ఆనంద్ సింగ్, గణేశ్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఉన్న ఈగల్‌టన్ రిసార్టులో కలకలం చెలరేగింది. ఈ రిసార్టులో శనివారం రాత్రి కాంగ్రెస్ నేతలు భోజనం చేస్తుండగా కంప్లి ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్, హోసపేటె ఎమ్మెల్యే, గనుల వ్యాపారి ఆనంద్ సింగ్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన గణేశ్ టేబుల్‌పై ఉన్న మద్యం బాటిల్‌తో ఒక్కసారిగా ఆనంద్‌సింగ్‌పై దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆనంద్‌సింగ్‌ను నేతలు అపోలో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనకు 12 కుట్లు వేశారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఆసుపత్రి ముందు మోహరించిన పోలీసులు ప్రస్తుతం రాజకీయ నేతలెవరినీ లోపలకు వెళ్లనివ్వడం లేదు. ఈ గొడవ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధుయాష్కి మాట్లాడుతూ..‘బళ్లారి జిల్లాకు చెందిన గణేశ్, ఆనంద్ సింగ్ ఇద్దరూ పలు వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారానికి సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్తా ముదరడంతో గణేశ్, ఆనంద్ సింగ్‌పై దాడి చేశారు. ఈ దాడికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు.
రహస్య సమాచారం లీక్ చేశాడనే..
ఈగల్‌టన్ రిసార్టులో రెండ్రోజులుగా గణేశ్, ఆనంద్ సింగ్ మధ్య వాగ్వాదం కొనసాగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో భాగంగా బీజేపీ నేతలు గణేశ్‌ను సంప్రదించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు తనను సంప్రదించిన విషయాన్ని, ఇస్తామన్న ఆఫర్‌ను గణేశ్ ఆనంద్‌సింగ్‌తో పంచుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ సీఎల్పీ భేటీకి విప్ జారీచేయడంతో గణేశ్ గత్యంతరం లేక హాజరయ్యారు. సమావేశం అనంతరం సీనియర్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలను నేరుగా రిసార్టుకు తరలించారు.
ఈ సందర్భంగా గణేశ్‌ను బీజేపీ ప్రలోభపెట్టిన విషయాన్ని ఆనంద్‌సింగ్ సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య చెవిన వేశారు. ఈ విషయం తెలుసుకున్న గణేశ్ ఆగ్రహంతో ఊగిపోయారు. చివరికి మాటామాటా పెరగడంతో ఆనంద్‌సింగ్ తలపై మద్యం బాటిల్‌తో దాడిచేశారు. కాగా, తన భర్తపై దాడిచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆనంద్‌సింగ్ భార్య ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని బిదాది పోలీసులు తెలిపారు.
బీజేపీ విమర్శలు
ఈగల్‌టన్ రిసార్టులో జరిగిన ఘటన ప్రజాస్వామ్యానికే కళంకమని బీజేపీ విమర్శించింది. ఈ గొడవను రాష్ట్ర పీసీసీ చీఫ్ గుండూరావు ఆపలేకపోవడం నిజంగా దురదృష్టకరమని ఎద్దేవా చేసింది. ఇన్నాళ్లూ ప్రతీ సమస్యకు బీజేపీనే కారణమని ఆరోపించిన గూండూరావు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించింది. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్ యాడ్యూరప్ప ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాష్ట్రానికి తిరిగివస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి కుమారస్వామి సర్కారును బలనిరూపణకు ఆదేశించాల్సిందిగా కమలనాథులు కోరే అవకాశమున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment