సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సహకార పరపతి సంఘాని (సీసీఎస్)కి పేరుకుపోయిన బకాయిల కోసం ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. సీసీఎస్‌కు ఆర్టీసీ బకాయిపడ్డ రూ.1,000 కోట్లను వెంటనే విడుదల చేయించాలని కోరుతూ ఉద్యోగులు ముఖ్యమంత్రికి మూకుమ్మడి లేఖలు పంపుతున్నారు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10 వేల లేఖలు పోస్టు చేశారు. కొంతకాలంగా ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన మొత్తాన్ని సీసీఎస్‌కు జమ చేయకుండా ఆర్టీసీ సొంతానికి వినియోగించుకుంటోంది. ఇలా దాదాపు రూ.1,000 కోట్లు బకాయి (వడ్డీతో కలుపుకొని) పేరుకుపోయింది.
గతంలో ఉద్యోగులు తీసుకున్న అప్పులు మరో రూ.800 కోట్లు ఉన్నాయి. ఇందులో రూ.1,000 కోట్లను వెంటనే విడుదల చేసి ఉద్యోగులకు తిరిగి రుణాలు ఇవ్వడం ప్రారంభించాలని చాలాకాలంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, తమ వద్ద నిధులు లేనందున సమయం పడుతుందంటూ ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందితే చెల్లిస్తామని చెబుతున్నట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని వేడుకుంటూ ముఖ్యమంత్రికి లేఖలు పంపాలని ఇటీవల నిర్ణయించారు.
ఈ మేరకు మొత్తం 10 వేల లేఖలు సిద్ధం చేసి, డిపోల వారీగా ఉద్యోగుల సంతకాలతో పోస్టు చేస్తున్నారు. సీసీఎస్‌లో నిధులు లేకపోవడంతో ఉద్యోగులకు రుణాలు అందకపోవటమే కాకుండా, రిటైర్ అయి సీసీఎస్‌లో నగదు డిపాజిట్ చేసుకున్న విశ్రాంత ఉద్యోగులకు వడ్డీ ఇవ్వటం లేదని, సీసీఎస్‌లో సభ్యత్వం రద్దు చేసుకున్న వారికి చెల్లింపులు జరపటం లేదని, రిటైర్ అయిన వారికి సెటిల్‌మెంట్ చేయటం లేదని ఆ లేఖల్లో పేర్కొన్నారు.
27న జనరల్ బాడీ సమావేశం..
సీసీఎస్‌కు సంబంధించి ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలి. కానీ, ఏడాది కాలంలో ఓసారి సమ్మె వల్ల, మరోసారి కోవిడ్ వల్ల ఈ సమావేశాలు జరుగలేదు. రెండేళ్లుగా సీసీఎస్‌లో నిధులు లేక రుణాలు అందని దుస్థితి నెలకొన్నందున ఇప్పుడు అత్యవసరంగా సమావేశం నిర్వహించాలని సీసీఎస్ పాలక మండలి నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 27 తేదీని ఖరారు చేశారు.
ఉద్యోగుల ప్రతినిధులుగా ఉండే 250 మంది, ఆర్టీసీ ఎండీ, ఇతర సభ్యులైన అధికారులు, ఎక్స్‌అఫీషియో సభ్యులు పాల్గొనాలి. కానీ, లోన్ల విషయంలో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నందున జనరల్ బాడీ సమావేశంలో ఘర్షణ పూరిత వాతావరణం ఉండనుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీసీఎస్‌కు బకాయి పడ్డ మొత్తాన్ని ఇవ్వలేక చేతులెత్తేసినందున, ఈ సమావేశంతో గందరగోళం నెలకొంటుందని భావిస్తున్న ఆర్టీసీ అధికారులు, భేటీ జరుగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సమావేశాన్ని నిర్వహించి తీరుతామని సీసీఎస్ పాలకమండలి స్పష్టం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment