benguloore
-
విపక్షాల భేటీ.. 17, 18 తేదీల్లో...?
న్యూఢిల్లీ: దేశంలో అధికార బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రతిపక్ష నేతలు జూన్ 23న బిహార్ రాజధాని పాటా్నలో సమావేశమైన సంగతి తెలిసిందే. తదుపరి భేటీ ఈ నెల 17, 18న కర్ణాటక రాజధాని బెంగళూరులో జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సోమవారం ట్వీట్ చేశారు. ఫాసిస్ట్, అప్రజాస్వామిక శక్తులను ఓడించాలన్నదే ధ్యేయమని, అందుకోసమే ప్రతిపక్షాలు చేతులు కలుపుతున్నాయని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలన్నదే విపక్ష కూటమి సంకల్పమని వివరించారు. వాస్తవానికి విపక్షాల సమావేశాన్ని ఈ నెల 13, 14న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ఆ సమయంలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో తమ భేటీని 17, 18వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించారు. -
Karnataka assembly elections 2023:ఎవరిదో రాజధాని!
రాష్ట్రాన్ని గెలవాలంటే ముందు రాజధానిని గెలవాలి. కర్ణాటకలో అధికారిక పీఠానికి తాళాలు బెంగళూరులోనే ఉన్నాయి. బీజేపీకీ, కాంగ్రెస్‌కూ ఈ విషయం బాగా తెలుసు. దాంతో ఈసారి అధికార విపక్షాల మధ్య సిలికాన్ సిటీలో సంకుల సమరం సాగుతోంది. సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీయే కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని గడచిన పలు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే తెలుస్తోంది. అందుకే బెంగళూరు పరిధిలోని 28 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలు నెగ్గి అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తీరు తెన్నులు.. ► 2008లో బెంగళూరులో బీజేపీ 17, కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు గెలవగా జేడీ(ఎస్) ఒక్క స్థానానికి పరిమితమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి దక్షిణ భారతంలో తొలిసారి ఆ ఘనత సాధించింది. ► 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీజేపీ 12, జేడీ(ఎస్) 3 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య తొలిసారి సీఎం అయ్యారు. ► 2018లో కాంగ్రెస్15, బీజేపీ 11, జేడీ(ఎస్) 2 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ సర్కారు బలపరీక్షలో ఓడి 14 నెలలకే కుప్పకూలింది. ► 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్) సభ్యులు బీజేపీకి ఫిరాయించడంతో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. బీజేపీ ఏకంగా 12 సీట్లు నెగ్గింది. అలా బెంగళూరులో బీజేపీ బలం 15కు పెరగగా కాంగ్రెస్ 11 స్థానాలకు పడిపోయింది. బీజేపీ అధికారాన్ని స్థిరపరచుకుంది. వేధిస్తున్న తక్కువ ఓటింగ్ బెంగళూరులో ప్రతిసారీ తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండడం పరిపాటిగా వస్తోంది. 2013, 2018 ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పడిపోయింది. సగానికి సగం, అంటే నియోజకవర్గాల్లో మరీ తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. బెంగళూరు వాసులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపరన్న అపప్రథా ఉంది. దీన్ని ఈసారైనా తొలగించుకుంటారా అన్నది చూడాలి. ► 2013 ఎన్నికల్లో బెంగళూరు పరిధిలో కేవలం 55.04% ఓటింగ్ నమోదైంది. 2018లో అది కాస్తా 48.03 శాతానికి తగ్గింది. ► దాంతో ఈసారి ఎలాగైనా రాజధానిలో ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ఎన్నికల సంఘం ప్రధానంగా దృష్టి పెట్టింది. కొద్ది రోజులుగా ప్రత్యేక ర్యాలీలు, వాకథాన్‌లు, ప్రచారాలు చేపడుతోంది. తటస్థ ఓటర్లే కీలకం ► ట్రాఫిక్ సమస్య, మౌలిక వసతుల లేమి వంటి పలు సమస్యలు బెంగళూరును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారన్నది నగరవాసుల ప్రధాన ఆరోపణ. ► ఇక్కడ 15 నుంచి 20 శాతం ఓటర్లు కులమతాలకు అతీతంగా తటస్థంగా ఉంటారు. ► వీరిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ► బీజేపీ అవినీతి, పాలన వైఫల్యాలు, కుంభకోణాలను ప్రచారం చేస్తూ నగర వాసులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. శాంతినగర, సర్వజ్ఞ నగర వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది. ► ఇక తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారానికి దిగారు. ► కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో నగరంలో బీజేపీ బలంగా కనిపిస్తోంది. -
చిన్నమ్మకు కోర్టులో ఎదురుదెబ్బ
సాక్షి, చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. తనను జైలు నుంచి ముందస్తుగా విడుదల చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె నాలుగేళ్ల శిక్షాకాలం పూర్తి చేసుకుని 2021 జనవరి చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె.జయలలిత సహాయకురాలు శశికళ నటరాజన్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తమిళనాడు చిన్నమ్మగా సుపరిచితరాలు. మంచి ప్రవర్తనను చూపుతూ ఆమె బెంగళూరు జైలు నుంచి ముందస్తు విడుదల కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ, కోర్టు పిటిషన్‌ను తిరస్కరించటంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముందస్తు విడుదలకు కోర్టు అంగీకరిస్తుందనే ఆశతో.. రూ.10 కోట్ల జరిమానాను చిన్నమ్మ వర్గీయులు కోర్టుకు డిపాజిట్ చేసినట్లు సమాచారం. -
నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌కు కరోనా?
ప్రముఖ నిర్మాత, నటుడు ‘రాక్‌లైన్’ వెంకటేశ్ శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. ఆయన కుమారుడు అభిలాష్ డాక్టర్ కావడంతో అతని హాస్పటల్లోనే చికిత్స జరుగుతోందని సమాచారం. సుమలత, అంబరీష్‌ల ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు వెంకటేశ్. గతవారం అంబరీష్ మెమోరియల్‌ను నిర్మించటం కోసం సుమలతతో కలిసి కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పని కలిశారు వెంకటేశ్. ఆ తర్వాత సుమలత తనకు కరోనా పాజిటివ్ అని ఎనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో రాక్‌లైన్ వెంకటేశ్‌కి కూడా కరోనా సోకి ఉంటుందనే వార్త వినిపిస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించినవాటిలో రజనీకాంత్ ‘లింగా’, సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయ్‌జాన్’ చిత్రాలు ఉన్నాయి. -
కొంగు విడువనులే...
పెళ్లిరోజున వధూవరుల పెళ్లి వస్త్రాలు ముడేస్తారు... జీవితాంతం కలిసుండాలని. భర్తను కొంగున కట్టేసుకోవాలనుకుంటారు కొందరు భార్యలు. రణ్వీర్ సింగ్ అయితే ‘నీ కొంగు విడవనులే’ అని భార్య దీపికా పదుకోన్‌కి హామీ ఇచ్చారు. దీప్‌వీర్ పెళ్లి రిసెప్షన్ బుధవారం బెంగళూర్‌లో జరిగింది. ఈ సందర్భంగా బయటికొచ్చిన ఫొటోల్లో కింద ఉన్న ఫొటో ఓ హైలైట్. మీడియాని ఉద్దేశించి ‘‘ఎల్లరికీ నమస్కార, ఎల్లా చనాయ్గా ఇద్దరా’ (అందరికీ నమస్కారం, అందరూ బాగున్నారా) అని దీపికా కన్నడంలో మాట్లాడితే, ‘‘ఖానా కా కే జానా’ (భోజనం చేసి వెళ్లండి) అని రణ్వీర్ హిందీలో అన్నారు. ఈ వేడుకలో పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు పాల్గొన్నారు. -
బెంగళూరులోనే ఏరో షో
సాక్షి బెంగళూరు: ఆసియాలోనే అతిపెద్దదైన ఏరో ఇండియా షో బెంగళూరులోనే జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఉన్నతాధికారులతో సమావేశమైన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ షో వేదికను మార్చొద్దని నిర్ణయించారు. దీంతో ఫిబ్రవరి 20 నుంచి 24వరకు బెంగళూరులో ఏరో షో జరగనుంది. ఈ షోను లక్నోలో నిర్వహించాలంటూ గత నెల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్రానికి విజ్ఞప్తి చేయడంపై వివాదమవడం తెల్సిందే. గుజరాత్, రాజస్తాన్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచీ అందిన ఇలాంటి విజ్ఞాపనలను పరిశీలిస్తున్నట్లు రక్షణశాఖ తెలిపింది. వైమానిక ప్రదర్శనను బెంగళూరులోనే నిర్వహించాలని కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు ఇదే వాదన వినిపించారు.ఈ నేపథ్యంలోనే రక్షణ శాఖ ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టతనిచ్చింది. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని బెంగళూరులోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక సీఎం కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. కాగా, 1996 నుంచి రెండేళ్లకోసారి బెంగళూరులో జరుగుతున్న ఈ విమానాల పండుగలో ప్రపంచం నలుమూలల నుంచి ప్రసిద్ధ వైమానిక సంస్థలు పాల్గొంటాయి. -
‘బెంగళూరు’ తీర్పే కీలకం!
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కన్నడ అసెంబ్లీ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. అధికారం కోసం నువ్వా–నేనా అనే రీతిలో అధికార విపక్షాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అంశాలు, వివిధ వ్యూహాలతో ప్రచారం చేస్తున్న పార్టీలకు రాజధాని బెంగళూరుపై పట్టు చాలా కీలకం. అందుకే ఉద్యాన నగరిపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఐటీ హబ్, మెట్రోపాలిటన్ సిటీ కావడంతో ఇక్కడి ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల్లో నగర ఓటర్లు ఏ పార్టీకి అండగా నిలవబోతున్నారు? వీరి ఆకాంక్షలు, అవసరాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏ మేరకు తీర్చగలిగాయి? ప్రజల అభిప్రాయాల ఆధారంగా ‘సాక్షి’ అందిస్తున్న కథనం. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఒక్క బెంగళూరు సిటీలోనే 28 స్థానాలున్నాయి. వీటితోపాటు 4 బెంగళూరు రూరల్ నియోజకవర్గాలు కూడా సిటీ పరిధిలోకే వస్తాయి. దీంతో ఈ 32 స్థానాల్లో ఓటరు తీర్పుపై చర్చ జరుగుతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో 13, రూరల్‌లో 2 సీట్లు కలిపి 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా.. బీజేపీ సిటీలో 12 స్థానాలు కైవసం చేసుకుంది. జేడీఎస్ సిటీలో 3, రూరల్‌లో 2 స్థానాలు దక్కించుకుంది. అయితే తర్వాత జరిగిన బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో (198 వార్డుల్లో) బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. జేడీఎస్, స్వతంత్రుల సాయంతో కాంగ్రెస్ మేయర్ సీటు కైవసం చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల తర్వాత బెంగళూరును న్యూయార్క్, లండన్ తరహాలో అభివృద్ధి చేసి ప్రపంచఖ్యాతి కల్పిస్తానని సిద్దరామయ్య ప్రకటించారు. కానీ ఈ దిశగా అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడుకూడా సిటీ పరిధిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. కనెక్టివిటీ లేని మెట్రో మెట్రోపాలిటన్ సిటీ అయిన బెంగళూరులో ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారుల సంఖ్య ఎక్కువ. వీరు మౌలిక వసతుల కల్పన, మహిళల భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, కాలుష్యం వంటి ప్రధానాంశాలపై ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య బెంగళూరును ఇప్పటికీ పట్టిపీడిస్తోంది. మెట్రోరైలు ఏర్పాటు చేసినప్పటికీ సిటీ మొత్తం కనెక్టివిటీ లేకపోవడంతో సిటీ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరలేదు. అలాగే ఐటీ ఉద్యోగులు అర్ధరాత్రి వరకూ విధుల్లో ఉండటంతో మహిళా భద్రత అంశాన్ని నగర ప్రజలు ప్రధానంగా భావిస్తున్నారు. బెంగళూరు సిటీ పరిధిలో 2013లో 70.4లక్షల ఓటర్లున్నారు. ఐదేళ్లలో 17.5 లక్షల మంది ఓటర్లు పెరిగి ప్రస్తుతం ఆ సంఖ్య 89.9 లక్షలకు చేరింది. పెరిగిన ఓటర్లలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధికోసం బెంగళూరుకు వచ్చి స్థిరపడినవారే. వీరిలో ఎక్కువ మంది మధ్యతరగతి వారే. సిద్దరామయ్య ఏర్పాటుచేసిన ఇందిరా క్యాంటీన్లపై వీరు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. మిగిలిన అంశాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆరెస్సెస్ ప్రచారం కలిసొచ్చేనా? 50వేల మంది ఆరెస్సెస్ కార్యకర్తలు బీజేపీ విజయం కోసం క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సిటీ పరిధిలో ఉన్నారు. సిటీలో బీజేపీ బలంగా ఉండటంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ప్రచారం కచ్చితంగా ప్రభావం ఉంటుందని ఆపార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సిటీలో ముఖ్యమైన వర్గాలివే బెంగళూరు సిటీలో బ్రాహ్మణులు, లింగాయత్, మైనార్టీ, దళిత వర్గాలతో పాటు తెలుగు, తమిళ ఓటర్లు కూడా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. యడ్యూరప్ప లింగాయత్ కావడంతో బ్రాహ్మణులు, లింగాయత్ ఓటర్లు బీజేపీపై సానుకూలంగా ఉన్నారు. మైనార్టీ, దళిత వర్గాలు కాంగ్రెస్‌వైపు ఉన్నారు. 2008 ఎన్నికల్లో క్రిస్టియన్లు బీజేపీ వైపు నిలిచినప్పటికీ.. మంగళూరు చర్చిదాడి ఘటనతో పూర్తిగా దూరమయ్యారు. వీరంతా బృందాలుగా ఏర్పడి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 391 మందిపై క్రిమినల్ కేసులు కర్ణాటకలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,560 మంది అభ్యర్థుల్లో 391 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. హత్య, హత్యాయత్నం, మహిళలపై వేధింపులు, అపహరణ తదితర తీవ్ర అభియోగాలు ఉన్నాయి. కళంకితులను పోటీకి దింపడంలో బీజేపీ ముందువరుసలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థుల్లో 83 మంది (37%)పై నేరారోపణలు ఉన్నాయి. అలాగే 93% మంది బీజేపీ అభ్యర్థులు కోటీశ్వరులే. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 27% మందిపై క్రిమినల్ కేసులుండగా 15% మంది కోటీశ్వరులు. జేడీఎస్‌లో 21% మందిపై కేసులున్నాయి. -
‘సన్నీ లియోన్’ షోకు అనుమతి ఇవ్వం
బెంగళూరు: బెంగళూరులో డిసెంబర్ 31న జరిగే కొత్త ఏడాది వేడుకల్లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పాల్గొననున్న ఓ కార్యక్రమానికి అనుమతి ఇవ్వరాదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక రక్షణ వేదికే(కేఆర్వీ)తో పాటు పలు కన్నడ సంఘాలు సన్నీ వేడుకపై ఆందోళనల∙నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు స్పందించింది. ‘అలాంటి కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వవద్దని నేను అధికారుల్ని ఆదేశించాను. కన్నడ సంస్కృతి, సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలను ఈవెంట్ నిర్వాహకులు చేపట్టాలి’ అని రాష్ట్ర హోంమంత్రి రామలింగా రెడ్డి వ్యాఖ్యానించారు. -
ముంబై, మంగళూరులకు ముప్పు!
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: నానాటికీ కరిగిపోతున్న మంచు పలకల వల్ల తీరప్రాంత నగరాలైన ముంబై, మంగళూరుకు పెను ముప్పు పొంచి ఉందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా హెచ్చరించింది. సముద్ర తీరాలు కుచించుకుపోవడం వల్ల భూమ్యాకర్షణ, భ్రమణ శక్తులు ప్రభావితమవుతాయని, సముద్ర మట్టాల పెరుగుదలల్లో అసాధారణ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. ఇదే ధోరణి కొనసాగితే వచ్చే 100 ఏళ్లలో మంగళూరు సముద్ర మట్టం 15.98 సెం.మీ., ముంబైలో అయితే 15.26 సెం.మీ.లు పెరుగుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ తీరానికి(15.16 సెం.మీ.) ఇదే తరహా ముప్పు ఉందని అంచనా వేసింది. భూతాపంతో తీర ప్రాంతాల్లోని నగరాల పరిస్థితి ఏమిటన్న విషయంపై నాసా పరిశోధనలు ప్రారంభించింది. శాస్త్రవేత్తలు ‘గ్రేడియంట్ ఫింగర్ ప్రింట్ మ్యాపింగ్’ అనే పరికరాన్ని రూపొందించారు. మంచు పర్వతాలు ఏ మేరకు కరుగుతున్నాయి? తద్వారా ఏయే దేశాల్లో ఎంత మేరకు సముద్ర మట్టం పెరుగుతోంది? అనే విషయాలను గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా 293 తీర ప్రాంత నగరాలపై ఈ అధ్యయనం జరిపారు. ‘ రాబోయే 100 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని వరదల ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలు రూపొందించాలి’ అని నాసా శాస్త్రవేత్త ఎరిక్ ఇవిన్స్ అభిప్రాయపడ్డారు. అక్కడా మంచు కరుగుతోంది... ఇటీవలి కాలంలో గ్రీన్‌ల్యాండ్, అంటార్కిటికాల్లో మంచు చాలా వేగంగా కరగడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే 2100 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సముద్రమట్టం 0.51 నుండి 1.31 మీటర్ల మేర పెరగనుందని జీఎఫ్ఎం తెలిపింది. అదే కనుక జరిగితే భారత్‌లో దాదాపు 14వేల చదరపు కిలోమీటర్ల మేర భూమి సముద్రంలో కలసిపోనుంది. అదే జరిగితే భారత్‌కు సంభవించే నష్టాన్ని అంచనా కూడా వేయలేమని నాసా గుదిగుచ్చింది. కాగా, మంగళూరు, ముంబైకి ముప్పుపై నాసా ఇచ్చిన నివేదికకు సంబంధించి అధికారిక సమాచారం తమ వద్ద లేదని ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ అన్నారు. -
మేకప్ చేయాలని బ్యూటీషియన్‌ను పిలిచి...
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలో బ్యుటీషియన్‌గా పనిచేస్తున్న కోల్‌కతాకు చెందిన ఓ యువతి (22)పై దారుణం జరిగింది. మేకప్ వేయాలని పిలిపించి ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. బాధితురాలు ఈ ఏడాది జనవరిలో బెంగళూరుకు వచ్చి ఓ బ్యూటీపార్లల్‌లో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈనెల 2న తమ ఇంట్లో ఓ యువతికి మేకప్ చేయాలంటూ ఆమె పనిచేస్తున్న బ్యూటీపార్లల్‌కు ఫోన్ వచ్చింది. దీంతో బ్యూటీపార్లల్ యజమాని ఆమెకు విషయాన్ని తెలిపి అడ్రస్ చెప్పారు. యజమాని చెప్పిన చోటికి ఆమె కాలినడకన వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన నితిన్‌శెట్టి, ధనుంజయ్, రజత్ అడ్డుకున్నారు. తాము మఫ్టీలో ఉన్న పోలీసులమని బెదిరించారు. 'నువ్వు వేశ్య వృత్తిలో ఉన్నావని' బెదిరిస్తూ విచారణ కోసమంటూ ఆ యువతిని కారులో బలవంతంగా ఎక్కించుకున్నారు. అనంతరం దగ్గర్లోని నిర్జన ప్రదేశంలోని గోదాములోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఉడాయించారు. మరుసటి రోజు ఉదయం యజమాని సాయంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నగరంలోనే వేర్వేరుచోట్ల తలదాచుకున్న ముగ్గురు యువకులను గురువారం అరెస్టు చేశారు.