Anand Singh
-
‘మీ ఫ్యామిలీని కాల్చిపడేస్తా.. బీజేపీ మంత్రి బెదిరింపులు’
ఆయనో మంత్రి.. పేదలకు సాయం చేయాల్సిందిపోయి వారినే బెదిరించాడు. తాను చెప్పింది వినకుండా ఎక్కువగా మాట్లాడితే మీ కుటుంబాన్ని మొత్తం కాల్చిపడేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హోస్పెట్‌లో భూవివాదానికి సంబంధించి ఎస్సీ వర్గానికి చెందిన ఓ కుటుంబాన్ని కర్నాటక పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆనంద్ సింగ్ బెదిరించారు. కాగా, మంత్రి మంగళవారం హోస్పెట్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ఎస్సీ వర్గానికి చెందిన పోలప్ప అనే వ్యక్తి.. భూవివాదంలో మరో వర్గానికి చెందిన వారు తమను ఇబ్బంది పెడుతున్నారని మంత్రిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూ వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఆనంద్ సింగ్.. తాము చెప్పింది చేయాలని పోలప్పను బెదిరించారు. లేకపోతే కుటుంబం మొత్తాన్ని కాల్చిపడేస్తానని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆవేదనకు గురైన పోలప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు మంత్రి ఆనంద్ సింగ్‌తో పాటుగా మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, ఐపిసి సెక్షన్ 504, 506 కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అయితే, ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో, వారిని అడ్డుకున్న పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసినందుకు గానూ పోలప్ప ఫ్యామిలీపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. The members of the family threatened by #Karnataka Tourism, Ecology and Environment Minister Anand Singh, later attempted to immolate themselves.https://t.co/kGLeJmzu06 — News9 (@News9Tweets) August 31, 2022 -
కర్ణాటక సర్కారుకు షాక్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దినదినగండంగా కొనసాగుతున్న కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్ (విజయనగర), రమేశ్ జార్కిహోళి (గోకాక్)లు తమ పదవులకు, పార్టీకి సోమవారం రాజీనామా సమర్పించారు. కర్ణాటక స్పీకర్ రమేశ్ ఇంటికి వెళ్లిన ఆనంద్ సింగ్ రాజీనామా సమర్పించగా, రమేశ్ జార్కిహోళి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆనంద్ సింగ్ గవర్నర్ వజూభాయ్‌వాలాకు కూడా రాజీనామాను అందజేశారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు మాజీ సీఎం సిద్దరామయ్య ఇంట్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. బీజేపీ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కుమారస్వామి అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వాన్ని వీడటం గమనార్హం. డిమాండ్లు ఒప్పుకోనందుకే.. ఈ సందర్భంగా ఆనంద్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..‘నిజమే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించాను. విజయనగర జిల్లాను ఏర్పాటుచేయడం, జేఎస్‌డబ్ల్యూ కంపెనీకి బళ్లారి జిల్లాలో 3,667 ఎకరాలు అమ్మేందుకు ఇచ్చిన అనుమతుల్ని రద్దుచేయాలన్న నా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదు. ఒకవేళ ఈ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తే, నా రాజీనామాపై పునరాలోచిస్తా’ అని స్పష్టం చేశారు. అయితే తనపై రిసార్టులో దాడిచేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆనంద్‌సింగ్ రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. మరో తిరుగుబాటు ఎమ్మెల్యే రమేశ్ జార్కి హోళి స్పందిస్తూ..‘ మంగళవారం అమావాస్య కాబట్టి ఈరోజు(సోమవారం) నా రాజీనామాను స్పీకర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపాను. రేపు ఉదయం వ్యక్తిగతంగా కలిసి రాజీనామా సమర్పిస్తాను’ అని చెప్పారు. మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నారా? అన్న మీడియా ప్రశ్నకు.. ‘మీకు ప్లాన్ మొత్తం చెప్పేస్తే ఎలా? వేచిచూడండి’ అని జవాబిచ్చారు. కాగా, ఆనంద్ సింగ్ రాజీనామా లేఖ తమకు అందిందనీ, నిబంధనల మేరకు ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని స్పీకర్ కార్యాలయం తెలిపింది. కాంగ్రెస్ నేతల అత్యవసర భేటీ ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఆ పార్టీ సీనియర్ నేతలు డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర, మంత్రి డి.కె.శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మాజీ సీఎం సిద్దరామయ్య ఇంటిలో అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీని ఎమ్మెల్యేలు ఎవరూ వీడకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం గుండూరావు మీడియాతో మాట్లాడుతూ..‘మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ అగ్రనేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, కేంద్ర సంస్థల ద్వారా మా ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎన్నికుట్రలు చేసినా ఐదేళ్ల పాటు కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ సర్కారు కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు కర్ణాటకలో రాజకీయ పరిస్థితుల్ని తాను గమనిస్తున్నాననీ, తమ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ పగటి కలలు కంటోందని సీఎం కుమారస్వామి ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్–జేడీఎస్ కూటమిలో తీవ్రమైన అసంతృప్తి ఉందనీ, ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప జోస్యం చెప్పారు. అసెంబ్లీలో బలాబలాలు.. కాంగ్రెస్ పార్టీకి 77 మంది, జేడీఎస్‌కు 37 మందితో పాటు ముగ్గురు స్వతంత్రులు కలిపి కర్ణాటక అసెంబ్లీలో అధికార కూటమికి 117 స్థానాలు ఉన్నాయి. అయితే ఆనంద్ సింగ్, రమేశ్ రాజీనామాతో ఆ బలం 115కు పడిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 113కు తగ్గింది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి మరో 9 మంది ఎమ్మెల్యేను ఆకర్షించే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. -
అమెరికాలో సీఎం; ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ సర్కారులో మరో సంక్షోభం తలెత్తింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ముందుగా ఆనంద్ సింగ్ రాజీనామా చేయగా, మరికొద్ది గంటల తర్వాత మరో ఎమ్మెల్యే రమేశ్ జర్కయాళి కూడా ఆయన బాటలో నడిచారు. వీరిద్దరి రాజీనామాలతో కర్ణాటక అసెంబ్లీలో సంకీర్ణ సర్కారు బలం 117కి తగ్గింది. 224 స్థానాలున్న శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 113. బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయనగర్ నియోజకవర్గం నుంచి ఆనంద్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తన నియోజవర్గంలోని ప్రభుత్వ భూమిని జిందాల్ సంస్థకు లీజుకు ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఆనంద్ సింగ్ విలేకరులకు తెలిపారు. ఆనంద్ సింగ్ రాజీనామా లేఖ అందిందని స్పీకర్ కార్యాలయం వెల్లడించింది. రమేశ్ జర్కయాళి రాజీనామా లేఖను స్వీకరించేందుకు స్పీకర్ ఆఫీసు నిరాకరించింది. తన రాజీనామా వెనుక ఎవరి ఒత్తడి లేదని, ఇది తన సొంత నిర్ణయమని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. ‘న్యూజెర్సీలో కాలభైరేశ్వర ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఉన్నాను. టీవీ చానళ్లు చూస్తున్నాను. మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు పగటి కలలుగానే మిగులుతాయ’ని ఆయన ట్వీట్ చేశారు. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కోరుకోవడం లేదన్నారు. ఒకవేళ సంకీర్ణ సర్కారు తనంతట తాను కూలిపోతే ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తామన్నారు. ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో ఎటువంటి పొరపొచ్చాలు లేవని, ఆనంద్ సింగ్ రాజీనామా తనకు షాక్ కలిగించిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. కాగా, జనవరిలో ఈగల్టన్ రిసార్టులో కంప్లి ఎమ్మెల్యే గణేశ్‌తో జరిగిన ఘర్షణలో గాయపడిన ఆనంద్ సింగ్ ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. -
అతడిని చూస్తే కన్నీళ్లొచ్చాయి
సాక్షి, బెంగళూరు : బళ్ళారికి చెందిన ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా మారడంతో పాటు హొసపేటె ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్, కంప్లి ఎమ్మెల్యే గణేష్ మధ్య జరిగిన గొడవకు మూల కారణం మాజీ సీఎం సిద్ధరామయ్య, మంత్రి డి.కే.శివకుమారలేనని మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేల వద్ద ప్రాబల్యం చూపించుకుంటూ వీరిద్దరు ఇలాంటి పరిస్థితులను సృష్టిస్తున్నారని విమర్శించారు. బెంగళూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ను గాలి జనార్ధన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. అనంతరం ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో మాజీ సీఎం సిద్ధరామయ్య, మంత్రి డి.కే శివకుమార్ మధ్య కోల్డ్‌వార్ మొదలైందని అన్నారు. ఎమ్మెల్యే గణేష్, భీమానాయక్‌లు సిద్ధరామయ్య వర్గంలో ఉన్నారని, మిగతావారు మంత్రి డీకే బృందంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో బళ్లారి జిల్లా ఎమ్మెల్యేల్లో గుంపు రాజకీయాలు మొదలయ్యాయని విమర్శించారు. ఆనంద్‌సింగ్‌పైన దాడి విషయంలో మంత్రి డి.కే. శివకుమార్ మొత్తం అబద్దాలు చెబుతున్నారని, దాడి జరిగిన రోజు సాయంత్రం డిశ్చార్జి అవుతారని ఆయన అంటే, మరో మంత్రి జమీర్ ఆహ్మద్ ఆనంద్‌సింగ్‌కు బిర్యాని తెప్పించి తినిపిస్తానని అన్నారన్నారు. కానీ అక్కడ ఆస్పత్రిలో ఆనంద్‌సింగ్ పరిస్థితి చుస్తుంటే మరికొన్ని రోజుల వరకు డిశ్చార్జి అయ్యేలా కనిపించడ లేదని పేర్కొన్నారు. ఆస్పత్రిలో బెడ్‌పైన పడుకుని ఉన్న తన ఆత్మీయ స్నేహితుడు ఆనంద్‌సింగ్‌ను ఆ పరిస్థితిలో చూస్తే నా కళ్ళలో నీళ్ళు ఆగలేదని అన్నారు. కన్నుతో పాటు తలకు తీవ్రమైనగాయమైందని అన్నారు. దాడి చేసిన గణేశ్ కూడా ఒక ఎమ్మెల్యేనే అని, ఇలా దాడి చేయడం మంచి పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఆ రోజు నన్ను చూడనివ్వలేదు: ఎమ్మెల్యే రాజుగౌడ రిసార్టులో ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ పైన జరిగిన దాడి చూస్తుంటె ఇది సాధారణ మనుషులు చెసినట్లులేదని, కరుడుకట్టిన రాక్షసులు దాడి చేసినట్లు ఉందని ఎమ్మెల్యే రాజుగౌడ మండిపడ్డారు. బుధవారం మధ్యాహ్నం ఆయన ఆనంద్‌సింగ్‌ను పరామర్శించారు. దాడి జరిగిన రోజునే ఆస్పత్రికి వస్తే, కొంతమంది పని కట్టుకుని ఎవరినీ లోనికి వెళ్ళకుండా చేశారని, అందుకు కారణం ఇప్పుడు ఆనంద్‌సింగ్ ఉన్న పరిస్థితిని చూస్తుంటే అర్థం అవుతోందన్నారు. ఆనంద్‌సింగ్ ముఖం చూడగానే చాలా భయం వేసిందన్నారు. శత్రువులకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. అధికార కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలకు కూడా రక్షణ ఇవ్వలేక పోతున్నారు, ఇక రాష్ట్ర ప్రజలకు ఏమి చేస్తారని ఎద్దేవా చేశారు.ఇంత జరిగినా పొలీసులు ఎమ్మెల్యే గణేష్‌ను పట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. -
తుపాకీతో కాల్చబోయాడు
బొమ్మనహళ్లి/శివాజీనగర: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, గణేశ్‌ల మధ్య గత శనివారం ఈగల్టన్ రిసార్టులో జరిగిన ఘర్షణపై పోలీసు దర్యాప్తు ఆరంభమైంది. ఇది ముందు అనుకున్నంత చిన్న కేసు కాదని తెలుస్తోంది. తుపాకులు, హత్యాయత్నం వరకు వెళ్లిందని బాధిత ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ ఖాకీల ముందు పేర్కొన్నారు. ఆ దాడిలో తలకు తీవ్ర గాయాలతో నగరంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆనంద్‌సింగ్‌ను కలిసి బిడది పోలీసులు వివరాలను సేకరించారు. తాజా వివరాలతో దాడి కేసులో హత్యాయత్నం అభియోగంగా మార్చారని తెలిసింది. ఈ దాడి కేసులో ఎమ్మెల్యే గణేశ్ పైన ఆనంద్‌సింగ్ కుటుంబీకులు కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ నమోదు కావడం తెలిసిందే. మంగళవారం ఆస్పత్రికి వెళ్ళిన పోలీసులు ఐసీయూ వార్డులోనే ఆనంద్‌సింగ్‌ను కలిశారు. దాడి గురించి పలు కోణాల్లో సమాచారాన్ని తీసుకున్నారు. మరోపైన తనపైన కేసు నమోదు కావడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్యే గణేశ్ ముందుజాగ్రత్తగా అజ్ఞాతంలో వెళ్లిపోయారని సమాచారం. దాడి కేసులో ఆయనను కలవడానికి బిడది పోలీసులు ప్రయత్నింగా ఆయన అందుబాటులోకి రావడం లేదని తెలిసింది. ఆనంద్‌సింగ్ ఏం చెప్పారంటే ఆనంద్‌సింగ్ పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం... ఈగల్టన్ రిసార్టులో రానున్న లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రంలో ఉన్న కరువు సమస్యపైన పార్టీ పెద్దలు సమావేశం జరిపారు. ఈ సమావేశానికి నేను హాజరయ్యాను. అందరితో కలిసి భోజనం చేసి వెళుతున్న సమయంలో కంప్లి ఎమ్మెల్యే గణేశ్ వచ్చారు. ఎన్నికల సమయంలో నీవుడబ్బులు సరిగా ఖర్చు పెట్టలేదు. నిన్ను, మీ అక్క కొడుకు సందీప్ కథను ముగించేస్తానని నన్ను హెచ్చరించాడు. నేను వెంటనే.. మా కుటుంబం గురించి మాట్లాడుతున్నావు అని అడిగా. గణేశ్ స్పందిస్తూ మొదట వారిని కాదు, నిన్ను ముగిస్తే అన్ని సమస్యలు సరిపోతాయని ఒక్కసారిగా నాపైన దాడి చేశాడు. నోటికి వచ్చినట్లు తిడుతూ అక్కడ ఉన్న కట్టెతోను, పూలకుండీతోను గట్టిగా కొట్టాడు. తుపాకీ ఇవ్వండి, వీడిని ఇక్కడే ముగించేస్తానని కేకలు వేశాడు. నా తల, ముఖం పైన తీవ్రంగా కొట్టాడు’ అని పేర్కొన్నట్లు తెలిసింది. దాడిని అక్కడే ఉన్న మంత్రి తుకారాం, తన్వీర్ సేఠ్, ఎమ్మెల్యేలు రఘుమూర్తి, రామప్పలు అడ్డుకొన్నారని తెలిపారు. ఆనంద్ సింగ్ వద్ద సమాచారం తీసుకొన్న పోలీసులు ఎమ్మెల్యే గణేశ్‌పై హత్యాయత్నం కేసుగా మార్చినట్లు సమాచారం. గణేశ్ తనపై దాడిచేసి హత్యకు యత్నించాడని, తనను చంపడానికి తుపాకీ ఇవ్వకపోవటంతో ఆగ్రహించి గన్‌మ్యాన్ చెయ్యిని కొరికాడని ఆనంద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదులో తెలిపారు. గణేశ్ ఎక్కడ ఎమ్మెల్యే గణేశ్ ఆచూకీ దొరక్కపోవడం సంచలనం కలిగిస్తోంది. అరెస్టు భయంతోనే గణేశ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది. గణేశ్ ఏం చేయాలో దిక్కుతోచక అదృశ్యమయ్యాడని తెలిసింది. ఆయన మొబైల్ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్‌లో ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దాడి ఘటన తరువాత సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేదు. ముందస్తు బెయిల్ పొందే యత్నాల్లో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. -
రిసార్టులో ఎమ్మెల్యేల బాహాబాహీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఉన్న ఈగల్టన్ రిసార్టులో కలకలం చెలరేగింది. ఈ రిసార్టులో శనివారం రాత్రి కాంగ్రెస్ నేతలు భోజనం చేస్తుండగా కంప్లి ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్, హోసపేటె ఎమ్మెల్యే, గనుల వ్యాపారి ఆనంద్ సింగ్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన గణేశ్ టేబుల్‌పై ఉన్న మద్యం బాటిల్‌తో ఒక్కసారిగా ఆనంద్‌సింగ్‌పై దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆనంద్‌సింగ్‌ను నేతలు అపోలో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనకు 12 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఆసుపత్రి ముందు మోహరించిన పోలీసులు ప్రస్తుతం రాజకీయ నేతలెవరినీ లోపలకు వెళ్లనివ్వడం లేదు. ఈ గొడవ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధుయాష్కి మాట్లాడుతూ..‘బళ్లారి జిల్లాకు చెందిన గణేశ్, ఆనంద్ సింగ్ ఇద్దరూ పలు వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారానికి సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్తా ముదరడంతో గణేశ్, ఆనంద్ సింగ్‌పై దాడి చేశారు. ఈ దాడికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. రహస్య సమాచారం లీక్ చేశాడనే.. ఈగల్టన్ రిసార్టులో రెండ్రోజులుగా గణేశ్, ఆనంద్ సింగ్ మధ్య వాగ్వాదం కొనసాగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో భాగంగా బీజేపీ నేతలు గణేశ్‌ను సంప్రదించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు తనను సంప్రదించిన విషయాన్ని, ఇస్తామన్న ఆఫర్‌ను గణేశ్ ఆనంద్‌సింగ్‌తో పంచుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ సీఎల్పీ భేటీకి విప్ జారీచేయడంతో గణేశ్ గత్యంతరం లేక హాజరయ్యారు. సమావేశం అనంతరం సీనియర్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలను నేరుగా రిసార్టుకు తరలించారు. ఈ సందర్భంగా గణేశ్‌ను బీజేపీ ప్రలోభపెట్టిన విషయాన్ని ఆనంద్‌సింగ్ సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య చెవిన వేశారు. ఈ విషయం తెలుసుకున్న గణేశ్ ఆగ్రహంతో ఊగిపోయారు. చివరికి మాటామాటా పెరగడంతో ఆనంద్‌సింగ్ తలపై మద్యం బాటిల్‌తో దాడిచేశారు. కాగా, తన భర్తపై దాడిచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆనంద్‌సింగ్ భార్య ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని బిదాది పోలీసులు తెలిపారు. బీజేపీ విమర్శలు ఈగల్టన్ రిసార్టులో జరిగిన ఘటన ప్రజాస్వామ్యానికే కళంకమని బీజేపీ విమర్శించింది. ఈ గొడవను రాష్ట్ర పీసీసీ చీఫ్ గుండూరావు ఆపలేకపోవడం నిజంగా దురదృష్టకరమని ఎద్దేవా చేసింది. ఇన్నాళ్లూ ప్రతీ సమస్యకు బీజేపీనే కారణమని ఆరోపించిన గూండూరావు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించింది. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్ యాడ్యూరప్ప ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాష్ట్రానికి తిరిగివస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి కుమారస్వామి సర్కారును బలనిరూపణకు ఆదేశించాల్సిందిగా కమలనాథులు కోరే అవకాశమున్నట్లు సమాచారం. -
అజ్ఞాతంలోనే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
సాక్షి, బెంగళూరు : ఓవైపు బలపరీక్షకు కొద్ది గంటల సమయం మాత్రమే ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా అజ్ఞాతం వీడలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ ఇంకా హాజరు కాలేదు. గత రెండు రోజులుగా వీరిద్దరు అందుబాటులో లేని విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి శనివారం ఉదయం ఇక్కడ మాట్లాడుతూ... ఆనంద్ సింగ్ విధాన సభకు వస్తారని, ఆయన కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని అంతకు ముందు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బలపరీక్షపై ఆయన మాట్లాడుతూ... సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత వాస్తవమో కాంగ్రెస్ నెగ్గడం అంతే నిజమన్నారు. యడ్యూరప్ప ముందుగానే రాజీనామా చేస్తే మంచిదని సూచించారు. 117 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం తమకు ఉందన్నారు. యడ్యూరప్పతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించి గవర్నర్ వాజుభాయ్ వాలా మొదటి తప్పు చేశారని, ఇక ప్రోటెం స్పీకర్ ఎంపిక విషయంలో రెండో తప్పు చేశారని రామలింగారెడ్డి విమర్శించారు. మస్కి ఎమ్మెల్యే కోసం కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు రెండు రోజులుగా తమకు అందుబాటులో లేకుండాపోయిన మస్కి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శనివారం సాయంత్రంలోపు విధానసభలో బలనిరూపణ చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎమ్మెల్యే ప్రతాప్ గౌడను తిరిగి సొంత గూటికి తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే హంపన గౌడ బాదర్లి, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి వసంతకుమార్...ఎమ్మెల్యే ప్రతాప్ గౌడతో ఫోన్‌తో సంభాషించినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతల సూచనల మేరకు ఆయన తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
10న కాంగ్రెస్‌లోకి కూడ్లిగి ఎమ్మెల్యే నాగేంద్ర
బొమ్మనహళ్లి: బళ్ళారి జిల్లా బీజేపీకి మరో ఎదురుదెబ్బ. జిల్లా హసపేట బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, కూడ్లిగి నియోజకవర్గం బీజేపీ నాగేంద్ర కూడా అదే బాటలో ఈ నెల 10వ తేదిన కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య శనివారం మీడియాతో తెలిపారు. శనివారం నాగేంద్ర సిద్ధరామయ్య నివాసానికి వెళ్లి ఈ విషయమై చర్చలు జరిపారు. 10వ తేదీన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బళ్లారి జిల్లాలో పర్యటిస్తారు. ఆ సమయంలో నాగేం«ద్ర కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. ఒకేజిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను బీజేపీ కోల్పోవడం పార్టీ నాయకులను కలవరపరుస్తోంది. -
బీజేపీ ఎమ్మెల్యే రాజీనామా..!
సాక్షి, బెంగళూరు: శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు హొసపేటె విజయనగర క్షేత్రం బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ వెల్లడించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని శనివారం బెంగళూరులో స్పీకర్‌కు అందజేయనున్నట్లు ఆనంద్‌సింగ్ తెలిపారు. నగరంలో శుక్రవారం వివిధ సమాజ నాయకులతో ఏర్పాటు చేసిన సమాలోచన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను బీజేపీ నుంచి రెండు పర్యాయాలు అధిక మెజార్టీతోనే గెలుపొందానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో ఉండటం లేదని స్పష్టం చేశారు. రానున్న అంసెబ్లీ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్తిగా పోటీ చేయాలా? లేదా ఇతర పార్టీల నుంచి పోటీ చేయాలా అనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానన్నారు. తనకు నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారని.. ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేసి హ్యట్రిక్ సాధించడం ఖాయమని తెలిపారు. రానున్న బడ్జెట్లో నగరాభివృద్ధి కోసం రూ.120 కోట్లు, గ్రామీణ భాగం వృద్ధి కోసం రూ. 200 కోట్ల నిధులు విడుదల చేయిస్తానన్నారు. బీజేపీ పెద్దలు, తనకు మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి తనకు గురువని తెలిపారు. ప్రధాని మోదీగాలి వీస్తోందని అందరూ బీజేపీ పార్టీలో చేరుతున్నారని, తాను మాత్రం బీజేపీ నుంచి దూరమవుతున్నానని తెలిపారు. కాగా ఫిబ్రవరిలో ఆనంద్ సింగ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. -
మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సీబీఐ నోటీసులు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉత్తర కన్నడ జిల్లాలోని బెలెకెరె రేవు ద్వారా ఇనుప ఖనిజాన్ని అక్రమంగా ఎగుమతి చేశారన్న ఆరోపణలకు సంబంధించి సీబీఐ బళ్లారి జిల్లా విజయ నగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్, కూడ్లిగి ఎమ్మెల్యే నాగేంద్రలకు నోటీసులు జారీ చేసింది. ఆదివారంలోగా దర్యాప్తునకు హాజరు కావాలని ఆదేశించింది. విదేశీ పర్యటనలో ఉన్న ఆనంద్ సింగ్ శనివారం వేకువ జామున నగరానికి తిరిగి వచ్చారు. మధ్యాహ్నం ఇక్కడి బళ్లారి రోడ్డులోని గంగా నగరలో ఉన్న సీబీఐ కార్యాలయంలో తన న్యాయవాదితో హాజరయ్యారు. అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాగేంద్ర కూడా ఆదివారంలోగా దర్యాప్తునకు హాజరు కావాల్సి ఉంది. వీరిద్దరిని ప్రశ్నించిన అనంతరం అరెస్టు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సతీశ్ శైల్‌కు సీబీఐ కస్టడీ మరో వైపు శుక్రవారం రాత్రి అరెస్టు చేసిన ఉత్తర కన్నడ జిల్లా కార్వార ఎమ్మెల్యే సతీశ్ శైల్‌ను సీబీఐ అధికారులు శనివారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. ఆయనను అరెస్టు చేశామని, మరింత దర్యాప్తు కోసం తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయాధికారిని కోరారు. దీనిపై సతీశ్ శైల్ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లయింట్‌కు ఇదివరకే హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేశారు. పైగా ఈ ఆరోపణలకు సంబంధించి పలు సార్లు శైల్‌ను ప్రశ్నించారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని వాదించారు. ఇరు వైపులా వాదనలను ఆలకించిన అనంతరం న్యాయాధికారి ఈ నెల 27 వరకు శైల్‌ను సీబీఐ కస్టడీకి ఆదేశించారు. ఈ నెల 24న ఆయన బెయిల్ దరఖాస్తుపై విచారణ చేపడతామని తెలిపారు. అధికారులకూ నోటీసులు అక్రమ మైనింగ్‌కు సహకరించారన్న ఆరోపణలపై రిటైర్డ్ జిల్లా కలెక్టర్ శివప్ప, పోలీసు అధికారి సీమంత కుమార్, అటవీ శాఖాధికారి ముత్తయ్య సహా పలువురు సీనియర్ అధికారులకు సీబీఐ అత్యవసర నోటీసులు జారీ చేసింది. స్వయంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.