పాట్నా: ఆర్జేడీ సీనియర్ నాయకుడు రఘువంశ్ ప్రసాద్ సింగ్ కుమారుడు సత్యప్రకాష్ సింగ్ గురువారం జేడీ(యు) పార్టీలో చేరారు. వైశాలి జిల్లా మన్హర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించి ఆయన భంగపడ్డారు. త్వరలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్జేడీ పార్టీ సభ్యుడు, డాన్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన రామా సింగ్ భార్యకు లాలు ప్రసాద్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. ఆమెకు టికెట్ ఇచ్చిన మరుసటి రోజే సత్య ప్రకాష్ సింగ్ జేడీ(యు)లో చేరడం చర్చనీయాంశం మారింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు జేడీ(యు) రాష్ట్ర అధ్యక్షుడు బసిస్తా నారాయణ్ సింగ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బసిస్తా మాట్లాడుతూ.. తన తండ్రి కలను తనయుడిగా ప్రకాష్ నేరవేరుస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. సత్యప్రకాష్ సింగ్ మాట్లాడుతూ... ఇటీవల తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టానని చెప్పారు. తన తండ్రి రఘువంశ్ కలలను తాను పూర్తి చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తన తండ్రి సోషల్‌లిస్టు భావాలను నమ్మె వ్యక్తి అని అందుకే రాజకీయాల్లో ఒక కుటుంబం నుంచి ఒక్కరూ ఇద్దరూ సభ్యులు మాత్రమే ఉండాలని ఆయన బలంగా నమ్ముతారని చెప్పారు. సోషలిస్ట్ నాయకుడైన కార్పూరి ఠాకూర్ తన జీవితకాలంలో దీనిని ఆచరించారని, అలాగే తన తండ్రి కూడా అదే విశ్వసించారని చెప్పారు. పార్టీని తమ కుటుంబాన్ని కాదని మరొకరికి ఆర్జేడీ టిక్కెట్ ఇవ్వడాన్ని ఆయన విమర్శించారు.
ఆర్జేడీ పార్టీ ప్రతినిధి తివారీ స్పందిస్తూ.. విజయావకాశాలు ఉన్న వ్యక్తికి టికెట్ ఇవ్వడంలో తప్పు లేదని వ్యాఖ్యానించారు. 2014లో వైశాలి నియోజవర్గం నుంచి రామా సింగ్ లోకసభ ఎన్నికలకు ఆర్జేడీ పార్టీ నుంచి పోటీ చేయడంపై రఘువంశ్ సింగ్ వ్యతిరేకించారు. గత నెలలో రఘువంశ్ సింగ్ కన్నుమూశారు. లాలూప్రసాద్ యాదవ్‌కు విశ్వాసపాత్రునిగా ఉంటూ రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించిన ఆయన చనిపోవడానికి నాలుగు రోజుల ముందు ఆర్జేడీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన రాజీనామాను రాంచీ జైలులో ఉన్న లాలూ అంగీకరించలేదు. ఆరోగ్యం కుదుటపడ్డాక మాట్లాడుకుందామంటూ జవాబిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment