సాక్షి, బెంగళూరు/పుణే : కర్ణాటకలో రెబెల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరంతా కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితి ముగిసేవరకూ(2023) ఎన్నికల్లో పోటీకి అనర్హులని స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల సంఖ్య 17కు చేరుకుంది. ఈ నెల 25న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. రమేశ్ కుమార్ నిర్ణయంతో యడియూరప్ప ప్రభుత్వం సోమవారం విశ్వాసపరీక్షను సులభంగా గట్టెక్కేందుకు అవకాశమేర్పడింది. కాగా, స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్, జేడీఎస్ స్వాగతించగా, ఓ పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే రమేశ్ రెబెల్స్‌పై వేటేశారని బీజేపీ విమర్శించింది.
నోటీసులిచ్చినా స్పందించలేదు..
చట్టాన్ని అనుసరించి, మనస్సాక్షి ఆధారంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసినట్లు స్పీకర్ రమేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రస్తుత రాజకీయ సంక్షోభం నన్ను తీవ్రమైన డిప్రెషన్‌లోకి నెట్టేసింది. ఇది నా రాజకీయ జీవితంలో చివరిదశ కావొచ్చు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో నాపై వచ్చిన విమర్శలు నూటికి నూరుశాతం బాధించాయి. రెబెల్ ఎమ్మెల్యేలు విప్ ఉల్లంఘించినట్లు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో మూడు రోజుల్లోగా నా ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేశాను. వారు స్పందించకపోవడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేలు ప్రతాప్‌గౌడ పాటిల్, బీసీ పాటిల్, శివరామ్ హెబ్బర్, ఎస్టీ సోమశేఖర్, జేడీఎస్ ఎమ్మెల్యేలు గోపీనాథ్, ఎ.హెచ్.విశ్వనాథ్, నారాయణ గౌడ, తదితరుల్ని అనర్హులుగా ప్రకటించాను’ అని చెప్పారు. ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్‌పై అనర్హత వేటేయాలని బీఎస్పీ కోరిందనీ, దీనిపైనా నిర్ణయం తీసుకుంటానన్నారు. తనపై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందన్న వార్తలపై స్పందిస్తూ..‘నేనే సభాపతిగా ఉంటా. వాళ్లను(బీజేపీ) రానివ్వండి. నేను రాజీనామా చేయను. నా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాను’ అని తెలిపారు. విశ్వాసపరీక్షతో పాటు ఆర్థికబిల్లుకు ఆమోదం నేపథ్యంలో సోమవారం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మరణంపై స్పీకర్ రమేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘జైపాల్ రెడ్డి నాకు పెద్దన్నలాంటివారు. నాకు మార్గదర్శి. మాది 40 ఏళ్ల అనుబంధం ’ అని చెప్పారు.
‘సుప్రీం’లో సవాల్ చేస్తాం: రెబెల్స్
స్పీకర్ రమేశ్ కుమార్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సోమవారం సవాలు చేస్తామని రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. అనర్హత విషయంలో స్పీకర్ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారని జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యే ఎ.హెచ్.విశ్వనాథ్ ఆరోపించారు. ఓ వీడియోను విడుదలచేసిన తిరుగుబాటు ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్..అనర్హత వేటుపై సుప్రీంకోర్టుకు వెళతామనీ, న్యాయపోరాటంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని తెలుసుకునే పదవులకు రాజీనామా చేశామనీ, ఈ విషయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరించారని ఎమ్మెల్యే శివరామ్ హెబ్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో బలాబలాలు
కర్ణాటక అసెంబ్లీలో 224 మంది సభ్యులు(స్పీకర్ కాకుండా) ఉన్నారు. స్పీకర్ 17 మందిపై అనర్హతవేటు వేయడంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 207కు చేరుకుంది. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 104కు తగ్గింది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది బలం ఉండగా, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కూడా మద్దతు ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 100 మంది(నామినేటెడ్‌తో కలిపి) ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే బలపరీక్షలో బీజేపీ విజయం సాధించడం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోమవారం బలపరీక్ష నేపథ్యంలో అసెంబ్లీకి తప్పనిసరిగా హాజరుకావాలని తమ ఎమ్మెల్యేలకు బీజేపీ విప్ జారీ చేసింది.
ఇక మిషన్ మధ్యప్రదేశ్!
జైపూర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో బీజేపీ మధ్యప్రదేశ్‌పై దృష్టిసారించబోతోందన్న వార్తలపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యడియూరప్ప కేబినెట్ ఏర్పాటయ్యాక కొత్త మిషన్ ప్రారంభిస్తామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వాలు కూల్చాలన్నది మా ఉద్దేశం కాదు. కానీ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య అనేక విభేదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు. కాంగ్రెస్‌తో పోల్చుకుంటే ప్రధాని మోదీ నాయకత్వం మంచిదని వారంతా భావిస్తున్నారు. అంతర్గత కలహాలు, కుమ్ములాటలతోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోతున్నాయి’ అని విజయవర్గీయ అన్నారు.
100% విజయం: యడియూరప్ప
సోమవారం జరిగే విశ్వాసపరీక్షలో విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు. ‘సోమవారం అసెంబ్లీలో మెజారిటీని 100 శాతం నిరూపించుకుంటా. ఆర్థిక బిల్లును ఆమోదించకుంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేం. కాబట్టి అసెంబ్లీ ప్రారంభంకాగానే విశ్వాసపరీక్షను ముగించి, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలుపుతాం. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం తయారుచేసిన ఆర్థిక బిల్లునే సభలో ప్రవేశపెట్టబోతున్నాం. ఇందులో చిన్న కామా, ఫుల్‌స్టాప్‌ను కూడా మార్చలేదు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment