బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడితో పాటే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా తారస్థాయికి చేరుతోంది. తమ నామినేషన్లను ఏదోలా చెల్లకుండా చేసేందుకు బసవరాజ్ బొమ్మై సర్కారు భారీ కుట్రకు తెర తీస్తోందని పీసీసీ చీఫ్ శివకుమార్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థుల నామినేషన్లలో ఏదో ఒక లోపాన్ని వెతకాలని, అలాగే బీజేపీ నామినేషన్లలో ఏమైనా తప్పులుంటే సరి చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లందరి మీదా ఎంతగానో ఒత్తిడి తెస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు స్వయానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వారికి ఫోన్లు వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం రంగంలోకి దిగి దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీఎంఓ కాల్ డీటైల్స్ తెప్పించుకుని పరిశీలించాలని సూచించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి అంతూ పొంతూ లేకుండా పోతోందంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ కుట్రకు సంబంధించి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయి. వాటిని సరిచేయాల్సిందిగా సీఎంఓ నుంచి ఆర్‌ఓకు ఫోన్ వెళ్లింది. ఇక నా నామినేషన్‌ను ఏదోలా తిరస్కరింపజేసేందుకు బీజేపీ తరఫున పెద్ద టీమే రంగంలోకి దిగింది. నా పరిస్థితే ఇలా ఉంటే ఇతర సాధారణ అభ్యర్థుల సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment