సాక్షి బెంగళూరు: ఆసియాలోనే అతిపెద్దదైన ఏరో ఇండియా షో బెంగళూరులోనే జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ఉన్నతాధికారులతో సమావేశమైన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ షో వేదికను మార్చొద్దని నిర్ణయించారు. దీంతో ఫిబ్రవరి 20 నుంచి 24వరకు బెంగళూరులో ఏరో షో జరగనుంది. ఈ షోను లక్నోలో నిర్వహించాలంటూ గత నెల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్రానికి విజ్ఞప్తి చేయడంపై వివాదమవడం తెల్సిందే. గుజరాత్, రాజస్తాన్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచీ అందిన ఇలాంటి విజ్ఞాపనలను పరిశీలిస్తున్నట్లు రక్షణశాఖ తెలిపింది.
వైమానిక ప్రదర్శనను బెంగళూరులోనే నిర్వహించాలని కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులు ఇదే వాదన వినిపించారు.ఈ నేపథ్యంలోనే రక్షణ శాఖ ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టతనిచ్చింది. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని బెంగళూరులోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక సీఎం కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. కాగా, 1996 నుంచి రెండేళ్లకోసారి బెంగళూరులో జరుగుతున్న ఈ విమానాల పండుగలో ప్రపంచం నలుమూలల నుంచి ప్రసిద్ధ వైమానిక సంస్థలు పాల్గొంటాయి.
Comments
Please login to add a commentAdd a comment