
‘ఇలాగైతే నేనే రాజీనామా చేస్తా’
బెంగళూర్ : కర్ణాటకలో రాజకీయం నిమిషానికో మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామాకు సిద్ధమయ్యారు. రాజీనామా లేఖను అసెంబ్లీలో చూపించారు. బలపరీక్షకు ముందే కుమారాస్వామి రాజీనామాను ప్రకటించనున్నారు. సంకీర్ణ సర్కార్ భవితవ్యం తేల్చే విశ్వాస పరీక్షకు డెడ్‌లైన్లు మారుతూనే ఉన్నాయి. బలపరీక్ష గడువు పెంచాలన్న జేడీఎస్-కాంగ్రెస్ నేతల అభ్యర్ధనను స్పీకర్ ఆర్ రమేష్ కుమార్ తోసిపుచ్చారు. సోమవారం రాత్రి 9 గంటల వరకూ బలపరీక్షకు సమయం ఇచ్చిన స్పీకర్ ఇక వాయిదాలకు ఆస్కారం లేదని సంకీర్ణ నేతలకు స్పష్టం చేశారు. బలపరీక్షను వాయిదా వేయాలని ఒత్తిడి పెంచితే తానే రాజీనామా చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. తాను చెప్పినట్టు బలపరీక్ష చేపట్టాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.
సుప్రీం కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున బలపరీక్షను రేపటికి వాయిదా వేయాలని కోరిన జేడీఎస్ వినతిని ఆయన అంగీకరించలేదు. బలపరీక్షపై గందరగోళంతో సభ వాయిదా పడటంతో విరామ సమయంలో స్పీకర్‌తో బీజేపీ సభ్యులు భేటీ అయ్యారు. ఎట్టిపరిస్థితుల్లో ఈరోజే బలపరీక్ష నిర్వహించాలని వారు పట్టుబట్టారు. బలపరీక్షకు తాను సిద్ధమని స్పీకర్ వారితో స్పష్టం చేశారు.