Amreli
-
ఇదేం పిచ్చో.. కారును సమాధి చేశారు!
వెర్రి వెయ్యి విధాలు అంటే ఇదేనేమో. సాధారణంగా మనకు బాగా నచ్చిన వాహనాలకు మనతో పాటే ఉంచుకుంటాం, లేదంటే ఎవరికైనా పనికొస్తే ఇచ్చేస్తాం. కొత్త వెహికల్ కొన్నప్పుడు పాత వాహనం మార్పిడి చేసుకుంటాం. కానీ గుజరాత్లో ఓ వ్యాపారి మాత్రం తనకు బాగా అచ్చొచ్చిన కారును సమాధి చేసేశాడు. అదేదో అషామాషీగా చేయలేదు. ఏకంగా 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి వేడుకగా ఈ తంతు జరిపాడు. శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. తీరా చూస్తే ఈ కారు ఏ ముప్ఫైనలబై ఏళ్లనాటిదో కాదు.. జస్ట్ 12 ఏళ్లు మాత్రమే వాడారు. ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.15 అడుగుల లోతు గుంతలో..గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి తనకు, తన కుటుంబానికి సంపద, పేరు తెచ్చిన లక్కీ కారును ఘనంగా సమాధి చేశారు. అమ్రేలి జిల్లా లాఠీ తాలూకా పదార్‌సింగ్ గ్రామం ఇందుకు వేదికైంది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు సహా 1,500 మంది హాజరయ్యారు. ఫాంహౌస్‌లో సుమారు 15 అడుగుల లోతు గుంతలో ఉన్న వాగన్ ఆర్ కారు, సంజయ్ పొలారా, అతని కుటుంబం పూజలు చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. అంతకుముందు, పూలు, పూలదండలతో అందంగా అలంకరించిన కారును పొలారా కుటుంబీకులు బాజా భజంత్రీలతో గ్రామంలోని తమ ఇంటి నుంచి ఊరేగింపుగా ఫాంహౌస్‌లోని తీసుకువచ్చారు. అక్కడున్న ఏటవాలు నిర్మాణం మీదుగా గుంతలోకి దింపారు. కారుపై పచ్చని వ్రస్తాన్ని కప్పారు. పూజారులు మంత్రాలు చదువుతుండగా పొలారా, కుటుంబసభ్యులు కారుపై పూలు చల్లుతూ పూజలు చేశారు. చివరగా బుల్డోజర్ కారును మట్టితో సమాధి చేసేసింది. વ્હાલસોઈ નસીબદાર કારની સમાધિ !!!અમરેલીમાં પરિવાર માટે લકી કારને વેચવાને બદલે ઘામધૂમથી જમણવાર યોજી સમાધિ અપાઈ, કારના સમાધિ સ્થળે વૃક્ષારોપણ કરાશે #Gujarat #Amreli pic.twitter.com/1c4hiogs7n— Kamit Solanki (@KamitSolanki) November 8, 2024కారొచ్చాక కలిసొచ్చింది..ఈ కారు వచ్చిన తనకు బాగా కలిసొచ్చిందని సూరత్‌లో నిర్మాణ సంస్థను నడుపుతున్న సంజయ్ పొలారా మీడియాతో చెప్పారు. భవిష్యత్ తరాలకు శాశ్వతమైన జ్ఞాపకంగా ఉండాలనే తన లక్కీ కారును సమాధి చేసినట్టు వెల్లడించారు. "దాదాపు 12 సంవత్సరాల క్రితం నేను ఈ కారు కొన్నాను. ఇది మా కుటుంబానికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. వ్యాపారంలో విజయాలు దక్కాయి. నా కుటుంబ గౌరవం పెరిగింది. అందుకే దీన్ని అమ్మకుండా మా పొలంలో సమాధి చేశామ"ని సంజయ్ వివరించారు. నెటిజనులు మాత్రం ఈ ఉదంతంపై భిన్నంగా స్పందించారు. ఇదేం పిచ్చంటూ సెటైర్లు వేస్తున్నారు. చదవండి: కన్నవాళ్లు వద్దని విసిరేస్తే.. కిష్టయ్యగా పునర్జన్మ పొందాడు -
స్ట్రాంగ్ రూమ్‌లో దూరి.. రూ.1.35 కోట్లు చోరి
రాజ్‌కోట్: చిన్న సందు దొరికితే చాలు దొంగలు దూరిపోతున్నారు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు చెందిన ఓ బ్రాంచ్‌లో చోరబడిన దుండగులు ఏకంగా కోటి 35 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఈ ఘటన గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్‌లో జరిగింది. శనివారం రాత్రి దొంగలు తొలుత బ్యాంక్ పక్కనే ఖాళీగా ఉన్న భవనంలోకి చేరుకున్నారు. ఆ తర్వాత బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌కు ఉన్న వెంటిలేటర్ ఇనుప గ్రిల్స్‌ను తొలగించారు. ఆ చిన్న సందులో నుంచి ఓ వ్యక్తి బ్యాంక్ స్ట్రాంగ్ రూమ్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నగదుతో అదే వెంటిలేటర్ నుంచి ఉడాయించారు. కాగా శనివారమే చోరి జరిగినప్పటికీ ఆదివారం, సోమవారం(కృష్ణాష్టమి) రెండు రోజులు బ్యాంక్‌కు సెలవు కావడంతో.. మంగళవారం బ్యాంక్ తెరవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అదే రోజు సాయంత్రం బ్యాంక్ అధికారులు అమ్రేలి పోలీసులను ఆశ్రయించారు. ఎంత నగదు చోరికి గురైందో తెలుసుకోవడానికి అధికారులు రికార్డులను పరిశీలించారు. 1.35 కోట్ల రూపాయలకు పైగా దొంగిలించబడినట్టు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందిస్తూ.. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని తెలిపారు. దొంగలు వెనుక వైపు నుంచి రావడంతో వారు స్ట్రాంగ్ రూమ్ డోర్లను తాకలేదని.. అందువల్ల అలారమ్ మోగలేదన్నారు. దొంగలు ప్రవేశించిన పాత బిల్డింగ్‌ను గతంలో సెంట్రల్ ఎక్సైజ్ శాఖ వారు వినియోగించుకున్నారని.. ప్రస్తుతం అది ఖాళీగా ఉందని పేర్కొన్నారు. ఈ చోరిలో ఎంతమంది పాల్గొన్నారనే దానిపై స్పష్టత లేదాన్నారు. -
కేంద్రమంత్రికి అవమానం..గాజులతో దాడి
అహ్మదాబాద్: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఓ వ్యక్తి ఝలక్ ఇచ్చాడు. గుజరాత్‌లోని ఆమ్రేలీలో నిర్వహించిన ఓ ఫంక్షన్లో ఆమె మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమెపైకి గాజులు విసిరేశాడు. వందేమాతరం అంటూ గట్టిగా నినాదాలు చేశాడు. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అమ్రేలీలో వేడుక నిర్వహిస్తుండగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అక్కడికి అతిథిగా వచ్చారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుండగా కాస్వాలా అనే వ్యక్తి లేచి రెండు మూడు గాజులు అనూహ్యంగా ఆమెపైకి విసిరాడు. అనంతరం వందేమాతరం అంటూ నినాదాలు చేశాడు. అయితే, ఆ వ్యక్తికి స్మృతి ఇరానీకి మధ్య కాస్త దూరం ఉండటంతో ఆమెను తాకలేదు. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని బయటకు తీసుకెళ్లారు. ఆ వ్యక్తికి భండారియా అనే గ్రామంగా గుర్తించారు. అయితే, రైతులపై రుణమాఫీ, అప్పుల విషయాన్ని కేంద్రమంత్రి చెప్పే ప్రయత్నంలో భాగంగా అతడు అలా చేశాడని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పగా పోలీసులు తోసిపుచ్చారు. -
మోటార్ సైకిల్ ట్రాక్టర్
భలేబుర్ర అసలే కరువు ప్రాంతం. రైతులకు అందుబాటులో ఉండే వనరులు అంతంత మాత్రమే. ఉన్న చారెడు నేలను దున్నేందుకు ట్రాక్టర్ సమకూర్చుకోవడం అక్కడి రైతులకు కలలోని మాటే. అవకాశం ఉంటే ఎద్దులను నమ్ముకోవాలి... లేకుంటే, రైతులే స్వయంగా భుజాన నాగలి వేసుకుని, సత్తువ కొద్దీ దున్నాలి... ఇదీ గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలోని పరిస్థితి. చౌకగా దొరికే దున్నే యంత్రాలేవీ లేవు. పొలాలకు నీళ్లు పట్టాలన్నా విద్యుత్తు అందని పరిస్థితి. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూడాలంటూ మన్సుఖ్భాయ్ని కోరాడు అతడి మిత్రుడు. మన్సుఖ్భాయ్ సాదా సీదా మెకానిక్. అతడి మిత్రుడు ఒక రైతు. మన్సుఖ్భాయ్ని కలుసుకునేందుకు ఆ మిత్రుడు ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్‌పై వచ్చాడు. మోటార్ సైకిల్‌ను చూడగానే మన్సుఖ్భాయ్ బుర్రలో బల్బు వెలిగింది. బుల్లెట్ మోటార్ సైకిల్ ఇంజిన్, చెసిస్ను విడదీసి, వెనుకభాగంలో ట్రాక్టర్ తరహా పరికరాలను జోడించాడు. మోటార్‌సైకిల్ ఇంజిన్ సాయంతో ట్రాక్టర్ తరహా పరికరాలు పనిచేసేలా తయారు చేశాడు. విజయవంతంగా పనిచేసింది. ఈ మోటార్‌సైకిల్ ట్రాక్టర్‌కు ‘బుల్లెట్శాంతి’ అని పేరుపెట్టాడు. కేవలం పొలం దున్నడానికి మాత్రమే కాదు, పొలంలోని కలుపు తీయడానికి, విత్తనాలు చల్లడానికి కూడా ఉపయోగపడేలా మన్సుఖ్భాయ్ దీనిని తీర్చిదిద్దాడు. దీనికి అమెరికా నుంచి, భారత్ నుంచి పేటెంట్లు కూడా సాధించాడు. గంటలో నాలుగెకరాల పొలాన్ని అవలీలగా దున్నేయగల ఈ ‘బుల్లెట్శాంతి’కి గంటకు లీటరు పెట్రోలు అవసరం అవుతుంది. ట్రాక్టర్‌తో పోల్చి చూస్తే ఇది కారుచౌకగా అందుబాటులో ఉండటంతో గుజరాత్‌లోని కరువు ప్రాంతాల రైతులు దీని వైపు మొగ్గుచూపుతున్నారు.