
మీ పాన్ వివరాలివ్వండి..
♦ 7 లక్షల మందికి త్వరలో ఐటీ శాఖ లేఖలు
♦ పాన్ రహిత భారీ లావాదేవీలపై కన్ను
♦ పన్ను ఎగవేతలకు అడ్డుకట్టే లక్ష్యం..
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతల నిరోధం దిశగా ఆదాయపు పన్ను శాఖ మరో కీలక అడుగు వేయనుంది. భారీ విలువగల ఆర్థిక లావాదేవీల నిర్వహణ లేదా తమ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో రూ.10 లక్షలకన్నా అధికంగా ఉన్న 7 లక్షల మంది అసెసీల నుంచి వారి పాన్ వివరాలను ప్రత్యేకంగా సేకరించనుంది. త్వరలో వీరికి ఆదాయపు పన్ను శాఖ లేఖలు రాయనున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటన ప్రకారం, యాన్యువల్ ఇన్‌ఫర్మేషన్ రిటర్న్స్ (ఏఐఆర్) కింద పలు అధిక విలువ ఆర్థిక లావాదేవీలు ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వచ్చాయి.
సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో రూ.10 లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్లు, రూ.30 లక్షలు ఆపైన స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాలు వంటివి ఇందులో ఉన్నాయి. అయితే వీటిలో పలు లావాదేవీలు పాన్‌తో అనుసంధానం కాకపోవడాన్ని ఆదాయపు పన్నుశాఖ గుర్తించింది. నల్లధనం వివరాలు తెలియజేసి, 45 శాతం పన్ను చెల్లింపుల ద్వారా ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు పొందే వెసులుబాటును కల్పిస్తూ 4 నెలలు అమల్లో ఉండే ఒక కీలక పథకాన్ని జూన్ 1న కేంద్రం ప్రారంభించిన నేపథ్యంలోనే ఐటీ శాఖ తాజా చొరవ తీసుకోవడం గమనార్హం.
90 లక్షల పాన్ రహిత లావాదేవీల గుర్తింపు...
2009-10 నుంచి 2016-17 మధ్య పాన్ లేకుండా భారీ ఆర్థిక లావాదేవీలు దాదాపు 90 లక్షలు జరిగినట్లు అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో ఐటీ శాఖ గుర్తించింది. ఇందులో ఇప్పటికి 14 లక్షల లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించి, అందులో సందేహాస్పదమైన 7 లక్షల లావాదేవీలను వెలికితీసింది. పాన్ వివరాలు సమర్పించాలని వీరికి త్వరలో లేఖలు రాయాలని నిర్ణయించింది. అలాగే లేఖలు పంపుతున్న వారి సౌలభ్యం నిమిత్తం వారు తగిన సమాచారం ఇవ్వడం కోసం ఒక ఈ-పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు కూడా అత్యున్నత స్థాయి వర్గాలు తెలి పాయి. పంపే లేఖలో ఒక యునిక్ ట్రాన్జాక్షన్ సీక్వెన్స్ నంబర్ ఉంటుంది. లేఖ అందుకున్న వ్యక్తులు తమ ఈ- ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత, ఈ నంబర్ సహాయంతో తమ లావాదేవీలకు తమ పాన్ వివరాలను జతచేసే వీలుంటుంది. అలాగే ఈ-పోర్టల్ ద్వారానే తమ సమాధానాన్ని కూడా తెలియజేయవచ్చు.