మోటార్ సైకిల్ ట్రాక్టర్
భలేబుర్ర
అసలే కరువు ప్రాంతం. రైతులకు అందుబాటులో ఉండే వనరులు అంతంత మాత్రమే. ఉన్న చారెడు నేలను దున్నేందుకు ట్రాక్టర్ సమకూర్చుకోవడం అక్కడి రైతులకు కలలోని మాటే. అవకాశం ఉంటే ఎద్దులను నమ్ముకోవాలి... లేకుంటే, రైతులే స్వయంగా భుజాన నాగలి వేసుకుని, సత్తువ కొద్దీ దున్నాలి... ఇదీ గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలోని పరిస్థితి. చౌకగా దొరికే దున్నే యంత్రాలేవీ లేవు. పొలాలకు నీళ్లు పట్టాలన్నా విద్యుత్తు అందని పరిస్థితి. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూడాలంటూ మన్‌సుఖ్‌భాయ్‌ని కోరాడు అతడి మిత్రుడు. మన్‌సుఖ్‌భాయ్ సాదా సీదా మెకానిక్. అతడి మిత్రుడు ఒక రైతు.
మన్‌సుఖ్‌భాయ్‌ని కలుసుకునేందుకు ఆ మిత్రుడు ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్‌పై వచ్చాడు. మోటార్ సైకిల్‌ను చూడగానే మన్‌సుఖ్‌భాయ్ బుర్రలో బల్బు వెలిగింది. బుల్లెట్ మోటార్ సైకిల్ ఇంజిన్, చెసిస్‌ను విడదీసి, వెనుకభాగంలో ట్రాక్టర్ తరహా పరికరాలను జోడించాడు. మోటార్‌సైకిల్ ఇంజిన్ సాయంతో ట్రాక్టర్ తరహా పరికరాలు పనిచేసేలా తయారు చేశాడు. విజయవంతంగా పనిచేసింది. ఈ మోటార్‌సైకిల్ ట్రాక్టర్‌కు ‘బుల్లెట్‌శాంతి’ అని పేరుపెట్టాడు.
కేవలం పొలం దున్నడానికి మాత్రమే కాదు, పొలంలోని కలుపు తీయడానికి, విత్తనాలు చల్లడానికి కూడా ఉపయోగపడేలా మన్‌సుఖ్‌భాయ్ దీనిని తీర్చిదిద్దాడు. దీనికి అమెరికా నుంచి, భారత్ నుంచి పేటెంట్లు కూడా సాధించాడు. గంటలో నాలుగెకరాల పొలాన్ని అవలీలగా దున్నేయగల ఈ ‘బుల్లెట్‌శాంతి’కి గంటకు లీటరు పెట్రోలు అవసరం అవుతుంది. ట్రాక్టర్‌తో పోల్చి చూస్తే ఇది కారుచౌకగా అందుబాటులో ఉండటంతో గుజరాత్‌లోని కరువు ప్రాంతాల రైతులు దీని వైపు మొగ్గుచూపుతున్నారు.