గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రధాని మంత్రి అయితే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ‘రాజకీయాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్’ బిల్లు చట్టం రూపంలో అమల్లోకి వస్తుందని
సాక్షి, బెంగళూరు : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ప్రధాని మంత్రి అయితే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ‘రాజకీయాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్’ బిల్లు చట్టం రూపంలో అమల్లోకి వస్తుందని ఎంపీ అనంతకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ మహిళామోర్చ ఆధ్వర్యంలో నగరంలోని శిక్షకర సదన్‌లో శనివారం రాష్ట్ర స్థాయి ‘మహిళా న్యాయవాదుల సమావేశం’ జరిగింది.
ఈ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ... రాజకీయంగా మహిళలు ఎదిగినప్పుడు మాత్రమే సమాజంలో వివిధ తారతమ్యాలు తగ్గిపోతాయన్నారు. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు తీసుకురావాల్సి ఉందన్నారు. నరేంద్రమోడీ ప్రధాని అయిన వెంటనే మహిళలకు రాజకీయాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించబడిన బిల్లు చట్టం రూపంలో అమల్లోకి వ చ్చి తీరుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు, పిల్లలకు రక్షణ కరువవుతోందన్నారు. పోలీసు వ్యవస్థలో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించడం ద్వారా సమస్యను కొంతవరకూ పరష్కరించవచ్చన్నారు.
అదేవిధంగా ‘మహిళ హొయసల’, ‘మహిళ చీత’ వంటి ప్రత్యేక విభాగాల ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని మొత్తం పోలీసు సిబ్బందిలో కేవలం 5 శాతం మంది మహిళా పోలీసులు ఉన్నారన్నారు. దీనిని 50 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్‌లో మహిళల సమస్యలను పరిష్కరించడానికి నారీ అదాలత్‌లు అక్కడి ప్రభుత్వం తరుచుగా నిర్వహిస్తోందన్నారు. అలాంటి వ్యవస్థ రాష్ట్రంలో కూడా ఉండాల్సిన అవసరం ఉందని అనంతకుమార్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ మహిళమోర్చ అధ్యక్షురాలు శశికళ, సీనియర్ న్యాయవాది ప్రమీళ నెసర్గీ తదితరులు పాల్గొన్నారు.