామంలో ఉంచిన అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఇదిలా ఉంటే పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న గజేంద్ర సింగ్ అంతిమయాత్రకు ఆప్ నేతలు ఎవ్వరూ హాజరు కాకపోవటం గమనార్హం. కాగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బుధవారం ఆప్ ర్యాలీ సందర్భంగా , అందరూ చూస్తుండగానే బహిరంగంగా గజేంద్ర సింగ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే.