సోమవారం బెంగళూరులో సంబరాలు చేసుకుంటున్న లింగాయత్ వర్గీయులు
సాక్షి, బెంగళూరు: ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కర్ణాటకలో అధికార కాంగ్రెస్ మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌లు, వీరశైవ లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. మతపరమైన మైనారిటీ హోదాను కల్పించే వ్యూహంపై ముందడుగేసింది. సోమవారం సమావేశమైన కర్ణాటక కేబినెట్.. లింగాయత్ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. వారికి మతపరమైన మైనారిటీ హోదా కల్పించాలన్న రిటైర్డ్ జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసులను ఆమోదించింది.ఈ సిఫారసులను త్వరలో కేంద్రానికి పంపనుంది. కన్నడ మంత్రి టీబీ జయచంద్ర మాట్లాడుతూ.. ‘రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది.
ఈ నిర్ణయం ద్వారా తదుపరి విస్తృతమైన సంప్రదింపులు, చర్చలు జరుపుతాం’ అని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రస్తుతం మైనారిటీ హోదాను అనుభవిస్తున్న వారికి ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. కొందరు లింగాయత్ స్వాములు.. సోమవారం సీఎం సిద్దరామయ్యను కలిసి కమిటీ రిపోర్టు వీలైనంత త్వరగా అమలయ్యేలా చూడాలని కోరారు. కేబినెట్ నిర్ణయంతో హర్షిస్తూ.. లింగాయత్‌లు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకోగా.. వీరశైవులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్బుర్గీతోపాటు దావణగెరె, బిజాపుర ప్రాంతాల్లో లింగాయత్‌లు, వీరశైవులకు మధ్య ఘర్షణలు జరిగాయి. కాగా, ఈ రిజర్వేషన్‌పై తమ వైఖరిని వెల్లడించాలని బీజేపీ చీఫ్ అమిత్‌షా, యడ్యూరప్పలు రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు.
నిప్పుతో ఆటలొద్దు.. బీజేపీ: లింగాయత్ లు, వీరశైవుల రిజర్వేషన్ల వివాదానికి బీజేపీ సహా పలు హిందూ సామాజిక వర్గాలు మొదటినుంచీ దూరంగా ఉంటున్నాయి. అయితే.. సిద్దరామయ్య సర్కారు తీసుకున్న తాజానిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా విమర్శించింది. రాజకీయ అవసరాలకోసం సిద్దరామయ్య ప్రభు త్వం కులాలు, మతాలను విభజిస్తోందని మం డిపడింది. ఓటుబ్యాంకు రాజకీయాలకోసం సిద్దరామయ్య నిప్పుతో ఆడుతున్నారని కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధర్ రావు విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు.. విభజించు–పాలించు అన్న బ్రిటిషర్ల విధానాన్నే కాంగ్రెస్ అమలుచేస్తోందన్నారు. ‘వీరశైవులు, లింగాయత్‌లు ఒక్కటే. ఈ రెండు సామాజిక వర్గాలూ హిందుత్వంలో భాగమే. రాజకీయ లాభం కోసం వీరిని విడగొడుతున్నారు’ అని కర్ణాటక బీజేపీ సీఎం అభ్యర్థి య డ్యూరప్ప మండిపడ్డారు. కాంగ్రెస్ ఆడుతున్న నాటకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
చాలాకాలంగా డిమాండ్
లింగాయత్‌లు చాలాకాలంగా ప్రత్యేక మతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా ఇవ్వాలన్న అంశం చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉంది. ఇలాంటి కీలకమైన అంశాన్ని.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో లేవనెత్తడం కాంగ్రెస్‌కు మేలు చేస్తుందని భావిస్తున్నారు. యడ్యూరప్ప కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవారే. దీంతో ఆయన్ను, బీజేపీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ ఉన్నపళంగా ప్రత్యేక మతం పేరుతో మైనారిటీ అంశాలను తెరపైకి తెచ్చింది.
17 శాతం లింగాయత్‌ల ఓట్లకోసం..
అఖిల భారత వీరశైవ మహాసభ.. లింగాయత్‌లు, వీరశైవులు ఒక్కటేనని అందరికీ ప్రత్యేక మత హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా.. మరో గ్రూపు కేవలం లింగాయత్‌లకు మాత్రమే ఈ హోదాను ఇవ్వాలని పట్టుబడుతోంది. కొందరు లింగాయత్‌లు ఓ అడుగు ముందుకేసి.. వీరశైవులను తమలో కలుపు కునేందుకు సిద్ధమేనని.. అయితే వీరశైవులంతా లింగాయత్‌లేనని చెప్పుకోవాలనే షరతుపెట్టారు. దీనిపై కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనికితోడు ఎన్నికలు సమీపిస్తుండటంతో 17 శాతం ఉన్న వీరశైవులు, లింగాయత్‌ల ఓట్ల కోసం సిద్దరామయ్య సర్కారు.. హైకోర్టు రిటైర్డ్ జడ్జి హెచ్‌ఎన్ నాగమోహన్‌దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ మార్చి 2న తన నివేదికను అందజేసింది. ‘కర్ణాటకలోని లింగాయత్, వీరశైవ లింగాయత్‌లకు మతపరమైన మైనారిటీ హోదా ఇవ్వవచ్చు’ అని ఈ కమిటీ సూచించింది.
లింగాయత్ X వీరశైవం!
కర్ణాటక రాష్ట్రంలో అన్ని రంగాల్లో ముందుండే లింగాయత్‌లు చాలాకాలంగా మతపరమైన మైనారిటీ హోదా కోసం పోరాడుతున్నారు. లింగాయత్‌లు రెండు వర్గాలు. ఇందులో ఒకరు లింగాయత్‌లు, రెండోవారు వీరశైవ లింగాయత్‌లు. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు (బసవణ్ణ) లింగాయత్ సిద్ధాంతాన్ని ఏర్పాటుచేశారు. ‘అనుభవ మంటపం’ అనే వేదికను ఏర్పాటుచేసి అందరినీ ఆదరించారు. విగ్రహారాధన లేకుండా.. నిరాకారుడైన శివుడినే పూజించాలని ప్రబోధించారు. అందరూ ఇష్టలింగం పేరుతో లింగాన్ని మెడలో వేసుకోవాలని, చేసే పని ద్వారానే దైవాన్ని చేరతామని (కాయకేవ కైలాస) ప్రబోధించాడు. ఆయన తర్వాత తరతరాలుగా పలువురు గురువులు మఠాలను స్థాపించి బసవణ్ణ సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఈ మఠాలు విద్యాసంస్థలతో బాటు, అనేక సంస్థలు నిర్వహిస్తూ ఆర్థికంగా, సామాజికంగా బలంగా వున్నాయి. గతంలోనే కర్ణాటక ప్రభుత్వం లింగాయత్‌లు, వీరశైవులను (గతంలో వీరంతా ఒకటేననే భావన ఉండేది) 5% రిజర్వేషన్‌తో బీసీ 3–బి కేటగిరీలో చేర్చారు. ప్రస్తుతం వీరంతా హిందువులుగానే పరిగణించబడుతున్నారు.
ఇతర మైనారిటీల్లాగే..: లింగాయత్‌లు తాము హిందువులం కాదని.. బౌద్ధులు, జైనులు, సిక్కుల్లాగా తామూ గురువులనే అనుసరిస్తామనీ, కాబట్టి తమను కూడా వారిలాగే మైనారిటీలుగా గుర్తించాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. లింగాయతులు, తాము ఒకటే సమూహమని వీరశైవులంటున్నారు. వీరశైవులు తమను లింగాయత్‌లుగా చెప్పుకోవడం కొందరు లింగాయత్‌లకు నచ్చటం లేదు. నిజానికి వీరశైవం బసవణ్ణ కంటె ముందు నుంచే అస్తిత్వంలో వుంది. హిందూమతంలోని ఓ శాఖే వీరశైవం అంటారు. అయితే శివుణ్ని తప్ప విష్ణువుని కొలవరు వాళ్లు. శివుడికి బలులిస్తారు. వైదికకర్మలను, ఆగమ శాస్త్రాన్ని ఆచరిస్తారు.
లింగాయతులు వీటికి వ్యతిరేకం. దీంతో వివిధ లింగాయత్ వర్గాలు తమను వీరశైవుల్లో కలిపి లెక్క వేయవద్దని, తమకు మైనారిటీ హోదా యిచ్చి తీరాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించాయి. కర్ణాటకలో లింగాయత్‌లు రాజకీయంగా కూడా కీలక స్థానాలు అలంకరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక 15 ఏళ్లపాటు లింగాయతులే ముఖ్యమంత్రులుగా వున్నారు (నిజలింగప్ప, బిడి జత్తి, ఎస్‌ఆర్ కాంతి, వీరేంద్ర పాటిల్). ఆ తర్వాత కూడా లింగాయత్ వర్గానికి చెందిన ఎస్‌ఆర్ బొమ్మయ్, జెహెచ్ పాటిల్, యడ్యూరప్ప సీఎంలయ్యారు. కన్నడనాట వీరి జనాభా 17 శాతం. దాదాపు 100 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించగలిగే స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment