చాలాకాలంగా వినిపిస్తున్నదే నిజమైంది. కర్ణాటక పీఠంపై యడియూరప్ప స్థానంలో కొత్త నేత కూర్చున్నారు. కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బుధవారం పదవీ స్వీకారం చేయడంతో యడియూరప్ప పాత అధికార శకం ముగిసింది. దక్షిణాదిలో తమకు పట్టం కట్టిన తొలి రాష్ట్రంలో బీజేపీ కొత్త అధ్యాయం మొదలుపెట్టింది. కన్నడనాట పార్టీ బలోపేతంలో, అధికారంలోకి తేవడంలో కీలక పాత్రధారి యడ్డీ తర్వాత ఎవరన్న చిరకాలపు చిక్కుప్రశ్నకు బీజేపీ జవాబిచ్చింది. యడ్డీ మంత్రివర్గంలో హోమ్ మంత్రి బొమ్మై ఇప్పుడు పార్టీనీ, ప్రభుత్వాన్నీ చక్కదిద్దాల్సిన బరువు భుజానికెత్తుకున్నారు. 1980లలో తొమ్మిది నెలల పాటు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పనిచేసిన తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ ఎస్సార్ బొమ్మై వారసుడిగా నడక ప్రారంభించారు.
ఇంజనీరింగ్ చదివి, టాటా మోటార్స్‌లో ఉద్యోగం చేస్తూ, వ్యాపారవేత్తగా మారాలని బెంగళూరొచ్చి, అనుకోకుండా రాజకీయాల్లోకి దిగిన బసవరాజ్ సీఎం స్థాయికి ఎదగడం అనూహ్యమే. జనతాదళ్‌తో మొదలై, బీజేపీలో చేరడానికన్నా ముందు జేడీయూలో పనిచేసిన గతం బొమ్మైది. కరోనా వేళ ప్రభుత్వ వైఫల్యం, అవినీతి, బంధుప్రీతి, పెరుగుతున్న అసమ్మతితో యడ్డీ క్రమంగా పార్టీకి బరువవుతున్న సంగతిని అధిష్ఠానం చాలాకాలం క్రితమే గుర్తించింది. ఇప్పటిదాకా నాలుగు సార్లు సీఎం అయినా, ఒక్కసారీ పూర్తికాలం పదవిలో లేని జాతకం యడ్డీది. 2012లోనైతే ఏకంగా అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఇదే యడ్డీ... బీజేపీ నుంచి బయటకొచ్చి, సొంత పార్టీ పెట్టి సత్తా చాటిన రోజులనూ అధినాయకత్వం మర్చిపోలేదు.
ఈసారి పార్టీకి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తగా, అదే సమయంలో గౌరవంగా యడ్డీని సాగనంపాలని అధిష్ఠానం 4 నెలలుగా ప్రణాళికలు వేస్తూ వచ్చింది. అందుకే, ఆయనను కానీ, రాష్ట్రంలో దళితుల (23 శాతం) తరువాత రెండో అతి పెద్దదైన (17 శాతం) ఆయన లింగాయత్ సామాజిక వర్గాన్ని కానీ శత్రువుల్ని చేసుకోకుండా తెలివిగా వ్యవహరించింది. ఒక దశలో లింగాయత్‌ల బదులు మరో కీలక ఒక్కళిగల వర్గానికి చెందిన నేతను గద్దెపై కూర్చోబెట్టాలని అధిష్ఠానం తర్జనభర్జన పడింది. కానీ, దక్షిణాదిన బలంగానూ, అధికారంలోనూ ఉన్న ఏకైక రాష్ట్రంలో అతిగా ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం వస్తుందని వెనక్కు తగ్గింది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాల్లో 100 స్థానాల్లో ఫలితాన్ని నిర్ణయించే లింగాయత్‌లకు జోల పాడింది. వయసు మీద పడ్డ 78 ఏళ్ళ యడ్డీ స్థానంలో తోటి లింగాయత్ అయిన 61 ఏళ్ళ బొమ్మై మెరుగు అనుకుంది. అలా ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన నేతకు సీఎం సీటు దక్కాలన్న ఆ ప్రాంతీయుల చిరకాల డిమాండ్‌ను కూడా తీర్చింది.
వాజ్‌పేయి – అడ్వాణీల తరం నేతలను ఒక్కొక్కరిగా వదిలించుకుంటూ వస్తున్న మోదీ, అమిత్ షా ద్వయం ఆ క్రమంలోనే యడ్డీ స్థానంలో బొమ్మైని తెచ్చింది. అదే సమయంలో ‘దశాబ్దాలుగా మీరు చేసిన సేవలకు మాటలు సరిపోవు’ అంటూ ట్విట్టర్ సాక్షిగా యడ్డీపై ప్రశంసల వర్షమూ కురిపించింది. ఆచితూచి చేసిన ఈ మార్పుతో బీజేపీకి ఒకే దెబ్బకు రెండు పిట్టలు దక్కాయి. ఒకటి – బొమ్మై కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవాడే కావడంతో, రాష్ట్రంలో తమ బలమైన ఓటు బ్యాంకును దూరం చేసుకోకుండా, కాపాడుకున్నట్టయింది. రెండోది – యడ్డీకి బొమ్మై నమ్మినబంటు కావడం వల్ల, నిష్క్రమిస్తున్న సీనియర్ నేత నుంచి అసమ్మతులు, కొత్త ఇబ్బందులు లేకుండా చూసుకున్నట్టయింది. యడియూరప్ప సైతం నిష్క్రమణ సమయంలోనూ కోరుకున్న హిరణ్యాక్ష వరాలు దక్కించుకొని, పార్టీపై తన పట్టు సడలలేదని చాటుకున్నారు. పదవి పోయినా తానే తెర వెనుక సీఎం అనే ఇమేజ్ తెచ్చుకున్నారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖకు ఉపాధ్యక్షుడైన తన చిన్న కొడుకు 45 ఏళ్ళ విజయేంద్ర ప్రాధాన్యానికి భంగం రాదన్న హామీ పుచ్చుకున్నారు.
ఇక, యడ్డీ వారసుడిగా పీఠమెక్కిన బొమ్మైకి 20 నెలల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఉన్న సమయం తక్కువ. సవాళ్ళు ఎక్కువ. కరోనా వేళ దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ఠను ఆయన పునరుద్ధ రించాల్సి ఉంటుంది. యడ్డీ అవినీతి, బంధుప్రీతి మరకలు పార్టీ విజయావకాశాలకూ, ప్రభుత్వ గౌరవానికీ భంగం కలిగించకుండా చకచకా చర్యలు చేపట్టాలి. యడ్డీ ఖాళీ చేయగానే సీఎం సీటులో కూర్చోవాలని ఆశపడ్డ ఆశావహులను బుజ్జగించి, కలుపుకొని పోవాలి. వ్యక్తిగత గురువైన యడ్డీని తోసిపుచ్చకుండానే, సొంతకాళ్ళపై నిలబడి పదవిని సుస్థిరం చేసుకొనేందుకు సమస్త ప్రయత్నాలూ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా... పార్టీలో సమస్యల పరిష్కర్తగా, సౌమ్యుడిగా, మధ్యేవాదిగా ఇప్పటి దాకా తనకున్న పేరును కాపాడుకుంటూనే, యడ్డీ లాంటి జననేతగా ఓటర్ల గుండెల్లో గూడు కట్టుకోవాలి. 2018 ఎన్నికలలో గెలిచినా – ఎమ్మెల్యేలపై యడ్డీ వేసిన ‘ఆపరేషన్ కమల్’ మంత్రంతో అధికారానికి దూరమైన కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్)లు తిరిగి బలం పుంజుకోకుండా జాగ్రత్త పడాలి.
ఇప్పటికే అధిష్ఠానం మరో ముగ్గురిని ఉప ముఖ్యమంత్రుల్ని చేస్తోందన్న వార్తలొచ్చాయి. అంటే, బొమ్మైకి ఆది నుంచే ఆట మొదలైపోయింది. మరి, స్వతహాగా క్రికెట్ వీరాభిమాని, గతంలో కర్ణాటక క్రికెట్ సంఘానికి చైర్మన్ అయిన బొమ్మై తన కెప్టెన్సీలో కర్ణాటక బీజేపీ టీమ్‌ను ఎంత సమన్వయంతో, సమర్థంగా నడిపిస్తారో చూడాలి. నిండా రెండేళ్ళయినా దూరం లేని 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన సిక్సర్ కొడతారా? రోజుకో రకంగా మారే రాజకీయాలలో అధిష్ఠానం ఆశలు, ఆలోచనల్ని నిజం చేస్తారా? ఇప్పుడే తెర తీసిన కర్ణాటకంలో కొత్త అంకానికి స్వాగతం.
Comments
Please login to add a commentAdd a comment