సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరికాసేట్లో బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప గవర్నర్‌ను కలవనున్నారు. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సభ్యులున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా యడ్యూరప్ప గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం సభలోనే బీజేపీ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ.. తర్వాతి ప్రభుత్వం తమదేనని సంకేతమినిచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. యడ్యూరప్ప మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
బల పరీక్షలో కుమారస్వామి ఓటమి అనంతరం.. యడ్యూరప్ప స్పందించారు. ఇది కర్ణాటక ప్రజల విజయమన్నారు. కన్నడ ప్రజలను అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని వదిలిందని, 105 మంది సభ్యులతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జేడీఎస్- కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పుకొచ్చారు. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూలిపోవడంతో తన ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. విశ్వాస పరీక్ష అనంతరం గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తేలాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment