కర్ణాటక సర్కారుకు షాక్‌ | Two Congress MLAs resign from Assembly in Karnataka | Sakshi
Sakshi News home page

కర్ణాటక సర్కారుకు షాక్‌

Published Tue, Jul 2 2019 3:34 AM | Last Updated on Tue, Jul 2 2019 11:14 AM

Two Congress MLAs resign from Assembly in Karnataka - Sakshi

రాజీనామా పత్రాన్ని చూపిస్తున్న ఆనంద్‌ సింగ్‌

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దినదినగండంగా కొనసాగుతున్న కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వానికి షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆనంద్‌ సింగ్‌ (విజయనగర), రమేశ్‌ జార్కిహోళి (గోకాక్‌)లు తమ పదవులకు, పార్టీకి సోమవారం రాజీనామా సమర్పించారు. కర్ణాటక స్పీకర్‌ రమేశ్‌ ఇంటికి వెళ్లిన ఆనంద్‌ సింగ్‌ రాజీనామా సమర్పించగా, రమేశ్‌ జార్కిహోళి ఫ్యాక్స్‌ ద్వారా రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆనంద్‌ సింగ్‌ గవర్నర్‌ వజూభాయ్‌వాలాకు కూడా రాజీనామాను అందజేశారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్‌ నేతలు మాజీ సీఎం సిద్దరామయ్య ఇంట్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. బీజేపీ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కుమారస్వామి అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వాన్ని వీడటం గమనార్హం.

డిమాండ్లు ఒప్పుకోనందుకే..
ఈ సందర్భంగా ఆనంద్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ..‘నిజమే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించాను. విజయనగర జిల్లాను ఏర్పాటుచేయడం, జేఎస్‌డబ్ల్యూ కంపెనీకి బళ్లారి జిల్లాలో 3,667 ఎకరాలు అమ్మేందుకు ఇచ్చిన అనుమతుల్ని రద్దుచేయాలన్న నా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదు. ఒకవేళ ఈ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తే, నా రాజీనామాపై పునరాలోచిస్తా’ అని స్పష్టం చేశారు. అయితే తనపై రిసార్టులో దాడిచేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జె.ఎన్‌.గణేశ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో ఆనంద్‌సింగ్‌ రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి.

మరో తిరుగుబాటు ఎమ్మెల్యే రమేశ్‌ జార్కి హోళి స్పందిస్తూ..‘ మంగళవారం అమావాస్య కాబట్టి ఈరోజు(సోమవారం) నా రాజీనామాను స్పీకర్‌కు ఫ్యాక్స్‌ ద్వారా పంపాను. రేపు ఉదయం వ్యక్తిగతంగా కలిసి రాజీనామా సమర్పిస్తాను’ అని చెప్పారు. మరికొంత మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నారా? అన్న మీడియా ప్రశ్నకు.. ‘మీకు ప్లాన్‌ మొత్తం చెప్పేస్తే ఎలా? వేచిచూడండి’ అని జవాబిచ్చారు. కాగా, ఆనంద్‌ సింగ్‌ రాజీనామా లేఖ తమకు అందిందనీ, నిబంధనల మేరకు ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ కార్యాలయం తెలిపింది.

కాంగ్రెస్‌ నేతల అత్యవసర భేటీ
ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా చేయడంతో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. ఆ పార్టీ సీనియర్‌ నేతలు డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర, మంత్రి డి.కె.శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు మాజీ సీఎం సిద్దరామయ్య ఇంటిలో అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీని ఎమ్మెల్యేలు ఎవరూ వీడకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం గుండూరావు మీడియాతో మాట్లాడుతూ..‘మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

బీజేపీ అగ్రనేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, కేంద్ర సంస్థల ద్వారా మా ఎమ్మెల్యేలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ఎన్నికుట్రలు చేసినా ఐదేళ్ల పాటు కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ సర్కారు కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు కర్ణాటకలో రాజకీయ పరిస్థితుల్ని తాను గమనిస్తున్నాననీ, తమ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ పగటి కలలు కంటోందని సీఎం కుమారస్వామి ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమిలో తీవ్రమైన అసంతృప్తి ఉందనీ, ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్ప జోస్యం చెప్పారు.

అసెంబ్లీలో బలాబలాలు..
కాంగ్రెస్‌ పార్టీకి 77 మంది, జేడీఎస్‌కు 37 మందితో పాటు ముగ్గురు స్వతంత్రులు కలిపి కర్ణాటక అసెంబ్లీలో అధికార కూటమికి 117 స్థానాలు ఉన్నాయి. అయితే ఆనంద్‌ సింగ్, రమేశ్‌ రాజీనామాతో ఆ బలం 115కు పడిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 113కు తగ్గింది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి నుంచి మరో 9 మంది ఎమ్మెల్యేను ఆకర్షించే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement