కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు : లింగాయత్ ప్రత్యేక మతం అంశం రోజురోజుకు ప్రభుత్వానికి కొరకరాని కొయ్మగా మారుతోంది. లింగాయత్‌ను ప్రత్యేక మతంగా గుర్తించాలని వద్దని కొంతమంది మంత్రులు, స్వామీజీలు రెండు వర్గాలుగా విడిపోవడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డోలాయమానంలో పడిపోయారు. లింగాయత్‌లకు ప్రత్యేక మతానికి సంబంధించి నాగమోహన్‌దాస్ నివేదికను అమలుచేయాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతామని బాగల్‌కోటెలోని విరక్తి మఠాధీశుడు చంద్రశేఖర శివాచార్య స్వామీజీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రత్యేక లింగాయత్ మతం రాజుకుంటోంది. ఇక లింగాయత్ వర్గానికి చెందిన స్వామీజీలే రెండు వర్గాలు విడిపోవడం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. నాగమోహన్‌దాస్ రెండు నెలల్లోనే నివేదికలు అందిచడం చూస్తుంటే వాటిలో ఏముందో స్పష్టమవుతోందంటూ జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి సర్కారును విమర్శించారు.
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా లింగాయత్ ప్రత్యేక అంశానికి అనుకూలంగా మంత్రులు ఎం.బీ.పాటిల్,శరణప్రకాశ్ పాటిల్,వినయ్ కులకర్ణి, బసవరాజరాయరెడ్డిలు, వ్యతిరేకంగా మల్లికార్జున, ఈశ్వరఖండ్రెలు తీవ్రంగా గొంతెత్తినట్లు సమాచారం. రాష్ట్రంలోని ప్రముఖ వీరశైవ, లింగాయత్ మఠాధిపతులదీ ఇదే తీరు. అందరూ కయ్యానికి సిద్ధమనడంతో ముఖ్యమంత్రి ఆచితూచి అడుగులేస్తున్నారు. అందులో భాగంగా లింగాయత్ ప్రత్యేక అంశంపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా,ప్రకటనలు కూడా చేయకుండా సీఎం సిద్దరామయ్య జాగ్రత్తలు వహిస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇదే అంశంపై రెండు వర్గాలుగా విడిపోయిన మంత్రులు రాజీనామాలు చేస్తామంటూ హెచ్చరికలు చేయడంతో అందరితో కలసి చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామంటూ పరిస్థితి నుంచి బయటపడ్డట్లు సమాచారం. మంత్రుల ఆగ్రహం నేపథ్యంలోనే బుధవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశాన్ని సీఎం సిద్ధరామయ్య వచ్చే సోమవారానికి వాయిదా వేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment