
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలోని జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడి నేటికి సరిగ్గా పది రోజులవుతోంది. జూలై ఒకటవ తేదీనే తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసినా నేటికి వాటిని స్పీకర్ ఆమోదించక పోవడంతో 14 మంది రెబెల్ జేడీఎస్, కాంగ్రెస్ శాసన సభ్యులు బుధవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శాసన సభకు సంబంధించిన వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవంటూ సుప్రీం కోర్టు గతం లాగా చేతులెత్తేసే అవకాశం ఉంది. శాసన సభ్యుల తిరుగుబాటు వెనక బీజేపీ హస్తం ఉందంటూ జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ కేంద్ర నాయకత్వం ఖండించడమూ తెల్సిందే. పది మంది రెబెల్ శాసన సభ్యులు బీజేపీ రాజ్యసభ సభ్యుడి కంపెనీకి చెందిన విమానంలో ముంబైకి వెళ్లి, అక్కడి హోటల్లో మకాం వేయడం జేడీఎస్, కాంగ్రెస్ ఆరోపణల్లోని వాస్తవాస్తవాలకు అద్దం పడుతోంది.
చదవండి: కర్ణాటకం : గవర్నర్‌ను కలవనున్న యడ్యూరప్ప
రాజీనామాలు చేసిన శాసన సభ్యులు తనను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడే వారి రాజీనామాలపై తాను నిర్ణయం తీసుకుంటానని అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ మంగళవారం స్పష్టం చేసిన విషయం తెల్సిందే. అంటే రెబెల్ ఎమ్మెల్యేలు తనను వ్యక్తిగతంగా కలుసుకున్నట్లయితే ప్రభుత్వం తరఫున వారిని ప్రలోభ పెట్టి వారి చేత రాజీనామాలను ఉపసంహరింప చేయాలన్నదే ఆయన ఉద్దేశమని సులభంగానే తెలుస్తోంది. ఈ దశంలో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసాన్ని కోరవచ్చు. ఇలాంటి సంక్షోభ సందర్భాల్లో ప్రభుత్వం తన మెజారిటీని సభలోనే నిరూపించుకోవాలంటూ సుప్రీం కోర్టు కూడా పలు సందర్భాల్లో స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
14 మంది ఎమ్మేల్యేల రాజీనామాతో 224 మంది సభ్యులుగల రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుల బలం 210కి పడిపోయింది. దీంతో ప్రభుత్వానికి 106 సభ్యుల మద్దతు అవసరం. 14 మంది రాజీనామా అనంతరం సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ 104కు పడిపోయింది. స్వతంత్ర సభ్యుడు హెచ్. నగేశ్, కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీకి చెందిన సభ్యుడు ఆర్ శంకర్‌ల మద్దతుతో బీజేపీ బలం 107కు చేరుకుంది. ఈ దశలో వారి రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్ తాత్సారం చేయడం అంటే అది కచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించడమే. మరి బీజేపీ ప్రలోభాలతో 14 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? అని జేడీఎస్–కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
14 మంది రెబెల్ శాసన సభ్యులు తమ రాజీనామాలను ఉపసంహరించకునేందుకు అంగీకరించక పోవడంతో వారిని సభకు అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌ను డిమాండ్ చేసింది. అలా చేసినట్లయితే వారు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. ఆ రకంగా కూడా సభ్యులను కాంగ్రెస్ పార్టీ బెదిరిస్తోంది. రాజీనామాలను ఉపసంహరించుకున్నట్లయితే వారందరికి మంత్రి పదవులు ఇస్తామని సంకీర్ణ ప్రభుత్వం ఆశ చూపుతోంది. మొత్తానికి పాలక, ప్రతిపక్షాల వ్యవహారం రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment