వెర్రి వెయ్యి విధాలు అంటే ఇదేనేమో. సాధారణంగా మనకు బాగా నచ్చిన వాహనాలకు మనతో పాటే ఉంచుకుంటాం, లేదంటే ఎవరికైనా పనికొస్తే ఇచ్చేస్తాం. కొత్త వెహికల్ కొన్నప్పుడు పాత వాహనం మార్పిడి చేసుకుంటాం. కానీ గుజరాత్‌లో ఓ వ్యాపారి మాత్రం తనకు బాగా అచ్చొచ్చిన కారును సమాధి చేసేశాడు. అదేదో అషామాషీగా చేయలేదు. ఏకంగా 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి వేడుకగా ఈ తంతు జరిపాడు. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. తీరా చూస్తే ఈ కారు ఏ ముప్ఫైనలబై ఏళ్లనాటిదో కాదు.. జస్ట్ 12 ఏళ్లు మాత్రమే వాడారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
15 అడుగుల లోతు గుంతలో..
గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి తనకు, తన కుటుంబానికి సంపద, పేరు తెచ్చిన లక్కీ కారును ఘనంగా సమాధి చేశారు. అమ్రేలి జిల్లా లాఠీ తాలూకా పదార్‌సింగ్ గ్రామం ఇందుకు వేదికైంది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు సహా 1,500 మంది హాజరయ్యారు. ఫాంహౌస్‌లో సుమారు 15 అడుగుల లోతు గుంతలో ఉన్న వాగన్ ఆర్ కారు, సంజయ్ పొలారా, అతని కుటుంబం పూజలు చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
అంతకుముందు, పూలు, పూలదండలతో అందంగా అలంకరించిన కారును పొలారా కుటుంబీకులు బాజా భజంత్రీలతో గ్రామంలోని తమ ఇంటి నుంచి ఊరేగింపుగా ఫాంహౌస్‌లోని తీసుకువచ్చారు. అక్కడున్న ఏటవాలు నిర్మాణం మీదుగా గుంతలోకి దింపారు. కారుపై పచ్చని వ్రస్తాన్ని కప్పారు. పూజారులు మంత్రాలు చదువుతుండగా పొలారా, కుటుంబసభ్యులు కారుపై పూలు చల్లుతూ పూజలు చేశారు. చివరగా బుల్డోజర్ కారును మట్టితో సమాధి చేసేసింది.
વ્હાલસોઈ નસીબદાર કારની સમાધિ !!!
અમરેલીમાં પરિવાર માટે લકી કારને વેચવાને બદલે ઘામધૂમથી જમણવાર યોજી સમાધિ અપાઈ, કારના સમાધિ સ્થળે વૃક્ષારોપણ કરાશે #Gujarat #Amreli pic.twitter.com/1c4hiogs7n— Kamit Solanki (@KamitSolanki) November 8, 2024
కారొచ్చాక కలిసొచ్చింది..
ఈ కారు వచ్చిన తనకు బాగా కలిసొచ్చిందని సూరత్‌లో నిర్మాణ సంస్థను నడుపుతున్న సంజయ్ పొలారా మీడియాతో చెప్పారు. భవిష్యత్ తరాలకు శాశ్వతమైన జ్ఞాపకంగా ఉండాలనే తన లక్కీ కారును సమాధి చేసినట్టు వెల్లడించారు. "దాదాపు 12 సంవత్సరాల క్రితం నేను ఈ కారు కొన్నాను. ఇది మా కుటుంబానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారంలో విజయాలు దక్కాయి. నా కుటుంబ గౌరవం పెరిగింది. అందుకే దీన్ని అమ్మకుండా మా పొలంలో సమాధి చేశామ"ని సంజయ్ వివరించారు. నెటిజనులు మాత్రం ఈ ఉదంతంపై భిన్నంగా స్పందించారు. ఇదేం పిచ్చంటూ సెటైర్లు వేస్తున్నారు.
చదవండి: కన్నవాళ్లు వద్దని విసిరేస్తే.. కిష్టయ్యగా పునర్జన్మ పొందాడు
Comments
Please login to add a commentAdd a comment