‘లింగాయత్‌లు ప్రత్యేక మతం కాదు’: ఆర్‌ఎస్‌ఎస్‌ | RSS Opposes Lingayats As Separate Religion | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 13 2018 8:03 PM | Last Updated on Tue, Mar 13 2018 8:03 PM

RSS Opposes Lingayats As Separate Religion - Sakshi

సాక్షి​, బెంగుళూరు: అసెం‍బ్లీ ఎన్నికల నేపథ్యంలో లింగాయత్‌ల చుట్టూ కన్నడ రాజకీయాలు తిరుగుతున్నాయి. ‘కర్ణాటకలో లింగాయత్‌ కమ్యూనిటీని ప్రత్యేక మతంగా అంగీకరించ’ మని నాగ్‌పూర్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ సభ ప్రకటించింది. లింగాయత్‌లు ప్రత్యేక మతంగా పరిగణించాలని డిమాండ్‌ చేస్తున్నారని, దాన్ని అమలు చేస్తే భవిష్యత్‌లో హిందూ మతం ముక్కలయ్యే ప్రమాదం ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ అభిప్రాయపడింది. 

అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లింగాయత్‌ల డిమాండ్‌లకు అంగీకరించారు. లింగాయత్‌ కమ్యూనిటీని ప్రత్యేక మతంగా పరిగణిస్తామని ప్రకటించారు. వారిని మైనారిటీల్లో కలిపేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి నాగమోహన్‌ దాస్‌తో కమిటీ వేశారు. 

హిందూ మతం కులాల కుప్ప..
తమ డిమాండ్ల సాధనలో లింగాయత్‌ కమ్యూనిటీలోని అన్ని వర్గాలు కలిసిరాకపోవడం గమనార్హం. వీరశైవులు లింగాయత్‌ స్థాపకుడు బసవన్న బోధనలతో ఆకర్షితులై శివున్ని పూజించే మతస్తులు. తమని వీరశైవ లింగాయత్‌లుగా పిలవాలని వారు కోరుతున్నారు. తమ గురించి వేదాల్లో చెప్పారనీ..  వీరశైవం   హిందూ మతంలో భాగమని వారు వాదిస్తున్నారు. వేదాలతో విభేదించే లింగాయత్‌లు మాత్రం తమది ప్రత్యేక మతంగా పరిగణించాలని డిమాండ్‌ చేస్తున్నారు. లింగాయత్‌లు హిందూ మతంలో భాగం కానేకాదని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ప్రత్యేక లింగాయత్‌ మత ఉద్యమ నాయకుడు ఎస్‌.ఎం.జామదార్‌ అన్నారు. ‘మా మతాన్ని బసవన్న స్థాపించాడు. ఇందులో కులాలు ఉండవు. హిందూ మతం కులాల కుప్ప’ని వ్యాఖ్యానించారు. 

ముస్లిం, క్రిస్టియన్‌ వర్గాల భయం..
ఈ ఉద్యమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెన్ను దన్నుగా నిలుస్తుండడంతో.. ఆయన ప్రభుత్వం ఈ అంశంపై రెండుగా చీలిపోయింది. లింగాయత్‌లలో ముఖ్యమైన అయిదు వీరశైవ శాఖలు మాత్రం తమకు ప్రత్యేక మతం హోదా అవసరం లేదని అంటున్నాయి. ఇది మిగతా లింగాయత్‌లలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. లింగాయత్‌లను మైనారిటీల్లో చేర్చడం వల్ల.. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన సామాజిక వర్గమైన వారు తమను అణగదొక్కుతారని ముస్లిం, క్రిస్టియన్‌ వర్గాలు బయపడుతున్నాయి. కన్నడ రాష్ట్రంలో 18 శాతం ఉన్న లింగాయత్‌ల ఉద్యమం కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై ఆధారపడి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement