
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. వారికి దిశానిర్దేశం చేశారు. కర్ణాటకలో ఓటర్లకు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ వారంటీ ఎప్పుడో ముగిసిపోయిందని, ఆ పార్టీ ఇచ్చే గ్యారంటీలకు అర్థంపర్థం లేదని ఎద్దేవా చేశారు. ఉచిత పథకాలపై మోదీ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రాలు దివాలా తీయడం ఖాయమని చెప్పారు. భవిష్యత్తు తరాలకు దక్కాల్సిన ప్రయోజనాలను ఈ ఉచిత పథకాలు మింగేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచితాల సంస్కృతికి తెరపడాలని మోదీ స్పష్టం చేశారు.
ప్రజల ఆశీస్సులు కోరుతా..
‘మన దేశంలో రాజకీయాలు అంటే అర్థం అధికారం, అవినీతిగా కొన్ని పార్టీలు మార్చేశాయి. అధికారం కోసం ఆయా పార్టీలు సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నాయి. దేశ భవిష్యత్తు గురించి, కర్ణాటకలోని యువత, మహిళల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు’అని మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు బీజేపీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, ఈ నమ్మకాన్ని వమ్ము కానివ్వబోమని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాల వల్ల దక్కే లాభాలను బూత్‌స్థాయిలో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేస్తానని చెప్పారు. ఒక కార్యకర్తగా కర్ణాటక ప్రజల వద్దకు వెళ్లి, వారి ఆశీస్సులు కోరుతానని వివరించారు.
‘ఫస్ట్ డెవలప్ ఇండియా’
షార్ట్‌కట్‌లను తాము నమ్ముకోవడం లేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆత్యాధునిక భౌతిక, డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు వెచ్చిస్తున్నామని గుర్తుచేశారు. ఎఫ్‌డీఐ అంటే తమకు ‘ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్’ కాదని, ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ అని వివరించారు. ఐదేళ్ల పాలనా కాలం గురించి యోచించడం లేదని, దేశం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ కాదు, దేశమే తమకు ముఖ్యమని చెప్పారు.