
సిద్దరామయ్యతో కుమారస్వామి చర్చలు
బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి మళ్లీ గుబులు మొదలైంది. విప్‌ను ధిక్కరించి 9 మంది కాంగ్రెస్ సభ్యులు బుధవారం అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. జనవరి 18న సీఎల్‌పీ సమావేశానికి గైర్హాజరైన నలుగురు ఇందులో ఉన్నారు. రిసార్ట్‌లో సహచర ఎమ్మెల్యేపై దాడిచేసి పరారైన జేఎన్ గణేశ్ ఈ 9 మందిలో ఉన్నారు. ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు జరిగే బడ్జెట్ సమావేశాలకు అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ నేత సిద్దరామయ్య తమ పార్టీ సభ్యులందరికీ విప్ జారీచేశారు.
కాంగ్రెస్–జేడీఎస్ సర్కారును అస్థిరపరచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో 9 మంది సభ్యులు సభకు రాకపోవడం సందేహాలకు తావిస్తోంది. అందులో నలుగురు సభ్యులు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే వారు సిద్దరామయ్య నోటీసులకు స్పందించలేదని తెలుస్తోంది. మరోవైపు, అసెంబ్లీ సమావేశాలు తీవ్ర గందరగోళం నడుమ ప్రారంభమయ్యాయి. సంకీర్ణం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ ప్రతిపక్ష బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న గవర్నర్ వాజూబాయ్ వాలా ప్రసంగానికి అంతరాయం కలిగించారు. దీంతో గవర్నర్ తన ప్రసంగంలో నేరుగా చివరి పేరా చదివి ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment