
విలేకరులతో మాట్లాడుతున్న గుండురావు
బెంగళూరు: కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తాత్కాలికంగా తెర పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాలకు వెళ్లిపోయారని పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు తెలిపారు. జేడీయూ- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకే తమ శాసనసభ్యులను రిసార్ట్‌కు తరలించామని వెల్లడించారు. తమ ప్రభుత్వం సురక్షితంగా, సుస్థిరంగా ఉందని పేర్కొన్నారు.
మరోవైపు మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య పిలుపునిచ్చిన విధంగా సోమవారం సీఎల్పీ సమావేశం జరగలేదు. ‘ఈరోజు సీఎల్పీ సమావేశం ఉంటుందని గతరాత్రి నాకు చెప్పారు. ఇప్పుడేమో సమావేశం లేదంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు రిసార్ట్ నుంచి వెళ్లిపోయారు. మరికొంత మంది వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ కారణంగానే ఈ గందరగోళం తలెత్తింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంతా సవ్యంగానే ఉంద’ని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చెప్పారు.
ఈగల్‌టన్ రిసార్ట్‌లో తనతోటి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌పై తాను చేసినట్టు వచ్చిన వార్తలను ఎమ్మెల్యే కంప్లి జేఎన్ గణేశ్ తోసిపుచ్చారు. ఇందులో వాస్తవం లేదన్నారు. ఆనంద్‌పై తాను దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయన బాధపడివుంటే తన కుటుంబంతో కలిసి ఆయనను క్షమాపణ అడుగుతానని చెప్పారు. (రిసార్టులో ఎమ్మెల్యేల బాహాబాహీ)
Comments
Please login to add a commentAdd a comment