సీఎం సిద్ధరామయ్య
తమను ఎస్సీ, ఎస్టీ లేదా బీసీలుగా గుర్తించాలని దేశవ్యాప్తంగా వివిధ కులాల నుంచి బలంగా డిమాండ్లు వినబడుతున్న తరుణంలో కర్ణాటక మంత్రివర్గం లింగాయత్ సామాజిక వర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ సోమవారం చేసిన తీర్మానం సహజంగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. దానిపై అనుకూల, వ్యతిరేక వాదనలు మొదలయ్యాయి. బసవణ్ణ సిద్ధాంతాలను అనుసరించే వీరశైవుల్ని కూడా మైనారిటీ మతంగా గుర్తించాలని కేబినెట్ తీర్మానించింది.
కర్ణాటక కేబినెట్‌ది తుది నిర్ణయమేమీ కాదు. ఆ ప్రతిపాదన కేంద్ర హోంశాఖకు చేరుతుంది. ఆ ప్రతిపాదన జనాభా గణన వ్యవహారాలను చూసే రిజిస్ట్రార్ జనరల్‌కు వెళ్తుంది. తాజా నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది గనుక సహజంగానే ఆ తర్వాత అది మూలనబడుతుంది. ఇదంతా ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తెలియక కాదు. కానీ బంతిని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి నెట్టి తాను చేయగలిగిందంతా చేసినట్టు చూపించాలి. బీజేపీకి పెట్టని కోటగా ఉంటున్న లింగాయత్‌లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలి.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొందాలి. ఇదీ ఆయన వ్యూహం. అయిదేళ్ల క్రితం బీజేపీపై అలిగి సొంతంగా పార్టీ పెట్టుకున్న సమ యంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా వీరశైవ లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే అది అసాధ్యమని యూపీఏ ప్రభుత్వం ప్రత్యుత్తరమిచ్చింది. యడ్యూరప్ప తిరిగి బీజేపీలోకి ప్రవేశించాక దాని ఊసెత్తలేదు. తాజా నిర్ణయం ఆయన్ను రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టింది.
ప్రస్తుతం ఆ వర్గానికి ఆయన తిరుగులేని నేత. నిజానికి లింగాయత్‌లను ప్రత్యేక మతవర్గంగా గుర్తించడంపై కాంగ్రెస్‌లోనే విభేదాలు న్నాయి. ఈ నెల 8న జరిగిన కేబినెట్ తొలిసారి దీన్ని చర్చించినప్పుడు లింగా యత్‌లకు ప్రాతినిధ్యంవహించే మంత్రులు, వీరశైవ వర్గానికి చెందిన మంత్రులు కత్తులు దూసుకున్నారు. ఈ రాజకీయపుటెత్తుల సంగతలా ఉంచితే తమను ప్రత్యేక మతవర్గంగా గుర్తించాలన్న లింగాయత్‌ల డిమాండు ఈనాటిది కాదు. స్వాతంత్య్రం రావడానికి ముందే 1942లో ఈ డిమాండు మొదలైంది. 1871 మైసూర్ జనాభా లెక్కల్లో లింగాయత్‌లను ప్రత్యేక మతంగా గుర్తించినట్టు దాఖలాలున్నాయి. అయితే ఆ తర్వాత 1881లో జరిగిన జనగణనలో వారిని హిందూ మతంలో ఒక కులంగా వర్గీకరించారు.
ఈ మార్పునకు కారణమేమిటో అందులో నమోదు చేయలేదు. వాస్తవానికి చాన్నాళ్లనుంచి ఆ డిమాండును భుజాన వేసుకుని, దానికోసం కృషి చేసిన వ్యక్తులు ఇద్దరున్నారు. వారిలో ప్రముఖ సాహితీవేత్త, హంపీ విశ్వవిద్యా లయ మాజీ వైస్ చాన్సలర్ కల్‌బుర్గీ ఒకరు కాగా, మరొకరు మాజీ ఐఏఎస్ అధికారి ఎస్‌ఎం జాందార్. కల్‌బుర్గీని గుర్తు తెలియని దుండగులు మూడేళ్లక్రితం కాల్చిచంపారు. లింగాయత్‌లది ప్రత్యేక మతమని, వారిని అలా గుర్తించడమే సరైందని కల్‌బుర్గీ గట్టిగా వాదించేవారు. అదే సమయంలో లింగాయత్ సిద్ధాం తాన్ని ప్రతిపాదించిన సంఘ సంస్కర్త బసవేశ్వరుడి బోధనలను లింగాయత్ మఠాలు సరిగా పట్టించుకోవడం లేదని విమర్శించేవారు. మాజీ ఐఏఎస్ అధికారి జాందార్ చేసిన కృషి కూడా తక్కువేమీ కాదు. లింగాయత్‌లు ప్రత్యేక మతవర్గమని రుజువు చేసేందుకు తగిన ఆధారాలను ఆయన ఎంతో శ్రమకోర్చి సేకరించారు. 2011లో జనగణన జరిగిన సందర్భంలో లింగాయత్‌లెవరూ హిందువులుగా నమోదు చేసుకోవద్దంటూ లింగాయత్ మఠాలనుంచి ప్రకటనలొచ్చాయి.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిరుడు ఈ డిమాండు ఊపందుకుంది. బీదర్, బెళగావి, లాతూర్, కలబురగి తదితర ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. వీటన్నిటికీ హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది లింగాయత్‌లు హాజరయ్యారు. గత ఏడాది డిసెంబర్‌లో బెంగళూరులో జాతీయ సదస్సు జరిపారు. ఆ సదస్సు తర్వాతే లింగాయత్‌ల డిమాండు పరిశీలించడం కోసం రిటైర్డ్ జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీని ఏర్పాటు చేశారు.
లింగాయత్ సిద్ధాంతానికి మూల కారకుడైన బసవేశ్వరుడు సంఘ సంస్కర్త. 12వ శతాబ్దిలో తన బోధనలతో ప్రస్తుతం కర్ణాటకగా ఉన్న ప్రాంతాన్ని మాత్రమే కాదు... దక్షిణాదినంతటినీ తీవ్రంగా ప్రభావితం చేశాడు. పల్నాడు, గురజాల రాజ్యాల్లో కీలకపాత్ర పోషించిన బ్రహ్మనాయుడు ‘చాపకూడు’ సిద్ధాంతం వెనక బసవేశ్వరుడి ప్రభావమే ఉంది. సమాజంపై కులమతాల పట్టు బలంగా ఉన్నప్పుడూ, ఆచారాలు సంప్రదాయాల పేరిట అసమానతలు రాజ్యమేలుతున్న ప్పుడు బసవేశ్వరుడు వాటికి వ్యతిరేకంగా పోరాడాడు. సమూహాలను కూడ గట్టాడు. కుల వ్యవస్థను, వైదిక ఆచారాలను వ్యతిరేకించాడు. విగ్రహారాధాన సరైందికాదన్నాడు. ఆయన సిద్ధాంతాల ప్రచారం కోసం ఎన్నో మఠాలు వెలిశాయి. అయితే వైదిక ఆచారాలను పాటించే వీరశైవులు, లింగాయత్‌లు ఒకటేనన్నది యడ్యూరప్ప వంటివారి వాదన. వీరశైవుల్ని, లింగాయత్‌లనూ ఒకటిగా పరిగణించి ఆ వర్గాన్ని మైనారిటీ మతంగా గుర్తించాలని వీరశైవ మహాసభ కోరుతోంది.
కర్ణాటకలో లింగాయత్‌లు, వీరశైవుల ప్రభావం చాలా బలమైనది. 224మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రతి నలుగురు ఎమ్మెల్యేల్లో ఒకరు లింగాయత్ లేదా వీరశైవ వర్గానికి చెందినవారు. రాష్ట్ర జనాభాలో 17 శాతంగా ఉండే లింగాయత్‌లు ఉత్తర కర్ణాటక ప్రాంతంలో అధికం. ఆ వర్గం దాదాపు వంద నియోజకవర్గాల్లో పార్టీల గెలుపోటముల్ని నిర్ణయించే స్థితిలో ఉంది. బసవణ్ణ మఠాల ఆధ్వర్యంలో కర్ణాటకలో పలుచోట విద్యాసంస్థలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు వీరశైవ మహాసభ ఏం నిర్ణయిస్తే దానికి తాను కట్టుబడి ఉంటానని బీజేపీ నేత యడ్యూరప్ప చెబు తున్నారు. మొత్తానికి సిద్దరామయ్య కదిపిన తేనెతుట్టె కర్ణాటక రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది బీజేపీని ఎంతవరకూ ఇరకాటంలోకి నెడుతుందో, కాంగ్రెస్‌కు ఏమేరకు లాభిస్తుందో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment