బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కన్నడ అసెంబ్లీ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. అధికారం కోసం నువ్వా–నేనా అనే రీతిలో అధికార విపక్షాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అంశాలు, వివిధ వ్యూహాలతో ప్రచారం చేస్తున్న పార్టీలకు రాజధాని బెంగళూరుపై పట్టు చాలా కీలకం. అందుకే ఉద్యాన నగరిపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఐటీ హబ్, మెట్రోపాలిటన్ సిటీ కావడంతో ఇక్కడి ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఎన్నికల్లో నగర ఓటర్లు ఏ పార్టీకి అండగా నిలవబోతున్నారు? వీరి ఆకాంక్షలు, అవసరాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏ మేరకు తీర్చగలిగాయి? ప్రజల అభిప్రాయాల ఆధారంగా ‘సాక్షి’ అందిస్తున్న కథనం.
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
ఒక్క బెంగళూరు సిటీలోనే 28 స్థానాలున్నాయి. వీటితోపాటు 4 బెంగళూరు రూరల్ నియోజకవర్గాలు కూడా సిటీ పరిధిలోకే వస్తాయి. దీంతో ఈ 32 స్థానాల్లో ఓటరు తీర్పుపై చర్చ జరుగుతోంది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో 13, రూరల్‌లో 2 సీట్లు కలిపి 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా.. బీజేపీ సిటీలో 12 స్థానాలు కైవసం చేసుకుంది. జేడీఎస్ సిటీలో 3, రూరల్‌లో 2 స్థానాలు దక్కించుకుంది. అయితే తర్వాత జరిగిన బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో (198 వార్డుల్లో) బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. జేడీఎస్, స్వతంత్రుల సాయంతో కాంగ్రెస్ మేయర్ సీటు కైవసం చేసుకుంది. కార్పొరేషన్ ఎన్నికల తర్వాత బెంగళూరును న్యూయార్క్, లండన్ తరహాలో అభివృద్ధి చేసి ప్రపంచఖ్యాతి కల్పిస్తానని సిద్దరామయ్య ప్రకటించారు. కానీ ఈ దిశగా అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడుకూడా సిటీ పరిధిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది.
కనెక్టివిటీ లేని మెట్రో
మెట్రోపాలిటన్ సిటీ అయిన బెంగళూరులో ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారుల సంఖ్య ఎక్కువ. వీరు మౌలిక వసతుల కల్పన, మహిళల భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్, పారిశుద్ధ్యం, కాలుష్యం వంటి ప్రధానాంశాలపై ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య బెంగళూరును ఇప్పటికీ పట్టిపీడిస్తోంది. మెట్రోరైలు ఏర్పాటు చేసినప్పటికీ సిటీ మొత్తం కనెక్టివిటీ లేకపోవడంతో సిటీ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరలేదు. అలాగే ఐటీ ఉద్యోగులు అర్ధరాత్రి వరకూ విధుల్లో ఉండటంతో మహిళా భద్రత అంశాన్ని నగర ప్రజలు ప్రధానంగా భావిస్తున్నారు. బెంగళూరు సిటీ పరిధిలో 2013లో 70.4లక్షల ఓటర్లున్నారు. ఐదేళ్లలో 17.5 లక్షల మంది ఓటర్లు పెరిగి ప్రస్తుతం ఆ సంఖ్య 89.9 లక్షలకు చేరింది. పెరిగిన ఓటర్లలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధికోసం బెంగళూరుకు వచ్చి స్థిరపడినవారే. వీరిలో ఎక్కువ మంది మధ్యతరగతి వారే. సిద్దరామయ్య ఏర్పాటుచేసిన ఇందిరా క్యాంటీన్లపై వీరు సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. మిగిలిన అంశాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆరెస్సెస్ ప్రచారం కలిసొచ్చేనా?
50వేల మంది ఆరెస్సెస్ కార్యకర్తలు బీజేపీ విజయం కోసం క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సిటీ పరిధిలో ఉన్నారు. సిటీలో బీజేపీ బలంగా ఉండటంతో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల ప్రచారం కచ్చితంగా ప్రభావం ఉంటుందని ఆపార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సిటీలో ముఖ్యమైన వర్గాలివే
బెంగళూరు సిటీలో బ్రాహ్మణులు, లింగాయత్, మైనార్టీ, దళిత వర్గాలతో పాటు తెలుగు, తమిళ ఓటర్లు కూడా నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. యడ్యూరప్ప లింగాయత్ కావడంతో బ్రాహ్మణులు, లింగాయత్ ఓటర్లు బీజేపీపై సానుకూలంగా ఉన్నారు. మైనార్టీ, దళిత వర్గాలు కాంగ్రెస్‌వైపు ఉన్నారు. 2008 ఎన్నికల్లో క్రిస్టియన్లు బీజేపీ వైపు నిలిచినప్పటికీ.. మంగళూరు చర్చిదాడి ఘటనతో పూర్తిగా దూరమయ్యారు. వీరంతా బృందాలుగా ఏర్పడి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
391 మందిపై క్రిమినల్ కేసులు
కర్ణాటకలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న 2,560 మంది అభ్యర్థుల్లో 391 మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. హత్య, హత్యాయత్నం, మహిళలపై వేధింపులు, అపహరణ తదితర తీవ్ర అభియోగాలు ఉన్నాయి. కళంకితులను పోటీకి దింపడంలో బీజేపీ ముందువరుసలో ఉంది. ఆ పార్టీ అభ్యర్థుల్లో 83 మంది (37%)పై నేరారోపణలు ఉన్నాయి. అలాగే 93% మంది బీజేపీ అభ్యర్థులు కోటీశ్వరులే. కాంగ్రెస్ అభ్యర్థుల్లో 27% మందిపై క్రిమినల్ కేసులుండగా 15% మంది కోటీశ్వరులు. జేడీఎస్‌లో 21% మందిపై కేసులున్నాయి.
‘బెంగళూరు’ తీర్పే కీలకం!
Published Tue, May 8 2018 1:35 AM | Last Updated on Fri, Mar 29 2019 5:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment