సాక్షి బెంగళూరు: ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేసిన బీఎస్ యడియూరప్ప అధికారంలో లేకున్నప్పటికీ తన ఇమేజ్‌ను, తన ప్రాభవాన్ని కాపాడుకునే పనిలో పడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును కొనసాగించేందుకు కొత్త ప్లాన్‌ను అమలు చేయనున్నారు. సీఎంగా రాజీనామా చేసినప్పటికీ మంత్రిమండలిలో తన అనుంగు అనుచరులను చేర్చేందుకు శ్రమిస్తున్నారు. అదే సమయంలో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేందుకు రాష్ట్ర పర్యటన చేపట్టాలని నిర్ణయించారు.
1983 నుంచి 2021 వరకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో విరామం ఎరుగకుండా శ్రమించిన యడియూరప్ప దక్షిణాదిన తొలిసారిగా కర్ణాటకలో బీజేపీ అధికారం చేపట్టడంలో ముఖ్యభూమిక పోషించారు. 78 ఏళ్ల యడ్డి జూలై 26న సీఎంగా రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకొని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 75 ఏళ్లు పైబడిన వారికి కీలక పదవులు ఇవ్వకూడదనే నియమాన్ని మోదీ హయాంలో పాటిస్తున్నప్పటికీ... యడియూరప్పకు మాత్రం మినహాయింపునిచ్చి రెండేళ్లు సీఎంగా కొనసాగడానికి అవకాశం ఇవ్వడం ఆయన బలాన్ని, అవసరాన్ని తెలియజేసింది.
ఇప్పటికీ యడ్డినే పవర్‌ఫుల్..
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై బాధ్యతలు చేపట్టినప్పటికీ యడియూరప్పనే పవర్ సెంటర్‌గా మారారు. పార్టీలో ఇప్పటికీ యడియూరప్ప తన పట్టును కొనసాగిస్తున్నారు. ఇదే పట్టు, బలాన్ని వచ్చే అసెంబ్లీ, లోకసభ ఎన్నికల వరకు కొనసాగించాలని తీర్మానించుకున్నారు. గవర్నగిరీ వద్దని, రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటానని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు.
తాలూకాల యాత్రకు ప్లాన్
పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించి తీరుతానని యడ్డి ఇటీవల చెప్పడం గమనార్హం. వారానికో తాలూకాకు వెళ్లిని పార్టీని బలోపేతం చేసి తద్వారా తనకు వయసు పైబడిన, అధికారం ఇవ్వకపోయినా రాజకీయంగా శక్తివంతుడినని హైకమాండ్‌కు తెలిసేలా చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసమే గవర్నర్ పదవిని సైతం యడియూరప్ప తిరస్కరించినట్లు సమాచారం. తన ఇద్దరు కుమారులు విజయేంద్ర (బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు), రాఘవేంద్రలను రాజకీయంగా మంచి స్థాయిలో నిలబెట్టాలంటే ప్రజల్లో తిరుగుతూ తిరిగి తన శక్తిని అధిష్టానానికి తెలియజేయాలని భావించినట్లు తెలిసింది. వారి రాజకీయ భవిష్యత్తుకు మంచి పునాది వేయడం వంటి లక్ష్యాలు ఆయన ముందున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment